Published : 06/01/2023 12:38 IST

Alpha Husband: అతనితో వేగలేకపోతున్నారా?

భార్యాభర్తల్లో ఇద్దరూ సమానమే! కానీ కొంతమంది భర్తలు తమ భార్యలపై అజమాయిషీ చెలాయించాలని చూస్తుంటారు. అలాంటి వారిని ‘Alpha Husband’ అంటారు. అయితే ఇలాంటి వాళ్లతో గొడవకు దిగకుండా, అదే సమయంలో ఆత్మ గౌరవాన్ని కోల్పోకుండా సమస్యను పరిష్కరించుకోవాలంటున్నారు నిపుణులు.

నచ్చజెప్పండి!

భార్యాభర్తల మధ్య ఏ గొడవ ఉన్నా కలిసి కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారమవుతుందంటుంటారు. ఈ నియమం పెత్తనం చెలాయించే భర్త విషయంలోనూ వర్తిస్తుంది. అయితే ఎదుటివ్యక్తి కోపంలో ఉన్నప్పుడు ఏం చెప్పినా వారికి అర్థం కాదు. అందుకే తను కాస్త ప్రశాంతంగా ఒకచోట కూర్చున్నప్పుడు వెళ్లి.. తన ప్రవర్తన వల్ల మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో విడమరిచి చెప్పండి. ఇద్దరి మధ్యా జరిగే ఈ వాదనల వల్ల ఇటు మీరు, అటు మీ పిల్లలు ఎంతలా బాధపడుతున్నారో వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. అలాగే వారు అలా ప్రవర్తించడానికి గల కారణాలేంటో కూడా నేరుగా అడగచ్చు. ఇలా ఇద్దరి మధ్య జరిగే సానుకూల చర్చ నెమ్మదిగానైనా మీ వారిలో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.

ఆత్మన్యూనత వద్దు!

అకారణంగా ఎదుటి వ్యక్తి మనపై పెత్తనం చెలాయిస్తున్నారంటే ఆత్మన్యూనతకు గురవడం సహజం. ఇలాంటప్పుడే ఇతరులతో పోల్చుకోవడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం.. వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి ప్రతికూల భావనలు ఇలా మనల్ని శారీరకంగా, మానసికంగా కుంగదీయడంతో పాటు అనుబంధానికీ అవరోధాలుగా మారుతుంటాయి. ఈ క్రమంలో మీపై మీరు నమ్మకం, గౌరవం కోల్పోకుండా ఉండేందుకు స్వీయ ప్రేమను పెంచుకోవడం ముఖ్యం. నచ్చిన పనులు చేయడం, ఇష్టమైన వ్యాపకాలపై దృష్టి పెట్టడం వల్ల కొంత వరకు ఫలితం ఉంటుంది.

ఆధారపడద్దు!

ఆర్థిక స్వేచ్ఛ ఉన్న మహిళల కంటే.. వ్యక్తిగతంగా, ఆర్థికంగా తమపై ఆధారపడే భార్యల విషయంలోనే చాలామంది భర్తలు పెత్తనం చెలాయించాలని చూస్తుంటారు. ఈ క్రమంలో వాళ్లనో పూచిక పుల్లలా తీసిపడేస్తుంటారు. వాళ్ల నిర్ణయాలను, అభిప్రాయాలను ఏమాత్రం గౌరవించరు. ఇలాంటి భర్తలతో వేగలేక, తాము పడుతోన్న బాధ ఎవరితో చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతుంటారు చాలామంది భార్యలు. నిజంగా మీలో ప్రతిభ ఉంటే, మిమ్మల్ని మీరు నిరూపించుకోగలరన్న నమ్మకం ఉంటే ఎవరికీ తలవంచాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ చదువు, ట్యాలెంట్‌కి తగ్గ ఉద్యోగం ఏదో ఒకటి వెతుక్కునే ప్రయత్నం చేయండి. ఒకవేళ దీనికీ వాళ్లు అడ్డుపడినట్లయితే.. ఇద్దరి సంపాదన ఉంటే అది కుటుంబానికే మంచిదని సానుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇలా మీ కాళ్ల మీద నిలబడగలిగితే ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం రెట్టింపవుతాయి. ఇది పరోక్షంగా అనుబంధానికీ మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.

ఆఖరి ప్రయత్నంగా..!

ఎదుటివారు తమని తక్కువ చేసి చూస్తున్నారంటేనే కోపం కట్టలు తెంచుకోవడం సహజం. అలాగని ఎంత ప్రయత్నించినా వాళ్లు మారట్లేదని.. మీరూ వాళ్లలాగే గట్టిగా అరవడం, గొడవకు దిగడం చేస్తే సమస్య పరిష్కారమవకపోగా.. మరింత జటిలమవుతుంది. కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోతే.. ఆఖరి ప్రయత్నంగా ఇద్దరూ కలిసి మానసిక నిపుణుల దగ్గరికి కౌన్సెలింగ్‌కి వెళ్లడం మంచిది. తద్వారా మీ వారి ప్రవర్తనకు గల కారణాలేంటో తెలుసుకొని వాళ్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇవ్వడం, ఇద్దరితో మరోసారి మాట్లాడడం.. వంటివి చేస్తారు. దీనివల్ల కొంతవరకు ఫలితం ఉండచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని