వ్యాపారాల్లోనూ... తగ్గేదేలే!

వ్యాపారమంటేనే ఓ పరుగు పందెం. ఏమాత్రం అలసట చూపినా.. వెనకబడే ప్రమాదముంది. అయితేనేం సవాళ్లకు మేం సై అంటూ వ్యాపార రంగంలోకి వస్తున్న మహిళలెందరో! నిరాశ, అనుమానాలు, అవమానాలూ.. అన్నింటినీ తట్టుకొని నిలబడి తమ తలరాతను తామే లిఖించుకుంటున్నారు.. స్ఫూర్తిప్రదాతలుగా నిలుస్తున్నారు.

Updated : 27 Dec 2022 02:37 IST

వ్యాపారమంటేనే ఓ పరుగు పందెం. ఏమాత్రం అలసట చూపినా.. వెనకబడే ప్రమాదముంది. అయితేనేం సవాళ్లకు మేం సై అంటూ వ్యాపార రంగంలోకి వస్తున్న మహిళలెందరో! నిరాశ, అనుమానాలు, అవమానాలూ.. అన్నింటినీ తట్టుకొని నిలబడి తమ తలరాతను తామే లిఖించుకుంటున్నారు.. స్ఫూర్తిప్రదాతలుగా నిలుస్తున్నారు. ఈ ఏడాది ఔరా అనిపించిన కొందరు వీళ్లు..

మొదటి ఘనత తనదే

ర్థికరంగం అమ్మాయిలకు తగదన్న మాటల్ని తోసి పుచ్చి ఫిన్‌టెక్‌ రంగంలో దూసుకెళుతోంది రుచి కల్రా! తొమ్మిదేళ్ల ఉద్యోగానుభవం. ఇక సొంతంగా ఏదైనా చేయాలని భర్తతో కలిసి 2016లో ‘ఆఫ్‌బిజినెస్‌’ ప్రారంభించింది. మధ్యతరగతి అమ్మాయి. దిల్లీ ఐఐటీలో ఇంజినీరింగ్‌, ఐఎస్‌బీ, హైదరాబాద్‌ నుంచి ఎంబీఏ చేసింది. ఇ-వాల్యూ సర్వ్‌, మెకిన్సే వంటి సంస్థలకు పనిచేసింది. కార్పొరేట్‌లకు వ్యాపార, ఆర్థిక సలహాలివ్వడానికి ఎన్నో సంస్థలుంటాయి. చిన్న మధ్యతరహా సంస్థలకు ఆర్థిక అండ ఇచ్చే వారు అరుదు. ఆ పని తానే చేయాలని 2017లో ఫిన్‌టెక్‌ సంస్థ ‘ఆక్సిజో’ ప్రారంభించింది. భర్త ఆశిష్‌ మహాపాత్రతోపాటు మరో ముగ్గురు తనతో కలిశారు. దీనికి 39 ఏళ్ల రుచి చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌. ఈ ఏడాది ప్రారంభంలో భర్త సంస్థతోపాటు ‘యూనికార్న్‌’ (సంస్థ విలువ రూ.10వేల కోట్లకు పైమాటే) హోదా దక్కించుకొని యూనికార్న్‌ సంస్థలను నిర్వహిస్తున్న దంపతులుగా నిలిచారు. ‘లాభదాయకమైన ఫిన్‌టెక్‌ యూనికార్న్‌ను నిర్వహిస్తోన్న తొలి భారతీయ మహిళ’ కూడా తనే.


సాయం.. వ్యాపారమైంది!

కొందరికి వ్యాపారం కల. బెంగళూరు అమ్మాయి రాజోషి ఘోష్‌కి మాత్రం ఇదో అలవాటు. సింగపూర్‌ యూనివర్సిటీ నుంచి కంప్యుటేషనల్‌ జీనోమిక్స్‌లో డిగ్రీ, స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ప్రోగ్రామ్‌ చేసింది. అవెలింక్‌, టెక్‌ సలూన్‌, ఫైండ్‌ ఎ కడాయి, 34 క్రాస్‌ వంటి స్టార్టప్‌లను ప్రారంభించింది. తన ఫుడ్‌ స్టార్టప్‌ కోసం కోఫౌండర్‌ తన్మయ్‌తో కలిసి యాప్‌  తయారు చేసేప్పుడు ఎన్నో సమస్యలొచ్చాయి. అయితే తను వాటిని సులువుగా పరిష్కరించ గలిగింది. దాన్ని చూసి ఓ స్నేహితుడు సాయమడిగాడు. ఇలా మరెందరికో చేసిచ్చారు. దీన్నే వ్యాపారంగా మలిస్తే అన్న ఆలోచనతో 2017లో ‘హసుర’ ప్రారంభమైంది. కన్సల్టేషన్‌, అప్లికేషన్‌ తయారీ వంటివన్నీ చేసిస్తుందీ సంస్థ. ఇన్నోవేషన్‌ విభాగంలో ఎన్నో పురస్కారాలు అందుకున్న ‘హసుర’కి ఈ ఫిబ్రవరిలో ‘యూనికార్న్‌’ హోదా కూడా దక్కింది.


