Sunita Williams: అప్పుడు అంతరిక్షంలోకి భగవద్గీత తీసుకెళ్లా!

భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ గురించి తెలియని వారుండరు. కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో ఇండో-అమెరికన్‌ మహిళగా ఖ్యాతి గడించారామె. ఇప్పటికే రెండుసార్లు అంతరిక్ష యానం చేసొచ్చిన సునీత.. మళ్లీ రోదసీ యాత్రకు సిద్ధమవుతున్నారు.

Published : 27 Apr 2024 12:59 IST

(Photos: Twitter)

భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ గురించి తెలియని వారుండరు. కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో ఇండో-అమెరికన్‌ మహిళగా ఖ్యాతి గడించారామె. ఇప్పటికే రెండుసార్లు అంతరిక్ష యానం చేసొచ్చిన సునీత.. మళ్లీ రోదసీ యాత్రకు సిద్ధమవుతున్నారు. నాసా రూపొందించిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో ముచ్చటగా మూడోసారి అంతరిక్షంలోకి దూసుకెళ్లనున్న ఈ మహిళా వ్యోమగామి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

మూడోసారి!

నాసా తన ‘కమర్షియల్‌ క్రూ ప్రోగ్రామ్‌’లో భాగంగా తొలి మానవ సహిత స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది. ఇందులో సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బచ్‌ విల్‌మోర్‌ అంతరిక్ష యానం చేయనున్నారు. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ మే 6న ఫ్లోరిడాలోని స్పేస్‌ లాంచ్‌ కాంప్లెక్స్‌-41 నుంచి రోదసీలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్‌లో వీరిద్దరూ ప్రయాణించి ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రా (ISS)’నికి చేరుకొని.. అక్కడ వారం రోజుల పాటు ఉండనున్నారు. ఇలా ఈ ప్రయోగం ద్వారా స్పేస్‌క్రాఫ్ట్‌ శక్తిసామర్థ్యాల్ని నాసా పరిశీలించనుంది. ఈ పర్యటన విజయవంతమైతే.. అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్ల కోసం స్టార్‌లైనర్‌ను సర్టిఫై చేసే ప్రక్రియను నాసా ప్రారంభిస్తుంది. ఇలా ఈ పర్యటనతో ముచ్చటగా మూడోసారి అంతరిక్ష యాత్ర చేయనున్నారు సునీత. ప్రస్తుతం ఇందుకోసం శిక్షణ తీసుకుంటున్నారామె.

వాళ్లే నా స్ఫూర్తి!

అమెరికాలోని ఒహాయో పట్టణంలో 1965లో జన్మించారు సునీత. ఆమె తండ్రి గుజరాతీ. తల్లి స్లొవేనియన్‌. మసాచుసెట్స్‌లోని నీధమ్‌ హైస్కూల్‌లో స్కూలింగ్‌ పూర్తిచేసిన ఆమె.. యూఎస్‌లోని నావల్‌ అకాడమీలో ఫిజిక్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు. ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ పూర్తిచేసిన సునీత.. తొలుత అమెరికన్‌ నావికా దళంలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. డైవింగ్‌ ఆఫీసర్‌గా కొన్నాళ్ల పాటు పనిచేసిన ఆమె.. అంతరిక్షంపై మక్కువతో 1998లో రోదసీ యానానికి సంబంధించిన శిక్షణ తీసుకున్నారు. అయితే వ్యోమగామి కావాలన్న తన కలకు తన తల్లిదండ్రులే స్ఫూర్తి అంటూ ఓ సందర్భంలో పంచుకున్నారు సునీత.

‘అమ్మానాన్నలు యూఎస్‌ఏకి వలస వచ్చాక ఇక్కడ స్థిరపడడానికి చాలా కష్టపడ్డారు. వాళ్ల కష్టాన్ని కళ్లారా చూసిన నేను.. చదువుపై మరింత దృష్టి పెట్టాను. వాళ్ల స్ఫూర్తి, ప్రోత్సాహమే నేను అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టేందుకు దోహదం చేసింది. మన జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్లు ముందుకు సాగదని కొంతమంది నాతో అనేవారు. కానీ వ్యోమగామిగా స్థిరపడాలనుకున్న ఆలోచన పుట్టాక.. నాకు నచ్చేలా నా జీవితాన్ని మలచుకోవాలని సంకల్పించుకున్నా. ఈ పట్టుదలే నా కల నెరవేర్చింది..’ అంటారామె.

భగవద్గీత వెంట తీసుకెళ్లా!

