నెలసరిలో జుట్టు ఎక్కువగా రాలుతోందా?

నెలసరి సమయంలో శారీరకంగా, మానసికంగా పలు సమస్యలు తలెత్తడం సహజం. అయితే ఈ రోజుల్లో సౌందర్య పరంగానూ కొన్ని మార్పులు చోటుచేసుకోవడం మనం ప్రత్యక్షంగా గమనిస్తుంటాం. అందులో జుట్టు రాలడం ఒకటి. సాధారణ సమయాలతో....

Published : 09 Jun 2023 12:29 IST

నెలసరి సమయంలో శారీరకంగా, మానసికంగా పలు సమస్యలు తలెత్తడం సహజం. అయితే ఈ రోజుల్లో సౌందర్య పరంగానూ కొన్ని మార్పులు చోటుచేసుకోవడం మనం ప్రత్యక్షంగా గమనిస్తుంటాం. అందులో జుట్టు రాలడం ఒకటి. సాధారణ సమయాలతో పోల్చితే.. నెలసరిలో ఈ సమస్య మరింతగా ఉంటుంది. అయితే ఇందుకు కారణం.. హార్మోన్ల స్థాయుల్లో మార్పులే అంటున్నారు నిపుణులు. మరి, ఈ సమస్యను తగ్గించుకోవాలంటే పిరియడ్స్‌ సమయంలో జుట్టు, కుదుళ్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలంటున్నారు. అదెలాగో తెలుసుకుందాం రండి..

జిడ్డు తగ్గాలంటే..!

పిరియడ్స్‌ సమయంలో శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా టెస్టోస్టిరాన్‌ స్థాయులు పెరిగిపోయి.. సీబమ్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మంతో పాటు జుట్టు కుదుళ్లనూ జిడ్డుగా మారుస్తుంది. ఈ సమయంలో జుట్టు ఎక్కువగా రాలిపోవడానికి ఇదీ ఓ కారణమే! అయితే కొంతమంది ఈ జిడ్డును తొలగించుకోవడానికి రోజూ తలస్నానం చేస్తుంటారు. ఇది సరికాదంటున్నారు నిపుణులు. దీనివల్ల కుదుళ్లలోని సహజసిద్ధమైన నూనెలు తొలగిపోయి.. కుదుళ్లు పొడిబారతాయి. కాబట్టి ఇలాంటి సమయంలో సల్ఫేట్‌ రహిత షాంపూతో వారానికోసారి లేదా రెండుసార్లు తలస్నానం చేయాలి. మరీ ఇబ్బందిగా అనిపిస్తే మధ్యమధ్యలో డ్రై షాంపూను కుదుళ్లపై స్ప్రే చేసుకోవచ్చు. ఇది జిడ్డును శోషించుకొని.. కుదుళ్లకు తాజాదనాన్ని అందిస్తుంది. ఫలితంగా జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది.

ఆ దువ్వెన వాడండి!

నెలసరి రోజుల్లో హార్మోన్ల స్థాయుల్లో మార్పుల కారణంగా శరీరం మరింత సున్నితంగా మారిపోతుంది. తద్వారా చిన్న నొప్పిని కూడా ఓర్చుకోలేదు. అయితే ఈ ప్రభావం కుదుళ్ల పైనా పడుతుంది. దీంతో జుట్టును బలంగా దువ్వినా, చిక్కులు విడదీసే ప్రయత్నం చేసినా.. వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతుంటాయి. కాబట్టి ఈ సమయంలో మందపాటి బ్రిజిల్స్‌ ఉన్న దువ్వెన ఉపయోగించాలి. అలాగే కుదుళ్లను పదే పదే చేత్తో తాకడం, వేళ్లతో చిక్కులు తీయడం.. వంటివి అస్సలు చేయకూడదు.

బ్లీడింగ్‌ ఎక్కువైనా..!

నెలసరి సమయంలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ స్థాయులు తగ్గుతాయి. ఫలితంగా ఐరన్‌ శాతం కూడా తగ్గుతుంది. పిరియడ్స్‌ సమయంలో జుట్టు రాలడానికి ఇదీ ఓ కారణమే అంటున్నారు నిపుణులు. కొంతమందిలో బ్లీడింగ్‌ ఎక్కువైనా ఈ సమస్య తలెత్తుతుందట! ఇలాంటి సమయంలో ఐరన్‌ సప్లిమెంట్లు మేలు చేస్తాయంటున్నారు. కాబట్టి డాక్టర్‌ సలహా మేరకు ఈ మాత్రలు వేసుకోవడం, ఐరన్‌ అధికంగా ఉండే కోడిగుడ్లు, చేపలు, మాంసం, ఆకుకూరలు.. వంటివి ఆహారంలో భాగం చేసుకోవడం ముఖ్యం.

తేమనందించండి!

నెలసరిలో ఈస్ట్రోజెన్‌ స్థాయుల్లో తగ్గుదల కారణంగా కుదుళ్లు తేమను కోల్పోయి పొడిబారిపోతాయి. తద్వారా సాధారణ రోజుల కంటే ఈ సమయంలో జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే కుదుళ్లకు తేమనందించడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఇందుకోసం నీళ్లు ఎక్కువగా తాగడం, నీటి శాతం అధికంగా ఉండే పండ్లు-కాయగూరల్ని ఆహారంలో భాగం చేసుకోవడం.. మంచిది. అలాగే కుదుళ్లకు తేమనందించడానికి సీరమ్‌, లోషన్‌, ప్రత్యేకమైన నూనెలు కూడా బయట దొరుకుతాయి. నిపుణుల సలహా మేరకు వాటిని వాడచ్చు. అలాగే తరచూ కొబ్బరి లేదా ఆలివ్‌ నూనెతో కుదుళ్లకు మసాజ్‌ చేయడమూ మర్చిపోవద్దు.

వీటితో మేలు!

పిరియడ్స్‌లో బలహీనమైన కుదుళ్లను తిరిగి దృఢంగా చేయడానికి ఈ చిట్కాలు ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కుదుళ్లకు తేమనందించే హెయిర్‌మాస్కులు వేసుకోవచ్చు.. కుదుళ్లలో ఏర్పడిన మృతకణాల్ని తొలగించడానికి స్కాల్ప్ స్క్రబ్స్‌ని ఉపయోగించచ్చు. అలాగే ప్రస్తుతం మార్కెట్లో స్కాల్ప్‌ మసాజ్‌ బ్రష్‌లు కూడా దొరుకుతున్నాయి. వాటితో తరచూ కుదుళ్లను మృదువుగా మర్దన చేసుకోవడం వల్ల ఆ భాగంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. తద్వారా జుట్టు రాలడం తగ్గి.. ఒత్తుగా పెరుగుతుంది.. కుదుళ్లూ బలంగా తయారవుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్