Published : 11/11/2021 20:14 IST

Wedding Season: ఆ సమస్యకు చెక్‌ పెట్టాలంటే!

అసలే పెళ్లిళ్ల సీజన్‌.. సాధారణంగానే అందంగా మెరిసిపోవాలనుకునే అమ్మాయిలు ఈ సీజన్‌లో ప్రత్యేకంగా ఈ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తుంటారు.. కానీ చాలామందికి నిద్రలేమి, సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ముఖం ఉబ్బిపోవడం ఓ పెద్ద సవాలుగా మారుతుంది. మరి, ఈ సమస్యకు కొన్ని సహజసిద్ధమైన చిట్కాలతో చెక్‌ పెట్టచ్చంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

* సీజన్‌ని బట్టి మార్చే సౌందర్య ఉత్పత్తులు శరీరానికి సరిపడకపోవడం వల్ల వీటి దుష్ప్రభావాలు ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. కాబట్టి అలాంటి వాటిని దూరం పెట్టడం మంచిది. అలాగే కాలాన్ని బట్టి ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఈ విషయాల్లో నిపుణుల సలహాలు తీసుకుంటే మరీ మంచిది. అలాగే వాడే ప్రతి సౌందర్య ఉత్పత్తినీ ముందుగా ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకొని ఆపై ఉపయోగించాలి.

* ఆహారంలో ఉప్పు ఎక్కువైనా.. శరీరం నీటిని నిలుపుకొంటుంది. ఫలితంగా ముఖంతో పాటు శరీర భాగాలు కాస్త ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో టీస్పూన్‌ ఉప్పును మించకుండా చూసుకోవాలి.

* ముఖాన్ని రోజూ మర్దన చేసుకోవడం వల్ల ఉబ్బు సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ క్రమంలో జేడ్‌ రోలర్స్‌ చక్కగా ఉపయోగపడతాయి. అలాగే అత్యవసర నూనెలతోనూ ముఖాన్ని మర్దన చేసుకున్నా సమాన ఫలితం ఉంటుంది. అయితే ఈ క్రమంలో కింది నుంచి పైకి, బయటి నుంచి లోపలి వైపుకి మర్దన చేయాల్సి ఉంటుంది.

* కార్డియో, బరువులెత్తే వ్యాయామాలు/కొన్ని రకాల ఫేషియల్‌ ఎక్సర్‌సైజులు కూడా ఉబ్బిన ముఖాన్ని సాధారణ స్థితికి తీసుకొస్తాయి. ఈ క్రమంలో శరీరంలో రక్తప్రసరణ మెరుగై చర్మ రంధ్రాలు తెరచుకుంటాయి. తద్వారా చర్మంలోని మలినాలు, ఇతర వ్యర్థాలు తొలగిపోతాయి.

* ఉబ్బిన ముఖాన్ని సాధారణ స్థితికి తీసుకురావడంలో సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్స్‌దీ ప్రధాన పాత్రే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ముల్తానీ మట్టి, రోజ్‌ వాటర్‌తో తయారుచేసిన ఫేస్‌ప్యాక్‌ను తరచూ అప్లై చేసుకోవడం వల్ల సమస్య నుంచి విముక్తి పొందచ్చు.

* ఐస్‌ ముక్కలు/చల్లటి నీటితో ముఖంపై మర్దన చేసుకున్నా చక్కటి ఫలితం ఉంటుంది.

* కీరా దోస ముక్కల్ని ముఖంపై పరచుకొని కాసేపు సేదదీరడం వల్ల కూడా ముఖంపై వచ్చిన ఉబ్బును తక్షణమే తగ్గించుకోవచ్చు. వీటికి బదులు వాడేసిన గ్రీన్‌ టీ బ్యాగుల్ని సైతం వాడుకోవచ్చు.

* నీరు ఎక్కువ తాగినా, డీహైడ్రేషన్‌కి గురైనా శరీరం నీటిని నిలుపుకొంటుంది. కాబట్టి బరువును బట్టి నీటి మోతాదును నిర్ణయించుకోవాలి.

మరి, ముఖం ఉబ్బినప్పుడు మీరు ఎలాంటి చిట్కాలు పాటిస్తారు? మాతో పంచుకోండి!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని