Updated : 09/12/2022 21:44 IST

పోషకాల దోశ!

పెసరపప్పు, అటుకులు (పోహా)... పోషక విలువలు పుష్కలంగా ఉన్న వీటిని ఆహారంలో చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. అందుకు తగ్గట్టే వీటితో వివిధ రకాల వంటలు చేస్తుంటారు చాలామంది. అయితే రెండింటినీ కలిపి ఏదైనా కొత్త రెసిపీ తయారు చేసుకోవాలనుకుంటే ‘పోహా-మూంగ్‌ దాల్‌ దోశ’ ట్రై చేయచ్చు.

ఆ శ్రమ లేకుండా!

సాధారణంగా దోశలు తయారుచేసుకోవాలంటే ముందు రోజే రాత్రి పిండిని పులియబెట్టుకోవాలి. అయితే ఈ దోశలకు ఆ అవసరం లేదు. అటుకులు, పెసరపప్పును గంటన్నర పాటు నీటిలో నానబెట్టుకుంటే చాలు. సులభంగా తయారుచేసుకునే ఈ దోశలను బ్రేక్‌ఫాస్ట్‌గానే కాదు ఈవెనింగ్‌ స్నాక్స్‌, పార్టీ స్నాక్స్‌లలో కూడా భాగం చేసుకోవచ్చు. మరి ఈ సూపర్‌ హెల్దీ రెసిపీని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం రండి..

పోహా-మూంగ్ దాల్‌ దోశ

కావాల్సిన పదార్థాలు

⚛ అటుకులు (పోహా) - ఒక కప్పు

⚛ పెసర పప్పు (మూంగ్‌దాల్‌) - ముప్పావు కప్పు

⚛ మెంతులు - ఒక టీస్పూన్

⚛ తురిమిన కొబ్బరి - అర కప్పు

⚛ సన్నగా తరిగిన పచ్చి మిర్చి- ఒక టీస్పూన్

⚛ అల్లం - అర టీస్పూన్

⚛ కొత్తిమీర – పావు కప్పు

⚛ జీలకర్ర- అర టీస్పూన్

⚛ ఉప్పు - రుచికి సరిపడా

⚛ నెయ్యి - తగినంత

తయారీ విధానం

ఒక బౌల్ నీటిలో అటుకులు, పెసరపప్పు, మెంతులు వేసి గంటన్నర పాటు నానబెట్టండి. గంటన్నర తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలోకి వడగట్టి తురిమిన కొబ్బరి వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరో బౌల్‌లోకి తీసుకుని అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు కూడా జత చేసి దోశ పిండిలా తయారుచేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌ వేడి చేసి కొద్దిగా నీళ్లు చల్లాలి. అనంతరం ముందుగా రడీ చేసుకున్న బ్యాటర్‌ను ప్యాన్‌పై పోయాలి. గరిట సహాయంతో దోశ రౌండ్‌ షేప్‌ వచ్చేలా చేసుకోవాలి. దోశ అంచుల చుట్టూ నెయ్యి వేసి మీడియం సైజు మంటపై కాల్చుకోవాలి. దోశ గోధుమ రంగులోకి మారిన తర్వాత తిరగేసి కాల్చాలి. మిగిలిన పిండిని కూడా ఇలాగే చేసుకోవాలి. కొబ్బరి చట్నీ / సాంబార్‌తో కలిపి ఈ దోశలను తీసుకుంటే మరింత టేస్టీగా ఉంటాయి.


పోషకాలెన్నో!

ప్రొటీన్లతో నిండి ఉండే పెసరపప్పును ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ రేటు పెరుగుతుంది. ఇందులో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఫైబర్‌తో పాటు పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్, విటమిన్‌ బి6 కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక తక్కువ క్యాలరీలు, కొవ్వులుండే పోహాను కూడా చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి మహిళల్లో ముఖ్యంగా గర్భిణులలో రక్తహీనత సమస్యలను బాగా తగ్గిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని