నీటి అడుగున ఫొటోలు క్లిక్‌మనిపిస్తోంది!

సాధారణంగా నీటిలోకి దిగితే శరీరం తేలికవుతుంది. గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా నీళ్లు మన శరీరాన్ని పైకి ఎగదోస్తుంటాయి. అలాంటి చోట కుదురుగా నిల్చోవడం, అడుగు తీసి అడుగు వేయడమే కష్టమనుకుంటే.. ఏకంగా ఫొటోషూట్లు చేస్తూ ఔరా అనిపిస్తోంది భారత సంతతికి చెందిన న్యూయార్క్‌ ఫొటోగ్రాఫర్‌ కృతీ బిసారియా. నీటి అడుగున విభిన్న ఫ్యాషన్‌ ఫొటోలు తీస్తూ....

Updated : 23 Jan 2023 16:12 IST

(Photos: Instagram)

సాధారణంగా నీటిలోకి దిగితే శరీరం తేలికవుతుంది. గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా నీళ్లు మన శరీరాన్ని పైకి ఎగదోస్తుంటాయి. అలాంటి చోట కుదురుగా నిల్చోవడం, అడుగు తీసి అడుగు వేయడమే కష్టమనుకుంటే.. ఏకంగా ఫొటోషూట్లు చేస్తూ ఔరా అనిపిస్తోంది భారత సంతతికి చెందిన న్యూయార్క్‌ ఫొటోగ్రాఫర్‌ కృతీ బిసారియా. నీటి అడుగున విభిన్న ఫ్యాషన్‌ ఫొటోలు తీస్తూ తనదైన ప్రతిభను చాటుకుంటోన్న ఆమె.. తన అండర్‌వాటర్‌ ఫొటోగ్రఫీ స్కిల్స్‌ని పలు ఎగ్జిబిషన్లలో ప్రదర్శిస్తుంటుంది. అలా ఇటీవలే దిల్లీలో జరిగిన ఓ ఎగ్జిబిషన్‌లో.. నీటి అడుగున తాను తీసిన కొన్ని అందమైన చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటుచేసింది కృతి. ఈ చిత్రాలు ఎంతోమంది మనసు దోచుకున్నాయి. ఈ నేపథ్యంలో తాను ఇలాంటి వైవిధ్యమైన కళను ఎంచుకోవడం వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం రండి..

భారత సంతతికి చెందిన కృతీ బిసారియా న్యూయార్క్‌లో పుట్టిపెరిగింది. ఫ్యాషన్‌, ఫొటోగ్రఫీ.. అంటే తనకు చిన్నతనం నుంచే మక్కువ. ఈ ఇష్టంతోనే దిల్లీలోని నిఫ్ట్‌లో ఫ్యాషన్‌ టెక్నాలజీ విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. క్యాలిఫోర్నియాలోని ‘బ్రూక్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ’లో లలిత కళల్లో పీజీ పూర్తిచేసింది. ఆపై న్యూయార్క్‌లోని ‘స్కూల్‌ ఆఫ్‌ విజువల్‌ ఆర్ట్స్‌’లో ఫొటోగ్రఫీ విభాగంలో మాస్టర్స్‌ చేసింది. చదువు పూర్తయ్యాక కొన్నాళ్ల పాటు ఫొటో ఇంటర్న్‌గా, ఫ్రీలాన్స్‌ ఫొటోగ్రాఫర్‌గానూ పనిచేసిందామె.

ఆమె స్ఫూర్తితో..!

ఇలా ఈ రెండు అంశాలకు సంబంధించిన పూర్తి మెలకువలు నేర్చుకున్నాక.. 2016లో ‘కృతీ బిసారియా ఫొటోగ్రఫీ’ పేరుతో తన సొంత స్టూడియోను ప్రారంభించింది కృతి. ఈ క్రమంలో ఫ్యాషన్‌, బ్యూటీకి సంబంధించిన ఫొటోలు తీయడం-వాటికి అదనపు హంగులద్దడంతో పాటు అండర్‌వాటర్‌ ఫ్యాషన్‌ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, వీడియో ఎడిటింగ్‌.. వంటివన్నీ నిర్వర్తిస్తోందామె. అయితే నిఫ్ట్‌లో చదువుకునేటప్పుడే అండర్‌వాటర్‌ ఫొటోగ్రఫీపై మనసు పారేసుకున్నానంటోందీ ఫొటోగ్రఫీ లవర్‌.
‘నిఫ్ట్‌లో చదువుకునేటప్పుడు నా ఫొటో థీసిస్‌ ప్రాజెక్ట్‌ కోసం పనిచేస్తున్నా. ఈ క్రమంలోనే బ్రిటిష్‌ ఫొటోగ్రాఫర్‌ జెనా హోలోవే నీటి అడుగున తీసిన అందమైన చిత్రాలు నా కంట పడ్డాయి. అండర్‌వాటర్‌ ఫొటోగ్రఫీ గురించి నాకు తొలిసారి పరిచయమైంది అప్పుడే! తన పనితీరు, ఆ ఫొటోల్లోని రియాల్టీ చూసి ఈ కళపై మనసు పారేసుకున్నా. అప్పట్నుంచే ఈ తరహా ఫొటోగ్రఫీపై ప్రయోగాలు చేయడం మొదలుపెట్టా. ఈ క్రమంలోనే ఓపెన్‌ వాటర్‌ స్కూబా డైవింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నా. ‘ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌’ నుంచి ఇందులో సర్టిఫికేషన్‌ కూడా అందుకున్నా..’ అంటూ చెప్పుకొచ్చింది కృతి.

