పిల్లలు నడక నేర్చుకునే సమయంలో..!

బిడ్డకు జన్మనిచ్చినప్పుడు తల్లి ఎంతగా సంతోషపడుతుందో.. ఆ బిడ్డ నడక నేర్చుకునే క్రమంలో తప్పటడుగులు వేసేటప్పుడు కూడా అంతే ఆనందిస్తుంది. సాధారణంగా పిల్లలు నాలుగు నుంచి పదిహేను నెలల వరకు.. నిలబడడం, కూర్చోవడం, నడవడం.. ఇలా ఒకదాని తర్వాత మరొకటి నేర్చుకుంటారు.

Published : 06 Apr 2024 20:01 IST

బిడ్డకు జన్మనిచ్చినప్పుడు తల్లి ఎంతగా సంతోషపడుతుందో.. ఆ బిడ్డ నడక నేర్చుకునే క్రమంలో తప్పటడుగులు వేసేటప్పుడు కూడా అంతే ఆనందిస్తుంది. సాధారణంగా పిల్లలు నాలుగు నుంచి పదిహేను నెలల వరకు.. నిలబడడం, కూర్చోవడం, నడవడం.. ఇలా ఒకదాని తర్వాత మరొకటి నేర్చుకుంటారు. మరి ఈ సమయంలో పిల్లలకు చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉంది. కాబట్టి వారిని కంటికి రెప్పలా కాపాడే బాధ్యత తల్లిదండ్రులదే. ఈ క్రమంలో పిల్లలు నడక నేర్చుకునేటప్పుడు వారిపట్ల తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పొడవు డ్రస్సులు వద్దు..

పొడవైన డ్రస్సులు నడిచే సమయంలో పిల్లలకు కాళ్ల కింద పడి ఇబ్బందిగా ఉంటాయి. ఒక్కోసారి వాటిని తన్నుకొని కింద పడిపోవచ్చు కూడా. అందుకే కనీసం నడిచే కాసేపైనా పొట్టి డ్రస్సులు వేయడం మంచిది.

వాకర్‌తో కేర్‌ఫుల్‌గా..

ఎప్పుడైతే పిల్లలు స్వతహాగా నిలబడడం నేర్చుకుంటారో.. వెంటనే వాళ్లకు వాకర్ ద్వారా సపోర్ట్ ఇవ్వాలి. అంటే వాళ్లను వాకర్‌లో కూర్చోబెట్టాలి. దాని వెనకాల మీరు నిలబడి నెమ్మదిగా ముందుకు నెట్టండి. ఎలాగో పిల్లలు వాకర్‌లో ఉంటారు.. కాబట్టి బ్యాలన్స్ కూడా ఆగుతుంది. పిల్లలు త్వరగా నడక నేర్చుకోవాలని చెప్పి గంటల కొద్దీ వాకర్‌లో ఉంచితే వారికి నడుంనొప్పి వచ్చే ప్రమాదమూ ఉంది. కాబట్టి రోజుకు కాసేపే వాకర్‌లో వేయడం మంచిది. అలాగే వాకర్‌లో ఉంచినంతసేపు పక్కన ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉండాలి. లేదంటే మెట్లు, నేలపై నీళ్లు.. ఇలాంటి ప్రదేశాల్లో పిల్లలు పడిపోయే అవకాశం ఉంది.

చేయూతనివ్వండి!

పిల్లలు త్వరగా నడక నేర్చుకోవాలని చెప్పి కొందరు తల్లిదండ్రులు.. పిల్లలకు ఏ విధమైన సపోర్ట్ ఇవ్వకుండా నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దీంతో పిల్లలు పడిపోవడమే కాకుండా దెబ్బలు తగిలే అవకాశాలు కూడా ఎక్కువే. అందుకే నడవడానికి ప్రయత్నించే మొదట్లో కొన్ని రోజుల వరకు మీ చేతి వేళ్లను వారికి ఆధారంగా అందించండి. దీంతో వారిలో నడవాలనే ఆకాంక్ష బలపడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. అలాగే ఇంట్లో ఉండే ఫర్నిచర్, షార్ప్ కార్నర్స్.. ఇలాంటి ప్రమాదకర ప్రదేశాల్లో వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

సాక్సులు వేయాలి..

నడిచేటప్పుడు పిల్లలకు తప్పనిసరిగా సాక్సులు వేయాలి. ముఖ్యంగా బయటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు షూస్ వేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే నేలమీద నడిస్తే ఏవైనా గుచ్చుకోవడం, లేత పాదాలు కందిపోవడం.. లాంటివి జరిగే అవకాశం ఎక్కువ. అలాగే నడిచీ నడిచీ ఒక్కసారి ముందుకు పడితే అరచేతులకు దెబ్బ తగిలే అవకాశం కూడా ఉంది. కాబట్టి చేతులకూ గ్లౌజులు వేయడం మరింత మంచిది.

రాత్రుళ్లు..

పిల్లలు నడక నేర్చుకునే సమయంలో.. ముఖ్యంగా రాత్రుళ్లు చాలా జాగ్రత్తగా వాళ్లను కాపాడుకోవాలి. పిల్లలకు రాత్రి ఎప్పుడైనా మెలకువ వచ్చినప్పుడు బెడ్ పైనే నడవడం లేదా వాళ్లంతట వాళ్లే మంచంపై నుంచి కిందికి దిగి నడవడం.. లాంటివి చేస్తారు. ఈ క్రమంలో అదుపు తప్పి కింద పడే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లల్ని మీ పక్కనే పడుకోబెట్టుకొని.. మధ్యమధ్యలో వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి.

తెలియని వాళ్లొస్తే..

హోమ్ డెలివరీ కోసం ఎవరైనా తెలియని వ్యక్తులు వచ్చినప్పుడు మీ పిల్లల్ని ఒంటరిగా వదిలి మీరు డబ్బుల కోసం లోపలికి వెళ్లడం, వాళ్లు నీళ్లివ్వమంటే కిచెన్‌లోకి వెళ్లడం.. లాంటివి చేయకూడదు. ఇలా కరెంట్ బిల్లనీ, వాటర్ బిల్లనీ, ఏదైనా రిపేర్ అనీ.. మీకు తెలియని వారు ఇంటికి వచ్చినప్పుడు పిల్లల్ని కూడా మీతోపాటే ఉంచుకోవడం శ్రేయస్కరం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్