మూడేళ్లలో రూ.వంద కోట్లు

కెరియర్‌ అయినా, వ్యాపారమైనా నచ్చిన దాంట్లో అడుగుపెడితే రాణించడం ఖాయమంటుంది కత్రినా కైఫ్‌. సినిమా తారగా సుపరిచితురాలైన తను 2019లో ‘కే బ్యూటీ’తో వ్యాపారంలోకీ అడుగుపెట్టింది. తను వాడే ప్రతి మేకప్‌ ఉత్పత్తి గురించీ చాలా పరిశోధన చేస్తుంది. భారతీయుల అన్ని చర్మ తీరులకు తగ్గ ఉత్పత్తులు లభించకపోవడం, జంతు హింస లేనివాటిని అందించాలన్న ఉద్దేశంతో ఏళ్ల పరిశోధన తర్వాత ‘కే బ్యూటీ’ ప్రారంభించింది. దాన్నీ ఏడాది రూ.100 కోట్లకుపైగా వ్యాపారంగానూ మలచింది. ఏ వ్యాపారానుభవమూ లేకుండా ఈ దశకు చేరి ‘ఫోర్బ్స్‌ సెల్ఫ్‌ మేడ్‌ విమెన్‌-2022’ జాబితాలో చోటునీ దక్కించుకుంది.


50ల్లో వ్యాపారం..

క మొక్కనీ పెంచి ఎరుగని అనుజ్‌ శ్రీవాస్తవ.. వేల మంది రైతులకు ఉపాధి కల్పిస్తోంది. తనది బెంగళూరు. అమెరికాలో మార్కెటింగ్‌, అడ్వర్టైజింగ్‌ విభాగంలో పనిచేసింది. వ్యవసాయాధారిత దేశమైన భారత్‌లో రైతులెందుకు నష్టాలు చవిచూస్తున్నారో అర్థం కాలేదు. మార్కెట్‌లోనేమో ఆహార పదార్థాలకి విపరీతమైన గిరాకీ. ఈ సమస్యకొక పరిష్కారం కనుక్కోవాలని తిరిగొచ్చి పరిశోధన చేసింది. తులసి, ఆవ, పుదీన వంటి వాటిని పేస్ట్‌లుగా అమ్మితే.. వాటికి అనూహ్యమైన డిమాండ్‌! దీంతో గుడ్‌గావ్‌లో మహిళా రైతుల సాయంతో 2012లో ఆరోగ్యకరమైన స్నాక్స్‌, డిప్స్‌, సాస్‌ల ఉత్పత్తి (‘విన్‌ గ్రీన్స్‌ ఫామ్స్‌’) ప్రారంభించింది. వేల మంది రైతులు, మహిళలకు ఉపాధి కల్పిస్తున్న ఈ సంస్థ వ్యాపారం రూ.400కోట్లు పైమాటే. ఎన్నో అవార్డులను అందుకొన్న ఈమె ఈఏడాది స్వశక్తితో ఎదిగిన మహిళగా ఫోర్బ్స్‌ జాబితాలోనూ నిలిచింది.


ఈ ఏడాది 21 సంస్థలు ‘యూనికార్న్‌’లుగా నిలిస్తే.. వాటిలో ఏడింటికి మహిళలే కోఫౌండర్లు.

* మాబెల్‌ చకో (ఓపెన్‌) * షగుఫ్తా అనురాగ్‌ (లివ్‌స్పేస్‌) * స్మితా దియోరా (లీడ్‌) * శ్రీవిద్యా శ్రీనివాసన్‌ (అమాగీ) * విల్మా మటిలా (ఫైర్‌). వీళ్లే కాదు.. ఏ నేపథ్యం లేకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి రాణిస్తున్న మహిళలెందరో.. వాళ్ల స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగడమిక మనవంతు!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్