స్ఫూర్తికి...టికెట్‌.. టికెట్‌!

సమయం సరిపోవడం లేదు... ఓపిక లేదు అనేవారు వీళ్ల గెలుపు కథ వింటే సాకులు వెతకడానికి సిగ్గు పడతారు. ఇంతకీ ఏంటి వీళ్ల స్ఫూర్తిగాథ అంటారా? కండక్టర్‌ ఉద్యోగం అంటే అంత తేలికైన పని కాదు.. రోజంతా నిలువుకాళ్ల ఉద్యోగం.

Updated : 23 Dec 2022 07:31 IST

సమయం సరిపోవడం లేదు... ఓపిక లేదు అనేవారు వీళ్ల గెలుపు కథ వింటే సాకులు వెతకడానికి సిగ్గు పడతారు. ఇంతకీ ఏంటి వీళ్ల స్ఫూర్తిగాథ అంటారా? కండక్టర్‌ ఉద్యోగం అంటే అంత తేలికైన పని కాదు.. రోజంతా నిలువుకాళ్ల ఉద్యోగం. శారీరకంగా బోలెడు శ్రమ. రోజంతా ఆ పని చేశాక ఇక మరోపని చేయడానికి ఎవరైనా సాహసించగలరా? కానీ ఈ కండక్టరమ్మలు అలా కాదు.. పట్టుబట్టి క్రీడల్లో సాధన చేశారు. బంగారు పతకాలు కొల్లగొట్టి విజేతలుగా నిలిచారు.. 


పరుగాపని పయనం..

‘ఉదయం 5 గంటలకే డ్యూటీకి ఎంత క్రమశిక్షణగా వెళ్లేదాన్నో.. సాయంత్రం ఆరైతే అంతే శ్రద్ధగా గ్రౌండ్‌కి వెళ్లి పరుగు సాధన చేసేదాన్ని’ అనే 45 ఏళ్ల స్వరాజ్యలక్ష్మి స్వస్థలం హైదరాబాద్‌లోని మచ్చబొల్లారం. తండ్రి బైరి కనకయ్య దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగి. మలక్‌పేటలోని కులీకుతుబ్‌షా కళాశాలలో ఐటీఐ పూర్తి చేసిన లక్ష్మికి చిన్నతనం నుంచీ అథ్లెటిక్‌ పోటీల్లో పాల్గొనడం ఇష్టం. చదువుకుంటూనే వాటిపై దృష్టి పెట్టింది.. 2000 సంవత్సరంలో ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగం వచ్చినా సాధన ఆపలేదు. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 1గం. వరకు విధులు. సాయంత్రం 4- 6గం. వరకు పరుగులో సాధన. ఆ అంకితభావమే ఆమెకి పరుగుపోటీల్లో 37 పతకాలు సాధించిపెట్టి అధికారుల నుంచి ప్రశంసలు అందించింది. ‘మావారు ధనరాజ్‌ ప్రైవేటు ఉద్యోగి. ఆయన ప్రోత్సాహంతోనే పరుగులో రాణిస్తున్నా. గ్రౌండ్‌కీ, పోటీలకీ ఆయనే స్వయంగా తీసుకెళ్లేవారు. మాకో అబ్బాయి. తొమ్మిదో తరగతి. కుటుంబ ప్రోత్సాహం ఉంది కాబట్టే ఇల్లు, కెరియర్‌, పరుగు పోటీలను సమన్వయం చేసుకోగలుగుతున్నా. ఇప్పటివరకు 18 బంగారు, 9 వెండి, 10 కాంస్య పతకాలు సాధించా. తాజాగా ఈ నెల మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఇంటర్నేషనల్‌ అథ్లెటిక్‌ పరుగు పోటీల్లో రజతం సాధించా. ఏం సాధించాలన్నా ఆడవాళ్లకి ఫిట్‌నెస్‌ ముఖ్యం. ఒలింపిక్స్‌కు వెళ్లాలన్నది నా లక్ష్యం’ అంటున్నారు స్వరాజ్యలక్ష్మి.

-  కాకుమాని సుబ్బారావు, హైదరాబాద్‌


వయసు 39.. పతకాలేమో 46!

తండ్రి కౌలు రైతు. అంతంత మాత్రపు ఆదాయం. ఆ పరిస్థితులేవీ.. ఆటలపై మంజులకున్న ఇష్టాన్ని తగ్గించలేకపోయాయి. అందుకే స్కూలు పూర్తయ్యేనాటికే 21 బంగారు పతకాలు ఆమె ఖాతాలోకి చేరాయి. తర్వాతా ఆ ఉత్సాహాన్ని కొనసాగించిందామె..

‘వికారాబాద్‌ జిల్లా డి.ఎన్కేపల్లి మాది. నాన్న లక్ష్మయ్య అమ్మ సాయమ్మ. అమ్మానాన్నలకి మేం ముగ్గురం ఆడపిల్లలం. ఆర్థిక సమస్యలున్నప్పటికీ నాన్న నన్ను డిగ్రీ చదివించారు. ఇంటర్‌ వరకు నవోదయలో చదివాను. ఆరోతరగతి నుంచే ఆటలంటే ఇష్టం. మా పీఈటీ మాస్టార్లు మురహరిరావు, వసుంధరాదేవి ప్రోత్సాహంతో రీజనల్‌ నుంచి ఇంటర్నేషనల్‌ స్థాయికి చేరుకున్నా. లాంగ్‌జంప్‌, హైజంప్‌, 100మీ. పరుగు పందాల్లో రాణించా. స్కూలింగ్‌ ముగిసేనాటికి 21 బంగారు పతకాలు సాధించా. డిగ్రీలో ఎన్‌సీసీ కెప్టెన్‌గా ‘సి’ సర్టిఫికెట్‌ పొందా. చదువయ్యాక పెళ్లి. మావారు ఆంజనేయులు ప్రోత్సాహంతో చదువు, ఆటల్ని కొనసాగించాను. 2010లో నేను మావారు పోటీపరీక్షలకు సన్నద్ధమై ఉద్యోగాలు సాధించాం.  ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. ఇద్దరు పిల్లలు. హైస్కూల్‌ చదువుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాం. ఈ ఐదేళ్లలో 25 బంగారు, 15 కాంస్య, 10 రజత పతకాలు సొంతం చేసుకున్నా’ అనే మంజుల విధి నిర్వహణలోనూ ఉత్తమ ఉద్యోగినిగా ప్రశంసలు పొందారు. ‘ఎస్సై కావాలని ఐదుసార్లు ప్రయత్నించా. అన్నింటిలోనూ ఉత్తీర్ణత సాధించినా బరువులో తేడాతో ఉద్యోగం రాలేదు. నాకొచ్చిన కండక్టర్‌ వృత్తినే ప్రేమిస్తూ అందులో రాణించాలని శ్రమిస్తున్నా అంటోందీ’ కండక్టరమ్మ.

- గొల్లగూడెం జయపాల్‌రెడ్డి, వికారాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్