జీన్స్‌ ఎక్కువ కాలం మన్నాలంటే..!

రమ్య ఎంతో ఇష్టపడి బ్రాండెడ్‌ జీన్స్ కొనుక్కుంది. అయితే ఆరు నెలలు తిరక్కుండానే.. అది పాతబడిపోయింది. దాంతో అది పక్కన పడేసి మరొకటి కొనుక్కోవడానికి సిద్ధమైంది. జీన్స్ విషయంలో ఈ అనుభవం చాలామందికి ఎదురవుతుంటుంది. అయితే ఇలా తక్కువ సమయంలోనే జీన్స్ పాతబడిపోవడానికి కారణం.. దాన్ని సరిగ్గా ఉతక్కపోవడమేనట!

Published : 09 Jun 2024 14:13 IST

రమ్య ఎంతో ఇష్టపడి బ్రాండెడ్‌ జీన్స్ కొనుక్కుంది. అయితే ఆరు నెలలు తిరక్కుండానే.. అది పాతబడిపోయింది. దాంతో అది పక్కన పడేసి మరొకటి కొనుక్కోవడానికి సిద్ధమైంది. జీన్స్ విషయంలో ఈ అనుభవం చాలామందికి ఎదురవుతుంటుంది. అయితే ఇలా తక్కువ సమయంలోనే జీన్స్ పాతబడిపోవడానికి కారణం.. దాన్ని సరిగ్గా ఉతక్కపోవడమేనట! మిగిలిన దుస్తులతో పోలిస్తే.. జీన్స్ మెటీరియల్ దళసరిగా ఉంటుంది. దాంతో వాటిని ఎక్కువసేపు నానబెట్టడం, బ్రష్‌తో గట్టిగా రుద్దడం.. లాంటివి చేస్తుంటారు చాలామంది. ఫలితంగా జీన్స్ చిరిగిపోవడం, రంగు వెలిసిపోవడం.. జరుగుతుంటాయి. ఇలా కాకుండా.. జీన్స్ ఎక్కువ కాలం మన్నాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.

⚛ ఉతికిన బట్టల్ని తిరగేయకుండా ఎండలో ఆరేయడం వల్ల కూడా అవి రంగు వెలిసిపోతుంటాయి. జీన్స్‌ కూడా అంతే! కాబట్టి జీన్స్‌ను ముందుగా ఉల్టా తీసి నానబెట్టి.. అలాగే ఉతికి ఆరేయాలి. అప్పుడే జీన్స్ రంగు మారకుండా ఉంటుంది.

⚛ కొన్నిసార్లు జీన్స్ సాగినట్లుగా తయారై మడతపెట్టడానికి వీలవదు. జిప్స్, బటన్స్ ఓపెన్ చేసి ఉతకడమే దీనికి కారణం. అలాకాకుండా జిప్స్, బటన్స్‌ని తీయకుండా అలాగే ఉంచి వాష్ చేయడం లేదా వాషింగ్‌ మెషీన్‌లో వేయడం వల్ల జీన్స్ ఆకారంలో మార్పు రాకుండా చూసుకోవచ్చు.

⚛ మనం ఏ దుస్తులు కొన్నా వాటిని ఎలా ఉతకాలి? ఉతికేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలన్నీ దుస్తుల లోపలి వైపు ఉన్న ఓ వైట్ లేబుల్‌పై రాసుంటుంది. వాటిని పాటించడం ద్వారా కూడా జీన్స్ పాడవకుండా/పాతబడకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ వాషింగ్ మెషీన్‌లో జీన్స్‌ని ఉతికే సమయంలో చాలామంది వేడినీటి వాష్‌ని ఎంచుకుంటారు. జీన్స్ బాగా శుభ్రమవుతుందనే భావనతోనే ఇలా చేస్తుంటారు. అయితే బాగా వేడిగా ఉండే నీళ్ల వల్ల డెనిమ్ పాడైపోయి.. చిరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కోల్డ్ జెంటిల్ వాష్ ఆప్షన్‌ని ఎంచుకోవాలి.

⚛ డెనిమ్‌తో తయారైన వస్త్రాలను ఉతికిన తర్వాత వాటిని ఎండలో ఆరేస్తాం. దీనివల్ల జీన్స్ త్వరగా ఆరిపోతుంది. కానీ.. వేడి ఎక్కువగా తగిలితే జీన్స్ ఫ్యాబ్రిక్ పాడైపోతుంది. పైగా రంగు కూడా వెలిసిపోతుంది. అందుకే వాటిని నీడలోనే ఆరేయాలి. దీనివల్ల మెటీరియల్ ఎక్కువ కాలం మన్నుతూ కొత్తదానిలా కనిపిస్తుంది.

⚛ నీడలో ఆరేసినా కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా తక్కువ సమయంలోనే దాన్ని ఆరిపోయేలా చేయచ్చు. ఇందుకోసం ఉతికిన తర్వాత కాటన్ టవల్‌లో జీన్స్‌ని చుట్టి కాసేపు అలాగే ఉంచాలి. ఇలా చేస్తే టవల్ డెనిమ్ వస్త్రంలోని నీటిని పీల్చుకుంటుంది. ఆ తర్వాత నీడలో ఆరేస్తే సరిపోతుంది. చేతితో ఉతికినప్పుడు ఈ చిట్కా పాటిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది.

⚛ ఒకవేళ డ్రయర్‌లో ఆరబెడుతున్నట్త్లెతే.. సగం సైకిల్ పూర్తయిన తర్వాత బయటకు తీసి నీడలో ఆరేయాలి.

⚛ డెనిమ్ వస్త్రాలను డ్రైక్లీనింగ్ చేయడం ద్వారా ఎక్కువ రోజులు మన్నేలా చేసుకోవచ్చు.

⚛ కొంతమంది జీన్స్‌ని ఉతికేటప్పుడు బాగా శుభ్రపడతాయనే ఉద్దేశంతో.. బ్లీచ్ వేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అవి కొన్ని రోజులకే రంగు కోల్పోయి పాతబడిపోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్