Smita Srivastava : పొడవాటి జుట్టుతో ‘గిన్నిస్‌’కెక్కింది!

‘జుట్టుతోనే అమ్మాయిల అందం ఇనుమడిస్తుందం’టోంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్మితా శ్రీవాస్తవ. ఈ ఆలోచనతోనే టీనేజ్‌ దశ నుంచే తన జుట్టును పెంచుతూ పోయిన ఆమె.. తన పొడవాటి జుట్టుతో తాజాగా గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించింది.

Published : 01 Dec 2023 13:37 IST

(Photos: Instagram)

‘జుట్టుతోనే అమ్మాయిల అందం ఇనుమడిస్తుందం’టోంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్మితా శ్రీవాస్తవ. ఈ ఆలోచనతోనే టీనేజ్‌ దశ నుంచే తన జుట్టును పెంచుతూ పోయిన ఆమె.. తన పొడవాటి జుట్టుతో తాజాగా గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించింది. ప్రస్తుతం జీవించి ఉన్న వారిలోనే అత్యంత పొడవైన కురులు కలిగిన మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించిన ఆమె జుట్టు పొడవెంతో తెలుసా? 7 అడుగుల 9 అంగుళాలు. మరి, ఇంత పొడవైన జుట్టును స్మిత ఎలా సంరక్షించుకుంటున్నారు? అసలు జుట్టు పెంచుకోవాలన్న ఆలోచన తనకెలా వచ్చింది? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

స్మితది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌. ఆమెకు చిన్న వయసు నుంచే జుట్టు పొడవుగా, ఒత్తుగా, నల్లగా ఉండేది. తనకే కాదు.. తన తల్లి, అమ్మమ్మకు కూడా జుట్టు పొడవుగానే ఉండేదట! ఇలా జుట్టు విషయంలో వాళ్ల జీన్స్‌ని పుణికిపుచ్చుకున్న ఆమె.. 80ల నాటి బాలీవుడ్‌ అందాల తారల పొడవాటి హెయిర్‌స్టైల్స్‌ని బాగా ఇష్టపడేదట! ఇలా తన పొడవాటి జుట్టుతోనూ అప్పుడప్పుడూ తారల్ని అనుకరించేలా హెయిర్‌స్టైల్స్‌ ప్రయత్నించేదాన్నని చెబుతోంది స్మిత.

అప్పట్నుంచి పెంచుతున్నా!

‘నాకు చిన్న వయసు నుంచే జుట్టు పెంచుకోవడమంటే ఇష్టం. మా అమ్మ, అమ్మమ్మను చూశాక నాకు కేశ సంరక్షణపై మరింత అవగాహన పెరిగింది. అందుకే టీనేజ్‌ దశ నుంచే జుట్టు కత్తిరించుకోవడం ఆపేశా. అలా నా 14 ఏళ్ల వయసులో మొదలైన ఈ ప్రయాణం నేటికీ కొనసాగుతోంది. నిజానికి పొడవాటి జుట్టు మహిళల అందాన్ని ఇనుమడిస్తుంది. ఇక నా జుట్టు సంరక్షణ విషయానికొస్తే.. వారానికి రెండుసార్లు తలస్నానం చేస్తాను. తలంటుకున్నాక జుట్టును టవల్‌తోనే బాగా తుడుచుకుంటా.. అంతేకానీ హెయిర్‌ డ్రయర్స్‌ వాడను. తలస్నానం మొదలు ఆరబెట్టుకోవడం, చిక్కులు తీసుకోవడం, హెయిర్‌స్టైల్‌ వేసుకోవడం.. ఇలా ఈ పనులన్నింటికీ మూడు నుంచి నాలుగ్గంటల సమయం పడుతుంది. నేలపై షీట్‌ పరచుకొని.. మంచంపై నిల్చొని చిక్కులు తొలగించుకుంటా. ఆ తర్వాతే చిక్కుల్లేకుండా దువ్వుకొని హెయిర్‌స్టైల్‌ వేసుకుంటా.. లేదంటే సిగలా ముడేసుకుంటా..’ అంటోంది స్మిత.

సెల్ఫీ ప్లీజ్‌.. అంటున్నారు!

జుట్టును పెంచుకోవడమే కాదు.. తలస్నానం చేసినప్పుడు, దువ్వుకున్నప్పుడు, చిక్కులు తొలగించుకున్నప్పుడు రాలిపోయిన జుట్టును కూడా సేకరిస్తోంది స్మిత.

‘ఉన్నట్లుండి ఓసారి బాగా జుట్టు రాలిపోయింది. ఆ రాలిన వెంట్రుకల్ని బయటపడేయడానికి నాకు మనసొప్పలేదు. అందుకే అప్పట్నుంచి రాలిన జుట్టును కూడా సేకరించడం మొదలుపెట్టా. ఆ జుట్టును ఓ బ్యాగ్‌లో భద్రపరుస్తున్నా. అయితే గత 32 ఏళ్లులో నేను ఒకే ఒక్కసారి జుట్టు కత్తిరించుకున్నా. అది కూడా రెండోసారి గర్భం దాల్చినప్పుడు పలు ఆరోగ్య సమస్యల వల్ల ఒక అడుగు పొడవు మేర కత్తిరించాను. దీంతో జుట్టు పొడవు ఆరడుగులకు చేరుకుంది. ఇక బయటికి వెళ్లినప్పుడు నా పొడవాటి జుట్టును చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. ‘జుట్టు పొడవుగా ఉంటుందని తెలుసు.. కానీ మరీ ఇంత పొడవుంటుందని ఊహించలేదు..’ అంటూ నా కేశాల్ని తాకడానికి ప్రయత్నిస్తుంటారు.. నాతో సెల్ఫీలు, ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపుతుంటారు. కేశ సంరక్షణ కోసం నేను వాడే హెయిర్‌కేర్‌ ఉత్పత్తుల గురించీ తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు..’ అంటోన్న స్మిత.. తన పొడవాటి, ఒత్తైన జుట్టు సంరక్షణలో ఇంటి చిట్కాలదే కీలక పాత్ర అంటోంది.

‘గిన్నిస్‌’లో చోటు!

గత 32 ఏళ్లుగా జుట్టును పెంచుతూ, తన కేశ సంరక్షణ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటోన్న స్మిత.. ప్రపంచంలోనే జీవించి ఉన్న వారిలో అత్యంత పొడవైన కురులు కలిగిన మహిళగా తాజాగా ‘గిన్నిస్‌’ బుక్‌లో చోటు సంపాదించింది. ప్రస్తుతం ఆమె కురుల పొడవు 7 అడుగుల 9 అంగుళాలు.
‘పొడవాటి జుట్టుతో ప్రపంచ రికార్డు సృష్టించాలన్న కోరిక ఎప్పట్నుంచో నా మనసులో ఉంది. అంతేకాదు.. కేశ సంరక్షణ విషయంలో మహిళలందరికీ ఆదర్శంగా నిలవాలనుకున్నా. తాజా ‘గిన్నిస్‌’ రికార్డుతో ఆ కోరిక నెరవేరింది. ఇకపైనా నా జుట్టును కత్తిరించను. ఎందుకంటే కేశాలే నా ఆరోప్రాణం.’ అంటోందీ రియల్‌లైఫ్‌ రాపంజెల్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్