BBC List : ఆ ‘మార్పు’ తీసుకొస్తున్నారు!

వివిధ రంగాల్లో రాణిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఎంతోమంది మహిళలు. తమ సేవలతో సమాజాభివృద్ధికి పాటు పడుతూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు.

Published : 24 Nov 2023 13:08 IST

(Photos: Instagram)

వివిధ రంగాల్లో రాణిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఎంతోమంది మహిళలు. తమ సేవలతో సమాజాభివృద్ధికి పాటు పడుతూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అలాంటి స్ఫూర్తిదాయక, ప్రభావశీల మహిళల జాబితాను తాజాగా విడుదల చేసింది బీబీసీ. ‘బీబీసీ 100 విమెన్‌’ పేరుతో రూపొందించిన ఈ జాబితాలో ముగ్గురు భారతీయ మహిళలు చోటుదక్కించుకున్నారు. వారెవరో తెలుసుకుందాం రండి..

ఈ ఏడాది వేడి తీవ్రత, వరదలు, కార్చిచ్చులు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా సంభవించడం మనం చూశాం. ఇలాంటి వాతావరణ మార్పుల పూర్వపరాలపై అవగాహన కల్పిస్తూ.. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరినీ భాగం చేయడానికి తమ వంతుగా కృషి చేస్తున్నారు ఎంతోమంది మహిళా ఎకో వారియర్స్‌. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అలాంటి 28 మంది క్లైమేట్‌ వారియర్స్‌కి ఈ ఏడాది తమ జాబితాలో చోటిచ్చి గౌరవించింది బీబీసీ. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్య, వినోదం, క్రీడలు, రాజకీయాలు, ఆరోగ్యం.. తదితర రంగాల్లో రాణిస్తూ.. సమాజాభివృద్ధికి తోడ్పాటునందిస్తోన్న మహిళల్నీ ఎంపిక చేసింది.


దియా మీర్జా - నటి, పర్యావరణ పరిరక్షకురాలు

నటిగా, నిర్మాతగా బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది దియా మీర్జా. పర్యావరణమంటే ఆమెకు ఎనలేని మక్కువ! అదెంతలా అంటే.. ముంబయిలోని ఆమె ఇల్లు ఓ చిన్న సైజు అడవిని తలపించేంతగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు! ఇంటి చుట్టూ పచ్చటి మొక్కలు, పక్షుల కిలకిలారావాలతో ఆహ్లాదమైన వాతావరణంలో గడుపుతూ ఈ ప్రపంచాన్నే మరిచిపోతానంటోంది దియా. ఇలా పచ్చదనాన్ని తాను ప్రేమించడమే కాదు.. తన చుట్టూ ఉన్న వాళ్లలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తోందామె. ఈ క్రమంలోనే జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించడంతో పాటు సోషల్‌ మీడియా వేదిక ద్వారా కూడా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటుందీ బాలీవుడ్‌ బ్యూటీ. ప్రస్తుతం ‘యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్‌’ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా కొనసాగుతోన్న దియా.. వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం, వన్యప్రాణి సంరక్షణ తదితర అంశాలపై అవగాహన పెంచుతోంది. మరోవైపు ‘సేవ్‌ ది చిల్డ్రన్‌’ అంబాసిడర్‌గా ఉన్న ఈ సోషల్‌ వారియర్‌.. ‘Sanctuary Nature Foundation’ బోర్డ్‌ సభ్యురాలిగానూ కొనసాగుతోంది.

‘నేను ప్రకృతి ప్రేమికురాలిగా మారానంటే అదంతా అమ్మానాన్నల వల్లే! చిన్నతనంలో చెట్లెక్కడం, పండ్లు కోసుకోవడం, పక్షులు/జంతువుల్ని దగ్గర్నుంచి గమనించడం, అవి ఏర్పాటుచేసుకునే గూళ్లు.. ఇవన్నీ నన్ను పర్యావరణం వైపు ఆకర్షించాయి. ఈ క్రమంలోనే పర్యావరణ పరిరక్షణను నా రెండో కెరీర్‌గా మార్చుకున్నా.. దీనికి ప్రతిబంధకాలుగా మారుతోన్న ప్లాస్టిక్‌, ఇతర కారకాలపై దృష్టి సారించా. వాటిని నిర్మూలించే దిశగా ఆయా సంస్థలతో కలిసి పనిచేస్తున్నా. ఇలా ప్రకృతితో మమేకమవడం వల్ల నాలో ఏదో తెలియని ఉత్సాహం జనిస్తుంది..’ అంటోన్న ఈ ఎకో వారియర్‌ తాజాగా బీబీసీ విడుదల చేసిన వంద మంది మహిళల్లో చోటుదక్కించుకుంది.


