వ్యాక్సింగ్‌... ఇంట్లోనే ఇక!

దీర్ఘకాలంపాటు అవాంఛిత రోమాలు రాకుండా ఉంటాయని చాలామంది వ్యాక్సింగ్‌ చేయించుకుంటారు. కానీ అన్నిసార్లూ పార్లర్‌కి వెళ్లడం కుదరకపోవచ్చు. ఇంట్లోనే చేసుకుందామంటేనేమో... వాక్స్‌ ఆరిపోతోంటే పదే పదే వేడిచేయడం దగ్గర్నుంచి పూర్తయ్యాక ఆ పాత్రని శుభ్రపరచడం వరకు పెద్ద తతంగంలా తోస్తుంది. కానీ ఈ ప్రక్రియనూ సులువు చేస్తూ కొన్ని మార్గాలున్నాయని తెలుసా?

Updated : 24 May 2024 04:28 IST

బ్యూటీ ట్రెండ్‌

దీర్ఘకాలంపాటు అవాంఛిత రోమాలు రాకుండా ఉంటాయని చాలామంది వ్యాక్సింగ్‌ చేయించుకుంటారు. కానీ అన్నిసార్లూ పార్లర్‌కి వెళ్లడం కుదరకపోవచ్చు. ఇంట్లోనే చేసుకుందామంటేనేమో... వాక్స్‌ ఆరిపోతోంటే పదే పదే వేడిచేయడం దగ్గర్నుంచి పూర్తయ్యాక ఆ పాత్రని శుభ్రపరచడం వరకు పెద్ద తతంగంలా తోస్తుంది. కానీ ఈ ప్రక్రియనూ సులువు చేస్తూ కొన్ని మార్గాలున్నాయని తెలుసా?

పెదాల కోసం...

పెదవి పైభాగం, కనుబొమలకీ వ్యాక్స్‌ చేయించుకుంటారా? అయితే వాటికోసం ప్రత్యేకంగా వ్యాక్సింగ్‌ స్ట్రిప్స్‌ ఉన్నాయని తెలుసా? వీటిని కావాల్సిన ప్రదేశంలో అతికించుకుని, కొద్దిసేపయ్యాక లాగేస్తే సరిపోతుంది. చిన్నగా ఉంటాయి కాబట్టి, ఇబ్బందీ ఉండదు. పైగా కూల్‌ వ్యాక్స్‌ కాబట్టి, కాలుతుందన్న భయమూ అక్కర్లేదు. వ్యాక్సింగ్‌ పెన్‌ అయినా ఉత్తమ ఎంపికే! దీన్ని కాసేపు వేడినీటిలో వేసి ఉంచితే... లోపలి పదార్థం సులువుగా బయటకు వచ్చేలా తయారవుతుంది. కావాల్సిన ప్రదేశంలో రాసి, స్ట్రిప్‌తో లాగేస్తే సరి. పైపెదవి, కనుబొమలు, గడ్డం వంటి ప్రదేశాలకు చక్కని ఏర్పాటు కదూ.


రోల్‌ చేయడమే...

కాళ్లు, చేతులకు కాస్త ఎక్కువ మొత్తంలోనే వ్యాక్స్‌ కావాలి. అలాగని పాత్రలో ఎప్పటికప్పుడు వేడిచేసుకుంటూ వాడుకోవాలంటే చిరాకే. దాన్ని సులువు చేస్తుందీ వ్యాక్సింగ్‌ రోలర్‌. ఇదో ఎలక్ట్రిక్‌ పరికరం. కరెంటుతో పనిచేస్తుంది. దీనిలో వ్యాక్స్‌తో నిండిన కాట్రిడ్జ్‌ ఉంటుంది. అవసరమైనప్పుడు బటన్‌ ఆన్‌ చేసుకుంటే వ్యాక్స్‌ వేడవుతుంది. దాన్ని కావాల్సిన ప్రదేశంలో రోల్‌ చేసుకుంటే వ్యాక్స్‌ పలుచని పొరలా అంటుకుంటుంది. స్ట్రిప్స్‌ సాయంతో అవాంఛిత రోమాలను లాగేయడమే. ఇదైతే అతిగా వేడెక్కడం, కాలుతుందేమో అన్న భయం ఉండదు. కావాల్సినప్పుడు స్విచ్‌ ఆన్‌ చేసుకుంటే సరిపోతుంది.


నొప్పి ఉండదు

చాలాకాలం పాటు రోమాలు రావన్నది వాస్తవమే కానీ... వ్యాక్సింగ్‌ చేయించుకునేప్పుడు కలిగే నొప్పి, మంటలను భరించడమే కష్టం కదూ. అయితే ఈ వ్యాక్సింగ్‌ పౌడర్లు ప్రయత్నించేయండి. చాక్లెట్, గంధం, రోజ్, పసుపు వంటి ఫ్లేవర్లలో... సహజ పదార్థాలతో చేస్తున్నారు. వేడిచేయాల్సిన పని ఉండదు. నొప్పి భయం అసలే లేదు. కావాల్సినంత పొడిని తీసుకుని నీళ్లు లేదా పాలల్లో కలపాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్నచోట రాసి, ఆరనివ్వాలి. ఆపై తడి వస్త్రం లేదా టిష్యూతో తుడిస్తే చాలు. వెంట్రుకలన్నీ ఊడొచ్చేస్తాయి. చర్మానికీ పోషణ. బాగున్నాయి కదూ! మీకు అనువైనవేంటో ఎంచుకుని ప్రయత్నించేయండి మరి. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్