అపార్టుమెంట్‌ బాల్కనీలోనూ అద్భుతమైన తోట...

పూలమొక్కలు, క్రోటన్స్‌ తదితర ఇండోర్‌ మొక్కలే కాదు, తాజా ఆకుకూరలు, కూరగాయలనూ అపార్టుమెంట్‌ బాల్కనీలో పెంచొచ్చు అంటున్నారు వ్యవసాయ నిపుణులు. తోట పెంపకంపై ఆసక్తి ఉన్నవారు స్థలాభావంతో నిరాశ చెందకుండా ప్రత్యేక పద్ధతులను అనుసరిస్తే చాలంటున్నారు.  

Published : 28 Mar 2023 00:13 IST

పూలమొక్కలు, క్రోటన్స్‌ తదితర ఇండోర్‌ మొక్కలే కాదు, తాజా ఆకుకూరలు, కూరగాయలనూ అపార్టుమెంట్‌ బాల్కనీలో పెంచొచ్చు అంటున్నారు వ్యవసాయ నిపుణులు. తోట పెంపకంపై ఆసక్తి ఉన్నవారు స్థలాభావంతో నిరాశ చెందకుండా ప్రత్యేక పద్ధతులను అనుసరిస్తే చాలంటున్నారు.  

ఎంపిక చేద్దామా..

బాల్కనీ ఉన్నప్పుడు స్థలాభావం అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రణాళికగా అన్నిరకాల మొక్కల పెంచుకోవచ్చు. ముందుగా మనసుకు నచ్చిన కూరగాయలు, పండ్ల మొక్కలేంటో నోట్‌ చేసుకోవాలి. తర్వాత ఎండ ఏ ప్రాంతంలో ఎక్కువ, లేదా తక్కువగా పడుతుందో గుర్తించాలి. అలాగే ఏ వేళలో ఎండవేడి ఎక్కడ ఎక్కువ ఉంటుందనేది కూడా గమనించాలి. దీనికి తగినట్లుగా ఆయా ప్రదేశాలకు తగిన మొక్కలను ఎంచుకోవచ్చు.  ఎండ బాగా తగిలే చోట టొమాటో, వంకాయ, పచ్చిమిర్చి వంటివాటిని పెంచుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర, మెంతి కూరవంటి ఆకుకూరల్ని పెంచేటప్పుడు రోజంతా కాకుండా ఒక పూట మాత్రమే ఎండ పడే ప్రాంతాన్ని ఎంచుకోవాలి.

నీటి సౌకర్యం ఉందా..

బాల్కనీ గార్టెన్‌కు నీటి సౌకర్యం నిత్యం అందేలా ఏర్పాటు చేసుకోవాలి. అలాగని మొక్కలన్నింటికీ ఒకేలా నీటిని అందించకూడదు. మొక్క, మట్టి, తొట్టె, వాతావరణం వంటివాటికి ప్రాముఖ్యతనివ్వాలి. ప్రతి మొక్క తనకు తానుగా తేమను స్వీకరించే వాతావరణాన్ని కల్పించాలి. ఎక్కువైన నీళ్లు కుండీ నుంచి బయటకు పోయేలా చూడాలి. అలాగే మట్టి పూర్తిగా పొడిబారి పోకుండా జాగ్రత్తపడాలి. ఏయే మొక్కకు ఎప్పుడు ఎరువు, నీటిని అందించాలో ఒక క్యాలెండర్‌ను సిద్ధం చేసుకోవాలి. కొన్నింటికి రోజుకొకసారి, మరికొన్నింటికి వారానికి మూడుసార్లు అంటూ లెక్క ప్రకారం తడిని అందించడానికి ఇది ఉపయోగపడుతుంది.

ఇలా ఏర్పాటు చేస్తే..

బాల్కనీలో ఐరన్‌ స్టాండ్‌లను ఏర్పాటు చేసుకుని గ్రోబ్యాగ్స్‌లో కూరగాయలు పెంచుకోవచ్చు. అలానే తక్కువ స్థలంలో ఎక్కువ రకాల్ని పెంచాలనుకుంటే ట్రేల్లో ఆకుకూరలు నాటుకోవచ్చు. తీగ జాతి కూరగాయ పాదులను  గ్రిల్‌కి అల్లుకునేలా చేయొచ్చు. అయితే దీనికోసం కాస్త పెద్ద కుండీని ఎంచుకుంటే బలంగా ఎదుగుతాయి. వెర్టికల్‌ గార్డెనింగ్‌ పద్ధతిలో ఎత్తు తక్కువగా పెరిగే టొమాటో వంటి రకాల్ని ఎంచి పెంచితే స్థలం కలిసి వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్