ఆరతీ కుమార్‌ రావ్‌ - రచయిత్రి, ఫొటోగ్రాఫర్‌

పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యంపై అందరిలో అవగాహన పెంచడానికి రచనలు, ఫొటోగ్రఫీనే ఆయుధంగా చేసుకుంది బెంగళూరుకు చెందిన ఆరతీ కుమార్‌ రావ్‌. పర్యావరణ ఫొటోగ్రాఫర్‌గా, రచయిత్రిగా, ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమె.. పర్యావరణ క్షీణత ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో చెప్పడానికి ప్రత్యేకంగా ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. అలాగే భూగర్భ జలాలు అంతరించిపోవడం, పరిశ్రమల కోసం భూసేకరణ, జీవవైవిధ్యం.. తదితర అంశాలపై వ్యాసాలు కూడా రాసింది. అవి ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. రాజస్థాన్‌ ఎడారిలో నివసించే ప్రజలు వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి అనుసరిస్తోన్న ప్రత్యేక పద్ధతిపై ఓ డాక్యుమెంటరీని రూపొందించింది ఆరతి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని కళ్లకు కట్టేలా ‘Marginlands: India's Landscapes on the Brink’ అనే పుస్తకం రాసిందామె. జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్యం.. తదితర అంశాలపై ఆమె గీసే చిత్రాలు అందరిలో ఆలోచనను రేకెత్తిస్తాయని చెప్పడంలో సందేహం లేదు.


హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ - భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌

భారత మహిళల క్రికెట్‌ చరిత్రలో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ది ప్రత్యేక స్థానం. క్రికెట్‌పై మక్కువతో తన తండ్రి శిక్షణలో ఈ క్రీడలో ఓనమాలు దిద్దిన హర్మన్‌.. తన 20వ ఏట అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. అప్పట్నుంచి తిరుగు లేకుండా రాణిస్తోన్న ఈ పంజాబీ క్రికెటర్‌.. మన దేశంలో ఎంతోమంది అమ్మాయిలు క్రికెట్‌ను తమ కెరీర్‌గా ఎంచుకునేందుకు స్ఫూర్తిగా నిలిచింది. తన ఆటతీరుతో జట్టుకు విజయాలు అందించడమే కాదు.. కెప్టెన్‌గా సహచరుల్నీ ప్రోత్సహిస్తుంటుంది హర్మన్‌. 2017 మహిళల ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో 171 పరుగుల (115 బాల్స్‌) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడి ఆసీస్‌ను చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించిందామె. అయితే ఫైనల్లో మన జట్టు ఓడిపోయినా.. తమ అద్భుత ఆటతీరుతో కోట్లాది మంది భారతీయుల మనసులు గెలుచుకున్నారు మన అమ్మాయిలు. హర్మన్‌ సారథ్యంలో కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం గెలుచుకున్న మన జట్టు.. ఈ ఏడాది ‘ఆసియా గేమ్స్‌’లో పాల్గొన్న తొలిసారే పసిడితో తిరిగొచ్చింది. ఓవైపు బ్యాట్‌తో రాణిస్తూ, మరోవైపు కెప్టెన్‌గా మైదానంలో గెలుపు వ్యూహాలు రచిస్తూ.. తనకు తానే సాటిగా నిలిచిన ఈ పంజాబీ క్రికెటర్‌.. ఇటీవలే మరో ఘనత సాధించింది. ‘విజ్డెన్స్‌ ఫైవ్‌ క్రికెటర్స్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ టీమ్‌లో చోటుదక్కించుకున్న తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా నిలిచింది. తాజాగా ‘బీబీసీ 100 మహిళల’ జాబితాలోనూ స్థానం సంపాదించుకుందీ క్రికెట్‌ కెప్టెన్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్