Published : 26/01/2023 14:33 IST

ఇవన్నీ ఎవర్‌గ్రీన్ దాంపత్యం కోసమే..!

ఇంటి పనులు, వంట పనులు, వృత్తి ఉద్యోగాల్లో ఎదురయ్యే ఒత్తిళ్లు, పిల్లల ఆలనాపాలన, పెద్దవారి బరువు బాధ్యతలు.. ఇవన్నీ అందరి జీవితాల్లోనూ ఉండేవే. మరి వీటన్నింటినీ సమర్థంగా నిర్వహించాలంటే భాగస్వామి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అండదండలు ఎంతో అవసరం. ఇలాంటప్పుడే సంసారమనే సాగరంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటిని అలవోకగా ఎదుర్కొంటూ ముందుకు సాగగలుగుతాం. అంతేకాదు.. ఈ క్రమంలో భాగస్వామి ప్రేమను పొందుతూ.. ఆ అనుబంధంలోని మాధుర్యాన్ని పూర్తిగా ఆస్వాదించినవారమవుతాం కదా! మరి ఇలా వివాహబంధాన్ని ఎవర్‌గ్రీన్‌గా మార్చుకొని, భాగస్వామి మనసులో సుస్థిర స్థానం సంపాదించుకోవాలంటే దంపతులిద్దరూ కొన్ని అంశాల్ని దృష్టిలో ఉంచుకొని నడుచుకోవడం ఉత్తమం. మరి అవేంటో తెలుసుకుందాం రండి..

మ్యాజిక్ మంత్రం!

మనసారా పరిణయమాడిన భాగస్వామి ప్రేమను పొందాలన్నా, వారికి మీ మనసులోని ప్రేమను తెలియపరచాలన్నా.. అందుకూ ఓ మ్యాజిక్ మంత్రం లేకపోలేదు. అదేనండీ.. 'ఐ లవ్యూ'. మరి ఇది కేవలం ప్రేమికులకు మాత్రమే పరిమితం కాదు.. భార్యాభర్తలు కూడా నిరంతరం ఒకరిపై ఒకరు ప్రేమను తెలియజేసుకోవడానికి దీన్ని ఒక వారధిలా ఉపయోగించుకోవచ్చు. అయితే 'ఎప్పుడూ నేనే చెప్పాలా.. ఓసారి తను చెబితే ఏమవుతుంది..' అంటూ ఎదురుచూడకుండా.. మీ మనసులోని ఆ భావనను మాటలు, పాటలు, చేతలు, బహుమతుల రూపంలో తెలియజేయాలి. ఇలా దంపతులిద్దరూ తమ మనసుల్లోని ప్రేమను బయటపెట్టుకోవడానికి ఇంతకంటే మంచి పదం మరేముంటుంది చెప్పండి. ఫలితంగా భార్యాభర్తల మధ్య అనురాగం రోజురోజుకూ రెట్టింపయి.. అది ఎవర్‌గ్రీన్ అనుబంధంగా వెల్లివిరుస్తుంది.

స్నేహితులతో సరదాగా!

'నీకు నేను.. నాకు నువ్వు.. ఒకరికొకరం నువ్వూ-నేను..' అన్నట్లు  దాంపత్య బంధం అంటే భార్యాభర్తలిద్దరూ వారి ఇష్టాయిష్టాలను ఓవైపు గౌరవిస్తూనే భాగస్వామికి నచ్చినట్లుగా మసలుకోవాలి. ఈ క్రమంలో ఒకరి సరదాల్ని మరొకరు కాదనకూడదు. భార్యాభర్తలిద్దరికీ అప్పుడప్పుడూ తమ స్నేహితులతో సరదాగా గడపాలని, వారితో కలిసి బయటికి వెళ్లాలని అనిపించచ్చు. అలాంటి సందర్భాల్లో ఒకరికొకరు అడ్డుచెప్పుకోకూడదు. వీలైతే మీరు కూడా వారితో పాటు వెళ్లి ఆ ఆనందాల్లో పాలుపంచుకోవచ్చు. తద్వారా భాగస్వామి ఇష్టాల్ని గౌరవించిన వారవడమే కాకుండా.. అనుబంధాల్ని కూడా మరింతగా విస్తరించుకోవచ్చు. ఇలా దంపతులిద్దరూ వారి అభిరుచుల్ని, అలవాట్లని ఒకరికొకరుగా మలచుకుంటే ఆ అనుబంధం ఎప్పటికీ ఎవర్‌గ్రీనే మరి!

కృతజ్ఞతాభావం..

ఎంత దంపతులైనా, ఇద్దరి మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉన్నా.. అప్పుడప్పుడూ ఒకరికొకరు కృతజ్ఞతలు చెప్పుకోవడం కూడా ముఖ్యమే. అయితే చాలామంది నా భర్తే కదా.. లేక నా భార్యే కదా.. అంటూ వారికి థాంక్యూ, సారీ.. వంటివి చెప్పకుండా సందర్భాన్ని దాటేస్తుంటారు. కానీ మీ వల్ల సాధ్యం కాని పని మీ భాగస్వామి పూర్తి చేస్తే.. మీకు ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. మరి అలాంటప్పుడు వారిని గుండెలకు హత్తుకొని ఓ చిన్న థ్యాంక్స్ చెబితే.. వారెంతగానో ఆనందిస్తారు. అంతేకాదు.. మీ మనసు లోతుల్లో వారిపై ఉండే ప్రేమ కూడా ఈ విధంగా బయటపడుతుంది. అలాగే మీ వల్ల జరిగిన తప్పిదానికి కూడా అహాన్ని పక్కనపెట్టి ఎదుటివారిని క్షమాపణ అడిగినప్పుడే ఆ తప్పుకు మీరెంతగా బాధపడుతున్నారో వారికి అర్థమవుతుంది.

రొమాంటిక్ టచ్..

భార్యాభర్తల బంధంలో రొమాన్స్‌కి ఎంత ప్రాధాన్యం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇది వయసుతో పాటు తరగకుండా.. పెరిగితేనే వైవాహిక జీవితం ఎప్పటికీ శాశ్వతమవుతుందంటున్నారు నిపుణులు. కానీ చాలామంది ఒక దశకు చేరుకున్న తర్వాత పిల్లలు, బాధ్యతలు.. అంటూ చాలామంది దీన్ని దాటవేస్తుంటారు. అలా చేయకుండా వీలైనప్పుడల్లా ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం గడపడం, సినిమాలకు, షికార్లకు వెళ్లడం, ఓ టూర్ ప్లాన్ చేసుకోవడం, డేట్‌కి వెళ్లడం, ఇద్దరూ కలిసి సాయంత్రాలు అలా నడవడం.. ఏకాంతంలో ముద్దులు, కౌగిలింతలు.. మధ్యమధ్యలో చిన్న చిన్న రొమాంటిక్ గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం ఇలా ఆలుమగల అనుబంధంలో రొమాన్స్‌కి పెద్దపీటే వేయాలి. అప్పుడే భార్యాభర్తలిద్దరూ చిలకాగోరింకల్లా కలకాలం వైవాహిక బంధాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని