Published : 12/10/2022 20:21 IST

ఒత్తిడిని జయించే ఆహారం!

గర్భధారణ సమయంలో శరీరంలో జరిగే మార్పులు, హార్మోన్ల స్థాయుల్లో తేడాల కారణంగా ఈ సమయంలో ఒత్తిడి, ఆందోళనలు సహజమే! అయితే ఇలా ఒత్తిడికి లోనవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. గర్భంతో ఉన్నప్పుడు ఈ సమస్యల్ని జయించాలంటే ఆహారమే అత్యుత్తమమైన ఔషధం అంటున్నారు. ఇందుకోసం కొన్ని రకాల ఆహార పదార్థాల్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

అందుకే ‘సి’ విటమిన్!

రోగ నిరోధక శక్తిని పెంపొందించే ‘సి’ విటమిన్‌ ఒత్తిడిని కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు నిపుణులు. గర్భిణులు దీన్ని తీసుకోవడం వల్ల వారిలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్‌ హార్మోన్లు తగ్గుముఖం పడతాయట! తద్వారా ఒత్తిడి, ఆందోళనలు దూరమవుతాయి. ఇందుకోసం కమలాఫలం, నిమ్మకాయ, బ్రకలీ, స్ట్రాబెర్రీ, బంగాళాదంపలు రోజువారీ మెనూలో చేర్చుకోవాలి.

పాలు-పాల పదార్థాలు మంచివి!

గర్భిణులు ఆరోగ్యకరమైన బరువును కొనసాగించాలంటే ప్రొటీన్‌ తీసుకోమని సలహా ఇస్తుంటారు నిపుణులు. ఈ క్రమంలో పాలు, పాల పదార్థాలు రోజువారీ మెనూలో చేర్చుకోమంటారు. అయితే పాలు తాగడం వల్ల గర్భిణిగా ఉన్నప్పుడు ఎదురయ్యే ఒత్తిడిని కూడా దూరం చేసుకోవచ్చట! పాలలో ఉండే లాక్టియమ్‌ అనే ప్రొటీన్‌ ఒత్తిడితో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తుంది. ఫలితంగా బీపీ కూడా అదుపులో ఉంటుంది. అంతేకాదు.. పాలు, పాల పదార్థాల్ని రోజూ తీసుకోవడం వల్ల రాత్రుళ్లు హాయిగా నిద్ర పడుతుంది.. ఇక సోయా పాలు తాగే వారికి దీని ద్వారా క్యాల్షియం, పొటాషియం, ‘ఎ’, ‘డి’ విటమిన్లు, ప్రొటీన్లు తగినంత లభిస్తాయని, ఈ పోషకాలన్నీ పిండం ఆరోగ్యంగా ఎదగడానికి దోహదం చేస్తాయని చెబుతున్నారు నిపుణులు.

చేపలతో ఒత్తిడికి చెక్!

ఒత్తిడి, ఆందోళనలు, మూడ్‌ స్వింగ్స్‌తో బాధపడే గర్భిణులు సీఫుడ్ ఎక్కువగా తింటే మంచిదని చెబుతున్నారు నిపుణులు. ప్రత్యేకించి చేపల్లో అధికంగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ‘డి’ విటమిన్‌.. వంటి పోషకాలు ఒత్తిడిని తగ్గించి మంచి మూడ్‌ని సొంతం చేసుకోవడానికి దోహదపడతాయట! అంతేకాదు.. ఈ ఫ్యాటీ ఆమ్లాలు పుట్టబోయే బిడ్డ మెదడు అభివృద్ధికీ దోహదం చేస్తాయట! అయితే గర్భిణిగా ఉన్నప్పుడు చేపలు తినడం మంచిది కాదన్న అపోహ కూడా కొంతమందిలో ఉంటుంది. కానీ అది నిజం కాదని.. దాన్ని పక్కన పెట్టి నిస్సంకోచంగా చేపల రుచిని ఆస్వాదించమంటున్నారు నిపుణులు.

సంతోషాన్నిచ్చే ‘ధాన్యాలు’!

గర్భిణిగా ఉన్నప్పుడు ఎంత సంతోషంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటే అంత చురుకైన బిడ్డ పుడతాడని చెబుతుంటారు. మరి, అలాంటి ఆనందం మీ సొంతం కావాలంటే రోజూ తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోమంటున్నారు నిపుణులు. బ్రౌన్‌ రైస్‌, ఓట్‌మీల్‌, గోధుమ బ్రెడ్‌, కాయధాన్యాలు.. వంటివి తీసుకున్నప్పుడు మెదడులో ఎండార్ఫిన్లు (హ్యాపీ హార్మోన్లు) విడుదలవుతాయట. ఇవి ఒత్తిడితో పోరాడి సంతోషాన్ని మన సొంతం చేస్తాయి. అలాగే ఈ పదార్థాలు సెరటోనిన్‌ అనే మరో హార్మోన్‌ని విడుదల చేస్తాయి. ఫలితంగా ఒత్తిడి దూరమవడంతో పాటు ఆరోగ్యంగానూ ఉండచ్చట!

పచ్చివీ మంచివే!

పచ్చి కాయగూరలు, పండ్లు, ఆకుకూరల్లో ఒత్తిడితో పోరాడే గుణాలు అధికంగా ఉన్నాయని చెబుతోంది ఓ అధ్యయనం! ముఖ్యంగా వీటిలో ఎక్కువగా ఉండే మెగ్నీషియం శరీరంలో కార్టిసాల్‌ (ఒత్తిడి హార్మోన్‌) స్థాయుల్ని తగ్గించి.. బీపీని అదుపులో ఉంచడంలో సహకరిస్తుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో సలాడ్స్‌, జ్యూసుల రూపంలో వీటిని తీసుకోవచ్చు.

అయితే ఏది తీసుకున్నా పోషకాహార నిపుణుల సలహాలను బట్టి మితంగా తీసుకోవడం మంచిది. అలాగే తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తినడం వల్ల తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా, దాని ప్రభావం మూడ్‌పై పడకుండా జాగ్రత్తపడచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని