అత్యవసర నూనెలతో ఇల్లు శుభ్రంగా..!

పరిమళాలు వెదజల్లే అత్యవసర నూనెల్ని అందానికే ఉపయోగిస్తుంటాం. కానీ ఇంటిని శుభ్రం చేసే న్యాచురల్‌ క్లీనర్‌గానూ వీటిని వాడచ్చన్న విషయం చాలామందికి తెలియదు.

Published : 10 Jan 2024 20:45 IST

పరిమళాలు వెదజల్లే అత్యవసర నూనెల్ని అందానికే ఉపయోగిస్తుంటాం. కానీ ఇంటిని శుభ్రం చేసే న్యాచురల్‌ క్లీనర్‌గానూ వీటిని వాడచ్చన్న విషయం చాలామందికి తెలియదు. అయితే వీటిలో ఉండే యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఇంట్లో ఆయా ఉపరితలాలపై చేరిన క్రిముల్ని నాశనం చేసి శుభ్రం చేయడంతో పాటు పరిమళాలూ వెదజల్లుతాయి. మరి, ఇంటి శుభ్రత విషయంలో ఏయే అత్యవసర నూనెను ఎలా వాడాలో తెలుసుకుందాం రండి..

వీటితో కలిపి..!

సాధారణంగానే అత్యవసర నూనెలు అధిక గాఢతను కలిగి ఉంటాయి. అందుకే సౌందర్య పరిరక్షణలోనూ వాటిని నేరుగా వాడకుండా.. కొబ్బరి, ఆలివ్‌, బాదం.. ఇలా ఏదో ఒక క్యారియర్‌ ఆయిల్‌లో వీటిని విలీనం చేసి ఉపయోగిస్తుంటాం.. అది కూడా కొన్ని చుక్కలు మాత్రమే కలుపుతుంటాం. ఇంటిని శుభ్రం చేసేందుకు ఉపయోగించే అత్యవసర నూనెల్నీ ఇలాగే ఉపయోగించాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని సహజసిద్ధమైన క్లీనింగ్‌ ఉత్పత్తులతో వీటిని కలుపుకొని స్ప్రే మిశ్రమాల్ని తయారుచేసుకోవాలి. ఇందుకోసం కప్పు వైట్‌ వెనిగర్‌, కప్పు నీళ్లు ఒక బౌల్‌లో తీసుకొని.. అందులో 30 చుక్కల ఏదైనా ఎసెన్షియల్‌ ఆయిల్‌ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో నింపుకొని.. ఇంట్లోని ఆయా ఉపరితలాలు, వస్తువులపై స్ప్రే చేసుకొని.. పొడి గుడ్డతో తుడిచేస్తే సరిపోతుంది. ఇలా వెనిగరే కాకుండా.. బేకింగ్‌ సోడా, నిమ్మరసం, ఆలివ్‌ నూనె, ఉప్పు.. వంటి వాటిలోనూ అత్యవసర నూనెల్ని కలుపుకొని న్యాచురల్‌ క్లీనింగ్‌ ద్రావణంలా తయారుచేసుకోవచ్చు. ఇవి ఆయా ఉపరితలాలపై పేరుకున్న దుమ్ము, ధూళిని తొలగించి.. బ్యాక్టీరియా, క్రిముల్ని నశింపజేయడంతో పాటు ఇంట్లో పరిమళాలూ వెదజల్లుతాయి.

ఏ నూనె.. దేనికి వాడాలంటే..?!

⚛ ఇంట్లో తేమ కారణంగా మూలల్లో ఫంగస్‌ వృద్ధి చెందడం చూస్తుంటాం. దీనివల్ల ఇల్లు అపరిశుభ్రంగా కనిపించడమే కాదు.. ఇది వాతావరణంలోకి చేరితే ఆరోగ్యానికీ మంచిది కాదు. కాబట్టి ఇలాంటి ప్రదేశంలో యూకలిప్టస్‌ నూనెతో తయారుచేసిన మిశ్రమాన్ని స్ప్రే చేయాలి. కాసేపటి తర్వాత టిష్యూతో తుడిచి చెత్తడబ్బాలో పడేయాలి. ఇలా కొన్ని రోజులకోసారి మూలల్లో ఈ మిశ్రమాన్ని స్ప్రే చేయడం వల్ల తిరిగి ఆ ప్రదేశంలో ఫంగస్‌ పెరగకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ ఇంటిని ఎంత శుభ్రం చేసినా కొన్ని ప్రదేశాల్లో పదే పదే బూజు తయారవుతుంది. ఇక దీన్ని శుభ్రం చేయడం పెద్ద పని. ఇలా జరగకూడదంటే బూజుకు కారణమయ్యే సాలీడు పురుగుల్ని నివారించాలి. ఈ పని పెప్పర్‌మింట్‌ ఆయిల్‌ సమర్థంగా నిర్వర్తిస్తుంది. అందుకే ఇంట్లో అక్కడక్కడా పెప్పర్‌మింట్‌ నూనెతో తయారుచేసిన స్ప్రే మిశ్రమాన్ని స్ప్రే చేయాలి.

⚛ నిరంతరం తేమగా ఉండే బాత్‌రూమ్స్‌, కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌, నీడ పడే ప్రాంతాల్లో బ్యాక్టీరియా, ఫంగస్‌లు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఇవి ఆయా ప్రదేశాల్లోని గాలిలోకీ చేరి వివిధ రకాల అనారోగ్యాల్ని కలిగిస్తాయి. అందుకే ఇలాంటి ప్రదేశాల్ని, అక్కడి వస్తువుల్ని టీట్రీ ఆయిల్‌తో తయారుచేసిన క్లీనింగ్‌ మిశ్రమంతో శుభ్రం చేస్తే ఈ క్రిముల బెడద ఉండదు. అటు ఇల్లు శుభ్రమవడంతో పాటు ఇటు పరిమళాలూ వెదజల్లుతాయి.

⚛ ఒక్కోసారి ఇంట్లో అదో రకమైన దుర్వాసనలు వస్తుంటాయి. ఇలాంటప్పుడు లావెండర్‌ నూనెతో తయారుచేసిన క్లీనింగ్‌ స్ప్రేను ఇల్లంతా వెదజల్లడం, ఆయా ఉపరితలాల్ని ఆయా ద్రావణాలతో శుభ్రం చేయడం వల్ల ఫలితం ఉంటుంది. అలాగే ఈ నూనెలోని యాంటీ సెప్టిక్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఆయా గదుల్లోని గాలిని కూడా శుద్ధి చేస్తాయి.

⚛ ఎంత శుభ్రం చేసినా ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో జిడ్డు పేరుకుపోతుంది. ముఖ్యంగా కిచెన్‌ ప్లాట్‌ఫాం, స్టౌ వెనక వైపు ఉండే కిచెన్‌ టైల్స్‌, గాజు అద్దాలపై ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. మరి, ఈ జిడ్డును వదిలించాలంటే నిమ్మ నూనెతోనే సాధ్యమవుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం నిమ్మ నూనెతో తయారుచేసిన క్లీనింగ్‌ స్ప్రేను ఆయా ఉపరితలాలపై స్ప్రే చేసి శుభ్రం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

⚛ కొన్నిసార్లు దుస్తులు, షూస్‌ నుంచి అదో రకమైన వాసన వస్తుంటుంది. ఇలాంటప్పుడు రోజ్‌మేరీ నూనెతో తయారుచేసిన ద్రావణాన్ని వాటిపై స్ప్రే చేస్తే తక్షణ ఫలితం ఉంటుంది.

⚛ ఇంట్లోని కొన్ని ఉపరితలాలపై నూనె, నీళ్ల మరకలు పడుతుంటాయి. ఇలాంటి మరకలు వదలగొట్టాలంటే తులసి నూనెతో తయారుచేసిన క్లీనింగ్‌ ద్రావణాన్ని అక్కడ స్ప్రే చేసి శుభ్రం చేస్తే సరిపోతుంది.

⚛ బాత్‌రూమ్‌లో ట్యాప్స్, సోప్‌కేస్‌పై నీళ్లు, సబ్బు మరకలు పడుతుంటాయి. ఇవి ఎంత శుభ్రం చేసినా ఓ పట్టాన వదలవు. ఇలాంటప్పుడు గ్రేప్‌ఫ్రూట్‌ నూనెతో తయారుచేసిన ద్రావణాన్ని వీటిపై స్ప్రే చేసి శుభ్రం చేయాలి. ఫలితంగా అవి శుభ్రపడి మెరుస్తాయి. అలాగే పరిమళాలూ వెదజల్లుతాయి.

⚛ ఇక ఇంట్లోని గృహోపకరణాలు, కప్‌బోర్డ్స్‌, ఇతర వస్తువుల్ని శుభ్రం చేయడానికి ఆరెంజ్‌ నూనె మిశ్రమం చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ఆయా వస్తువులకు మెరుపు అందించడంతో పాటు గదిలోని గాలి పరిమళభరితంగా మారడంలోనూ సహకరిస్తుంది.

అయితే ఈ క్లీనింగ్‌ ద్రావణాలు సహజసిద్ధమైనవే అయినా.. వీటిని ఉపయోగించే క్రమంలో ముక్కు-నోరు కవరయ్యేలా మాస్క్‌, చేతులకు గ్లౌజులు ధరించడం అస్సలు మర్చిపోవద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్