నాసా వ్యోమగామిగా ఇప్పటికే రెండుసార్లు అంతరిక్ష యాత్ర చేశారు సునీత. తన తొలి పర్యటనలో భాగంగా 2006 డిసెంబర్‌ నుంచి 2007 జూన్‌ వరకు.. సుమారు ఏడు నెలల పాటు ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం’లో గడిపారామె. ఈ సమయంలోనే 29 గంటల 17 నిమిషాల పాటు ఐఎస్‌ఎస్‌ వెలుపల నాలుగుసార్లు స్పేస్‌వాక్‌ చేశారు. ఇది అప్పట్లో రికార్డుగా నిలిచింది. ఇక 2012లో రెండోసారి అంతరిక్ష యాత్రకు వెళ్లారు సునీత. ఈ క్రమంలో నాలుగు నెలల పాటు ఐఎస్‌ఎస్‌లోనే గడిపిన ఆమె.. అక్కడి ఆర్బిటింగ్‌ ల్యాబొరేటరీపై పరిశోధనలు చేశారు. ఈ సమయంలోనూ అంతరిక్షంలో నడిచిన ఆమె.. మొత్తంగా 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్‌ చేసి.. ఎక్కువ సమయం స్పేస్‌వాక్‌ చేసిన రెండో మహిళా వ్యోమగామిగా చరిత్రకెక్కారు. ఇలా రెండు స్పేస్షటిల్స్‌తో కలిపి మొత్తంగా 322 రోజులు అంతరిక్షంలో గడిపారు సునీత. అయితే తన మొదటి అంతరిక్ష యాత్రలో భాగంగా.. తన వెంట మినీ భగవద్గీత పుస్తకం తీసుకెళ్లానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారామె.

‘మొదటి స్పేస్‌టూర్‌ కోసం సూట్‌లో రడీ అవడానికి రెండు గంటలు పట్టింది. తొలిసారి అంతరిక్షం నుంచి భూమిని చూడడం నా జీవితంలోనే మర్చిపోలేని మధురానుభూతి. అంతరిక్ష కేంద్రంలో భార రహిత స్థితిలో తలకిందులుగా తేలియాడుతూ పనులు చేసుకోవడం సరదాగా అనిపించేది.. ఇక తొలి అంతరిక్ష యానంలో భాగంగా మా నాన్న బహుమతిగా ఇచ్చిన మినీ భగవద్గీత పుస్తకం, ఉపనిషత్తులు నా వెంట తీసుకెళ్లా..’ అంటూ నాటి అనుభవాల్ని నెమరువేసుకున్నారామె.

వ్యాయామం మానలేదు!

రెండు స్పేస్‌టూర్లలో భాగంగా తాను అంతరిక్షంలో గడిపిన 322 రోజుల్లో ఒక్క రోజు కూడా వ్యాయామం మానలేదని చెబుతున్నారు సునీత.

‘అంతరిక్షంలో పగలు, రాత్రులు ఒకేలా ఉంటాయి. అందుకే గ్రీన్‌విచ్‌ కాలమానాన్ని అనుసరిస్తూ మా పనుల్ని షెడ్యూల్‌ చేసుకునేవాళ్లం. ఇక వినోదం కోసం నేను వంటల ప్రోగ్రామ్స్‌ ఎక్కువగా చూసేదాన్ని. అలాగే డైరీ రాసుకోవడం, ఫొటోగ్రఫీ.. ఇలా నా అభిరుచులపై ఎక్కువ దృష్టి పెట్టేదాన్ని. అంతేకాదు.. అంతరిక్షం నుంచి తరచూ మా కుటుంబ సభ్యులతోనూ మాట్లాడేదాన్ని. ఇక స్పేస్‌లో రోజువారీ వ్యాయామాలు తప్పనిసరి. ఇవే మన ఆరోగ్యానికి, ఎముకల దృఢత్వానికి మేలు చేస్తాయి. అందుకే అంతరిక్షంలోనూ వ్యాయామ రొటీన్‌ని కొనసాగించా. ఎక్కువగా కార్డియో వ్యాయామాల్ని సాధన చేసేదాన్ని..’ అంటూ మరో సందర్భంలో పంచుకున్నారీ లేడీ ఆస్ట్రోనాట్.

సేవకు సత్కారాలు!

ఇలా అంతరిక్ష రంగంలో సునీత చేసిన సేవలకు గుర్తింపుగా పలు అవార్డులు, రివార్డులు, మెడల్స్‌ అందుకున్నారామె. ‘నేవీ కమెండేషన్‌ మెడల్’, ‘నాసా స్పేస్‌ఫ్లైట్‌ మెడల్‌’, స్లొవేనియా ప్రభుత్వం నుంచి ‘గోల్డెన్‌ ఆర్డర్‌ ఫర్‌ మెరిట్స్‌’, గుజరాత్‌ లాజికల్‌ యూనివర్సిటీ నుంచి ‘డాక్టరేట్‌’ అందుకున్న ఆమెను.. భారత ప్రభుత్వం ‘పద్మ భూషణ్‌’ పురస్కారంతో సత్కరించింది. నావల్‌ అకాడమీలో చదువుకొనే సమయంలోనే మైఖేల్‌ విలియమ్స్‌తో సునీతకు ఏర్పడిన పరిచయం.. వీరిద్దరి పెళ్లికి దారితీసింది. సునీతా విలియమ్స్‌ని ఆమె ఆత్మీయులు, స్నేహితులు ‘సుని’ అని ముద్దుగా పిలుచుకుంటారట!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్