ఆ రంగులే కీలకం!

ఓ ఫ్యాషనర్‌గా రాల్ఫ్‌ లారెన్‌, ఫ్లైయింగ్‌ సోలో.. వంటి ప్రముఖ ఫ్యాషన్‌ సంస్థలతో మమేకమై న్యూయార్క్‌, ప్యారిస్‌ ఫ్యాషన్‌ వీక్స్‌ కోసం పనిచేసిన కృతి.. ఫొటోగ్రాఫర్‌గా పలు అంతర్జాతీయ బ్రాండ్స్‌తోనూ కలిసి సేవలందించింది. అయితే సాధారణ ఫొటోగ్రఫీలాగే.. అండర్‌వాటర్‌ ఫొటోగ్రఫీకీ కొన్ని రంగులు వన్నెలద్దుతాయంటోందీ ట్యాలెంటెడ్‌ ఫొటోగ్రాఫర్‌.

‘ఒక ఫొటో అందంగా, సహజంగా కనిపించాలంటే.. ధరించే దుస్తులూ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే నీళ్లు నీలం రంగులో ఉంటాయి. కాబట్టి అండర్‌వాటర్‌ ఫొటోగ్రఫీ కోసం నీలం, ఈ రంగు షేడ్స్‌తో రూపొందించిన దుస్తులకు దూరంగా ఉండడం మంచిది. ఇక ఈ తరహా ఫొటోగ్రఫీ కోసం ఎరుపు, ఆకుపచ్చ, నలుపు.. వంటి ముదురు రంగుల్లో ఉన్న దుస్తులు ఎంచుకోవడంతో పాటు.. వేసుకునే దుస్తులు కూడా తేలిగ్గా, నీటిలో తేలియాడేలా ఉన్నప్పుడే ఫొటో అందం ఇనుమడిస్తుంది. అందుకే నీటి అడుగున ఫ్యాషన్‌ షూట్‌ తీసే క్రమంలో ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుంటా. అలాగే ఇందులో పాల్గొనే మోడల్స్‌తో ఆయా పోజుల్ని ముందు నుంచే సాధన చేయిస్తుంటా. షూట్‌ జరుగుతున్నంత సేపు నీటి అడుగున ఎలాంటి ప్రమాదం జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటా. ఈ క్రమంలో ఆయా సురక్షితమైన పరికరాల్ని వెంటే ఉంచుకుంటాం. కెమెరా నీటిలో తడవకుండా ప్రత్యేకమైన సేఫ్టీ కిట్‌లో దాన్ని ఉంచి ఫొటోల్ని క్లిక్‌మనిపిస్తా.. నీటిలో తేలియాడుతూ విభిన్న పోజుల్లో ఫొటోలు చిత్రీకరించడంలో ఉన్న అనుభూతే వేరు. అయితే దీనికి ముందస్తు అభ్యాసంతో పాటు కాస్త ఓపిక కూడా కావాలి..’ అంటోంది కృతి.

ఇలా తాను తీసిన అండర్‌వాటర్‌ ఫ్యాషన్‌ ఫొటోగ్రఫీకి సంబంధించిన ఫొటోల్ని ఇటీవలే దిల్లీలోని ఓ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచింది కృతి. ఈ ఫొటోలు చూసిన చాలామంది ఆమె ప్రతిభను, అరుదైన నైపుణ్యాల్ని ప్రశంసల్లో ముంచెత్తారు. ఇక ఇలా తాను తీసిన విభిన్న ఫొటోల్ని సోషల్‌ మీడియాలోనూ పోస్ట్‌ చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుందీ ట్యాలెంటెడ్‌ ఫొటోగ్రాఫర్‌.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్