Women Employees: ఆలస్యమైతే.. కోప్పడుతున్నారు!

 నాకో చిన్నపాప. కొత్తగా టీమ్‌ లీడ్‌ని అవడంతో రోజూ ఇంటికొచ్చేసరికి ఆలస్యం అవుతోంది. అందరిలా పనివేళలు పూర్తవగానే వెళ్లడం నాకేమో కుదరదు.

Published : 24 May 2023 00:49 IST

 నాకో చిన్నపాప. కొత్తగా టీమ్‌ లీడ్‌ని అవడంతో రోజూ ఇంటికొచ్చేసరికి ఆలస్యం అవుతోంది. అందరిలా పనివేళలు పూర్తవగానే వెళ్లడం నాకేమో కుదరదు. మిగతావాళ్లు వదిలేసినా పని పూర్తిచేసి, పైవాళ్లకు అప్పగించి వెళ్లాలి. పాపకి అర్థం చేసుకునే వయసు లేక.. ఏడుస్తోంది. ఇంట్లోవాళ్లేమో ‘టీమ్‌ లీడ్‌వి.. ఆ మాత్రం వెసులుబాటు చేసుకోలేవా’ అని కోప్పడుతున్నారు. రెండింటి మధ్యా నలిగిపోతున్నా.

- బిందు, హైదరాబాద్‌

 

మిమ్మల్ని ఈ పరిస్థితి నుంచి బయటపడేసే మార్గం ఆత్మవిశ్వాసమే! ఒక పరిశోధన ప్రకారం గృహిణుల కంటే ఉద్యోగినులు పిల్లలను బాగా పెంచగలరట. కాబట్టి, మీపై మీకు సందేహమొద్దు. ఇక ఉద్యోగం విషయంలో.. ఒక్కొక్కరూ ఒక్కో సలహానిస్తారు. వాటిలో ఏది సాధ్యమో తెలిసేది మీకే. కాబట్టి, ముందు పిల్లలకు అన్యాయం చేస్తున్నానన్న భావన పక్కన పెట్టి, రెంటినీ సమన్వయం చేసుకుంటున్నందుకు గర్వపడండి. ఈక్రమంలో అలసిపోతే బలవంతంగా కొనసాగక విశ్రాంతి తీసుకోండి. తగినంత సమయం కేటాయించలేక పోతున్నందుకు బాధ ఉంటుంది. అలాగని ఉద్యోగం వదిలేయగలరా? లేదు కదా! అమ్మ, అత్తయ్య.. పాపను చూసుకోవడానికి ఎవరో ఒకరి సాయం తీసుకోండి. పాపకి అన్నీ సకాలంలో అమరుతున్నాయా అన్న సందేహం కూడా పనిమీద దృష్టిపెట్టనివ్వవు. ఫలితమే ఆలస్యం. నమ్మకం ఉన్నవారికి తన బాగోగులు అప్పగిస్తే సరి. ఇంట్లోనూ అన్నీ మీరే చేసుకుంటూ వెళితే పాపకి సమయముండదు! పనులను పంచండి. ఆఫీసు విషయంలోనూ అంతే. మీరు చేసుకుంటూ వెళ్లినంత కాలం పరిస్థితి మారదు. లీడ్‌ అయినంత మాత్రాన పనంతా మీద వేసుకోమని కాదు. పైవాళ్లకి మీ ఇబ్బంది చెప్పి, అందరూ బాధ్యత తీసుకునేలా చూడండి. చూస్తుండగానే పిల్లలు ఎదిగిపోతారు. తర్వాత బాధపడి లాభం లేదు. రోజూ కొద్ది సమయం, వారాంతాలు, ఏడాదికోసారి.. ఇలా వాళ్లకి కేటాయించండి. టూర్లు వగైరా ప్లాన్‌ చేసుకోండి. మీకూ విశ్రాంతి.. వాళ్లకీ ఆనందం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్