Sunita Williams: అంతరిక్షంలో సునీత.. సంతోషంతో చిందేసి..!

‘ఎన్నాళ్లో వేచిన ఉదయం..’ అన్నట్లుగా.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన కల నిజమైతే ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం! అందుకే డ్యాన్స్‌ చేసి మరీ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌. ముచ్చటగా మూడోసారి ఆమె అంతరిక్షంలోకి అడుగుపెట్టడమే ఇందుకు కారణం!

Published : 08 Jun 2024 12:42 IST

(Photos: Twitter)

‘ఎన్నాళ్లో వేచిన ఉదయం..’ అన్నట్లుగా.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన కల నిజమైతే ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం! అందుకే డ్యాన్స్‌ చేసి మరీ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌. ముచ్చటగా మూడోసారి ఆమె అంతరిక్షంలోకి అడుగుపెట్టడమే ఇందుకు కారణం! పలుమార్లు వాయిదా పడిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌక.. తాజాగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రా (ISS)నికి సురక్షితంగా అనుసంధానమవడంతో సునీత కల నెరవేరినట్లయింది. అందుకే స్పేస్‌ స్టేషన్‌లో కాలు మోపగానే.. జోష్‌తో స్టెప్పులేసిందామె. అయితే ఆమెకు అంతరిక్ష యాత్ర కొత్త కాదు.. అయినా ‘మళ్లీ తన సొంతింటికి తిరిగొచ్చినట్లుంది’ అంటూ ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేయడం విశేషం.

సంతోషంతో చిందేసి!

నాసా తన ‘కమర్షియల్‌ క్రూ ప్రోగ్రామ్‌’లో భాగంగా తొలి మానవ సహిత స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు ఇటీవలే రంగం సిద్ధం చేసింది. తాజాగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) చేరుకున్న ఈ ‘బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌక’లో సునీతతో పాటు మరో వ్యోమగామి బచ్‌ విల్‌మోర్‌ ప్రయాణించారు. నిజానికి ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ మే 6నే లాంచ్‌ కావాల్సింది! కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగం పలుమార్లు వాయిదా పడింది. దాంతో కొన్నేళ్లుగా ఈ ప్రయోగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సునీత మరికొన్నాళ్లు ఆగాల్సి వచ్చింది. తాజాగా తన ఎదురుచూపులకు తెరపడడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అందుకే వ్యోమనౌక నుంచి ఐఎస్‌ఎస్‌లోకి అడుగుపెట్టీ పెట్టగానే డ్యాన్స్‌తో చిందులేసిందామె. భార రహిత స్థితిలో ఉండి కూడా చేతులు, కాళ్లు కదుపుతూ జోష్‌తో తన అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేసింది సునీత.

‘మళ్లీ సొంతింటికొచ్చినట్లు ఫీలవుతున్నా.. స్పేస్‌ స్టేషన్‌లోని క్యాబిన్‌ క్రూ నా మరో ఫ్యామిలీ!’ అంటూ సంబరపడిపోయిందీ ఇండో-అమెరికన్‌ వ్యోమగామి. ఇలా ఆమె డ్యాన్స్‌ చేసిన వీడియోను ‘బోయింగ్‌ స్పేస్‌’ ఎక్స్‌లో పోస్ట్‌ చేయగా.. ప్రస్తుతం అది వైరలవుతోంది.

ఏంటీ ‘గంట సంప్రదాయం’?!

వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌కు అనుసంధానం అయిన మరుక్షణం.. అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన సునీత, విల్‌మోర్‌లను.. ఇదివరకే అక్కడున్న ఏడుగురు వ్యోమగాములు గంట కొట్టి మరీ స్వాగతం పలికారు. ఇలా ఇప్పుడే కాదు.. అంతరిక్ష కేంద్రంలో ఎన్నో ఏళ్లుగా ఈ గంట సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న వ్యోమగాముల బృందానికి స్వాగతం పలకడం, ఐఎస్‌ఎస్‌ నుంచి నిష్క్రమించే బృందానికి వీడ్కోలు పలకడంలో భాగంగా ఇలా గంట మోగిస్తారు. నిజానికి ఇది అమెరికా నౌకాదళం నుంచి ఆపాదించుకున్న సంప్రదాయమట! ప్రాచీన కాలంలో అధికారులు, అడ్మిరల్‌ల రాక, నిష్క్రమణకు సూచనగా ఓడలోని గంటను మోగించేవారట! కాలక్రమేణా ఇదే సంప్రదాయాన్ని స్వీకరించిన నాసా.. గత కొన్నేళ్లుగా ఐఎస్‌ఎస్‌లో ఈ ట్రెడిషన్‌ని పాటిస్తూ వస్తోంది. ఇలా గంట కొట్టి సునీతను ఐఎస్‌ఎస్‌లోకి ఆహ్వానించిన మరుక్షణం.. వ్యోమగాముల బృందమంతా ఆమెను గుండెలకు హత్తుకొని స్వాగతం పలికారు. ఇలా వారితోనూ తన ఆనందాన్ని పంచుకుందీ స్పేస్‌ లవర్.

‘తొలి మహిళ’గా ఘనత!

కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెట్టిన రెండో ఇండో-అమెరికన్‌ మహిళగా ఖ్యాతి గాంచిన సునీత.. తాజాగా ముచ్చటగా మూడోసారి స్పేస్‌లోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో మరో ఘనతనూ సొంతం చేసుకున్నారామె. నాసా తొలిసారి ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ ‘బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌక’కు సునీతే పైలట్‌గా వ్యవహరించారు. ఇలా తొలిసారిగా అంతరిక్షయానం చేసిన మానవ సహిత వ్యోమనౌకకు పైలట్‌గా వ్యవహరించిన తొలి మహిళగా సునీత ఘనత సాధించారు. ఫ్లోరిడాలోని ‘కేప్‌ కనావెరల్‌ స్పేస్‌ ఫోర్స్‌ స్టేషన్‌’ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్‌ 25 గంటల్లో ఐఎస్‌ఎస్‌ను చేరుకోవాల్సింది. కానీ పలు సాంకేతిక కారణాల రీత్యా స్పేస్‌ స్టేషన్‌ చేరడానికి గంట ఆలస్యమైంది. వారం పాటు అంతరిక్షంలో గడపనున్న సునీత, విల్‌మోర్‌లు.. ఈ క్రమంలో పలు ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఆపై ‘సాలిడ్‌ గ్రౌండ్‌ ల్యాండింగ్‌’ పద్ధతిలో తిరిగి భూమి పైకి చేరుకోనున్నారు.

Sunita Williams: అప్పుడు అంతరిక్షంలోకి భగవద్గీత తీసుకెళ్లా!Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్