మెరిపించిన మేకప్‌లు..

పండగ, వేడుకలప్పుడే కాదు.. చాలామందికి మేకప్‌ రోజువారీ తయారీలో భాగమే. అలాగని రోజూ ఒకేలా సిద్ధమైతే బోరేగా మరి! వాళ్లని ఆకర్షిస్తూ.. ఎప్పుడోసారి ప్రత్యేకంగా కనపడేవాళ్లని సరికొత్తవి ప్రయత్నించేలా చేస్తూ ఈ ఏడాది ఎన్నో ‘మేకప్‌ ట్రెండ్‌’లు ఆకట్టుకున్నాయి. వాటిలో కొన్నివి!

Published : 31 Dec 2022 01:26 IST

పండగ, వేడుకలప్పుడే కాదు.. చాలామందికి మేకప్‌ రోజువారీ తయారీలో భాగమే. అలాగని రోజూ ఒకేలా సిద్ధమైతే బోరేగా మరి! వాళ్లని ఆకర్షిస్తూ.. ఎప్పుడోసారి ప్రత్యేకంగా కనపడేవాళ్లని సరికొత్తవి ప్రయత్నించేలా చేస్తూ ఈ ఏడాది ఎన్నో ‘మేకప్‌ ట్రెండ్‌’లు ఆకట్టుకున్నాయి. వాటిలో కొన్నివి!

లామినేటెడ్‌ బ్రోస్‌.. కనుబొమలను ఐబ్రో బ్రష్‌తో నున్నగా దువ్వడం పాత పద్ధతి. చెదిరినట్లుగా చేయడమే ఈ ఏడాది ట్రెండ్‌. కనుబొమల వెంట్రుకలను పైకి దువ్వి.. అవి అలా నిలిచి ఉండటానికి జెల్‌ని అద్దుతారు. దీనికే ఫెదర్డ్‌ బ్రోస్‌ మేకప్‌ అనీ పేరు.


నేచురల్‌ లుక్‌.. మేకప్‌తో ఎవరైనా అందంగా కనిపిస్తారు.. సహజంగా కనిపించగలరా అన్న సవాలును ఈ ఏడాది అమ్మాయిలందరూ స్వీకరించారు. దాని పుణ్యమా అంటూ వచ్చిందే మినిమల్‌ మేకప్‌ లేదా నేచురల్‌ లుక్‌ ట్రెండ్‌. దీనిలోనూ మేకప్‌ ఉంటుంది. కాకపోతే చాలా తక్కువ మొత్తంలో! ముఖానికి ఏమీ రాయలేదన్నట్లు కనిపించడమే దీని వెనుక రహస్యం. మేకప్‌ వేసినా వేయనట్లు కనిపించడం.. పైగా అందం.. అందుకే ఈ ట్రెండ్‌ బాగానే మాయ చేసింది.


వాటర్‌ లైన్స్‌.. చారడేసి కళ్లు.. అందంగా కనిపించాలంటే కాటుక అద్దాల్సిందే! కానీ ఈసారి ట్రెండ్‌ మారింది. కన్ను కింది రెప్పకి తెలుపు, లేత గులాబీ, శరీరఛాయలో కలిసిపోయే రంగులను వేశారు. ఇది కళ్లకు తాజా లుక్‌ని తెచ్చిపెడుతుందని ప్రయత్నించేశారు.


స్టేట్‌మెంట్‌ బ్లష్‌.. ఎండలోకి అడుగు పెట్టామంటే చాలు.. వేడికి బుగ్గలు ఎర్రగా కందిపోతాయి. ఇంకా ట్యాన్‌ భయం. కానీ అలా కందిన బుగ్గలే ఎంతోమంది అమ్మాయిలను ఆకర్షించాయి. స్టేట్‌మెంట్‌ బ్లష్‌, డబ్ల్యూ బ్లష్‌ అంటూ ప్రయత్నించేశారు. లేత గులాబీ, ఎరుపు, నారింజ రంగుల్లో ఈ బ్లష్‌లు అలరించాయి.


వన్‌ లేయర్‌.. మేకప్‌ వేసుకోవడం ఇష్టమే కానీ.. పట్టే సమయంతోనే విసుగు. దగ్గరిదారి కోసం ఈ ఏడాది చాలా ప్రయత్నాలు జరిగాయి. అందులో ఎక్కువ మందిని ఈ వన్‌ లేయర్‌ మేకప్‌ బాగా ఆకట్టుకుంది. దీనిలో ఫౌండేషన్‌, బ్లష్‌, కన్సీలర్‌ ఆయా ప్రదేశాల్లో చుక్కలుగా పెట్టేసుకొని, మేకప్‌ స్ప్రే చేసేస్తారు. ఆపై బ్లెండర్‌తో ముఖమంతా వాటిని అద్దేస్తారు. అంతే.. మెరిసే చర్మం సొంతం.


డబుల్‌ ఐలైనర్‌.. పైకనురెప్ప మీదుగా వచ్చే ఐలైనర్‌ ముఖానికీ ప్రత్యేక అందాన్నిస్తుంది. సంప్రదాయ, ఆధునిక వస్త్రధారణ దేనికైనా నప్పే దీనికి ఈ ఏడాది మరో గీత జత చేరింది. డబుల్‌ ఐలైనర్‌గా పిలిచే ఈ మేకప్‌ ఎంతోమందిని ఫిదా చేసింది. కొందరు వీటికి గ్లిటర్‌లూ జత చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్