దుస్తుల మెరుపు తగ్గకుండా..!

కొత్త దుస్తులు వేసుకునేటప్పుడు వాటిని అపురూపంగా చూసుకుంటాం. కానీ రాన్రానూ వాటి విషయంలో శ్రద్ధ తగ్గిపోతుంటుంది. ఫలితంగా కొద్ది రోజులకే దుస్తులు పాతవాటిలా మారిపోతాయి.

Published : 03 Dec 2023 14:05 IST

కొత్త దుస్తులు వేసుకునేటప్పుడు వాటిని అపురూపంగా చూసుకుంటాం. కానీ రాన్రానూ వాటి విషయంలో శ్రద్ధ తగ్గిపోతుంటుంది. ఫలితంగా కొద్ది రోజులకే దుస్తులు పాతవాటిలా మారిపోతాయి. అలా జరగకుండా దుస్తులు ఎక్కువ కాలం మన్నాలంటే, కొత్తవాటిలా మెరిసిపోవాలంటే వాటిని ఉతికేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

చల్లని నీటిలోనే..

చాలామంది మురికి ఎక్కువగా ఉండే బట్టలను వేడి నీళ్లలో నానబెట్టి ఉతుకుతుంటారు. బాగా మురికిగా ఉన్న వాటికి ఈ చిట్కా ఉపకరిస్తుంది. కానీ వాటితో పాటే మిగతా దుస్తుల్ని కూడా వేడినీటితో ఉతకడం పొరపాటు. ఇలా చేయడం వల్ల వాటి నాణ్యత దెబ్బతింటుంది. కొన్ని దుస్తులకైతే దారాలు పోగులు బయటికొచ్చేయడం, ముడుచుకుపోవడం.. గమనించచ్చు. కాబట్టి రోజూ వేసుకునే దుస్తుల్ని చల్లటి నీటిలో నానబెట్టి ఉతకడం మంచిది.

తిరగేసి ఆరేయాలి!

బట్టలు ఉతికేటప్పుడు లోపల, బయట రెండువైపులా శుభ్రం చేయాలని గుర్తుంచుకోండి. అందుకే ముందు బయటి భాగం శుభ్రం చేసుకుంటే తర్వాత బట్టలు తిరగేసి లోపలి భాగం ఉతకచ్చు. అలాగే ఉతికిన బట్టల్ని తిరగేసి, ముడతల్లేకుండా ఆరేయాలి. ఇలా చేయడం వల్ల బట్టలు బాగా శుభ్రపడటమే కాకుండా ఎండకు రంగు కోల్పోకుండా ఉంటాయి.

లేబుల్స్ ఆధారంగా..

బట్టలు కొన్నప్పుడు వాటికి కొన్ని లేబుల్స్ ఉంటాయి. ఇంటికొచ్చాక వాటిని కత్తిరించి పక్కన పడేయకుండా ముందు దాని మీద ఇచ్చిన వివరాలను ఓసారి గమనించండి. దీని వల్ల ఆ బట్టలను డ్రైవాష్ చేయాలా? వాషింగ్‌మెషీన్‌లో వేయాలా? లేక చేత్తో ఉతకాలా? నీడలో ఆరేయాలా లేక ఎండలోనా? వంటి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే వాటిని ఇస్త్రీ చేయచ్చా? లేదా? కూడా తెలుస్తుంది. ఆ వివరాల ఆధారంగానే దుస్తుల్ని శుభ్రం చేస్తే అవి ఎక్కువ కాలం మన్నుతాయి.

ఇవి వద్దు!

బట్టలకు ఉన్న మురికి తొందరగా వదిలిపోయి అవి తళతళా మెరిసిపోవాలని ఉతికే నీళ్లలో క్లోరిన్, బ్లీచ్ వంటివి కలుపుతుంటారు కొందరు. నిజానికి వీటి వల్ల దారాల నాణ్యత తగ్గిపోతుంది. ఫలితంగా బట్టలు త్వరగా చిరిగిపోతాయి. అందుకే వీటికి బదులు వెనిగర్‌ని ఉపయోగించడం మంచిది. వెనిగర్‌ దుస్తులకు కొత్త మెరుపునూ అందిస్తుందట!

మరకలు పడిన వెంటనే..

బట్టల మీద మరకలు పడిన వెంటనే వాటిని పోగొట్టే ప్రయత్నం చేయాలి. అలాకాకుండా ఉతికే సమయంలో చూసుకుందామని వదిలేస్తే ఆ మరకలు మరింత కఠినంగా మారి ఎంత రుద్దినా వదిలిపోవు. ఫలితంగా ఆ ప్రదేశంలో రంగూ కోల్పోతాయి.

కఠినమైన సబ్బులు వద్దు..

బట్టలు ఉతకడానికి ఉపయోగించే సబ్బులు తక్కువ గాఢత కలిగినవైతే మంచిది. ఎక్కువ గాఢత ఉన్న సబ్బులు, డిటర్జెంట్లను ఉపయోగించడం.. మురికి తొందరగా వదిలిపోవాలని ఎక్కువ మొత్తంలో వాటిని వాడటం వంటివి చేయడం వల్ల దుస్తుల నాణ్యత దెబ్బతింటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్