ఈ విషయాల్లో జాగ్రత్త..!

ప్రసన్నకు ఐదు నెలల బాబున్నాడు. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఏదైనా స్వీటో, పండో తింటుంటే.. వాడికి కూడా కాస్త రుచి చూపిస్తుంటారు.ఇలాంటి పనులు చాలామంది తల్లిదండ్రులు చేయడం మనం గమనిస్తూనే ఉంటాం. కానీ పసిపిల్లల విషయంలో ఇలాంటి కొన్ని చేయకూడని పనులు....

Published : 07 Feb 2023 21:12 IST

ప్రసన్నకు ఐదు నెలల బాబున్నాడు. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఏదైనా స్వీటో, పండో తింటుంటే.. వాడికి కూడా కాస్త రుచి చూపిస్తుంటారు.

ఇలాంటి పనులు చాలామంది తల్లిదండ్రులు చేయడం మనం గమనిస్తూనే ఉంటాం. కానీ పసిపిల్లల విషయంలో ఇలాంటి కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇవి వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ చిన్న పిల్లల విషయంలో చేయకూడని కొన్ని పనులేంటో మనమూ తెలుసుకుందాం రండి..

నిద్రపోతున్నారా?

పాపాయి నిద్రపోయేటప్పుడు తల్లులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే కొందరు తల్లులు పాపాయి పడుకున్నప్పుడు కూడా వారి నోట్లో పాల బాటిల్ అలాగే ఉంచుతుంటారు. దీనివల్ల పిల్లల కడుపులో గ్యాస్ చేరడం, పాలు గొంతులో పడి వారు అసౌకర్యంగా ఫీలవడం జరుగుతుంది. అలాగే పిల్లలు ఏడవకుండా ఉండాలని ఇలా ఎప్పుడూ వారి నోట్లో ఏదో ఒకటి పెట్టి ఉంచడం వారి లేత చిగుళ్లకు, రాబోయే దంతాల ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి పిల్లలు నిద్రపోయేటప్పుడు ఇలాంటి వస్తువులేమీ వారి నోట్లో ఉండకుండా జాగ్రత్తపడడం మంచిది. మెలకువగా ఉన్నప్పుడు కూడా ఎక్కువసేపు ఉంచకపోవడం మంచిది.

బలవంతంగా నడిపించద్దు..

కొంతమంది పిల్లలు తొమ్మిది నెలలకే నడిచేస్తే, మరికొందరు పిల్లలు ఏడాదిన్నర దాటినా పూర్తిగా నడవలేరు. అయితే కొందరు తల్లిదండ్రులు పాపాయి త్వరగా నడవాలని.. వారికి నడిచే వయసు రాకముందే బలవంతంగా నడిపించడం, వాకర్‌లో వేయడం.. వంటివి చేస్తుంటారు. దీనివల్ల పిల్లల కాళ్ల ఎముకలపై ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా కాళ్లు వంకరగా మారి పెద్దయ్యాక సరిగ్గా నడవలేకపోవడం గమనించవచ్చు. కాబట్టి పిల్లల్ని బలవంతంగా నడిపించకుండా వారంతట వారే నడిచేంతవరకు మీ సహాయాన్ని, ప్రోత్సాహాన్ని అందించాలి.

ఏడ్చినప్పుడు..

పసిపిల్లలు ఎంత సున్నితమైన వారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే వారికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఎంతో సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది తల్లులు పిల్లలు ఏడుస్తున్నారంటే.. వారి ఏడుపు ఆపడానికి పిల్లల్ని ఎత్తుకుని ముందుకు, వెనక్కీ అనడం, వేగంగా వూపడం.. వంటివి చేస్తుంటారు. అయితే ఇలాంటి పనులు పిల్లల్ని అప్పటికప్పుడు ఏడుపు ఆపేలా చేయొచ్చు గానీ.. ఇలా చేయడం వల్ల పిల్లల సున్నితమైన నరాలపై ఒత్తిడి పడే అవకాశాలెక్కువ. తద్వారా వారి మెదడుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇది భవిష్యత్తులో పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి పిల్లల్ని మరీ అంత గట్టిగా కాకుండా.. కాస్త నెమ్మదిగా జోల పాట పాడుతూ బుజ్జగించాలి. వారికి ఆటవస్తువులు, పక్షుల్ని చూపించి వారి ఏడుపు ఆపాలే గానీ వారిని శారీరకంగా మరింత ఒత్తిడికి గురిచేసేలా వ్యవహరించకూడదు.

రుచి కోసం అసలే వద్దు..

పిల్లలకు ఆర్నెళ్ల వరకు తల్లిపాలు తప్ప ఇతర ఆహారమేదీ అరగదని, ఎందుకంటే ఈ సమయంలో వారి జీర్ణవ్యవస్థ ఇతర ఆహార పదార్థాలను అరిగించుకునేంతగా వృద్ధి చెందదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలాకాలం క్రితమే వెల్లడించింది. అయితే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తేనె, స్వీట్లు.. మొదలైనవి తినిపించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇది వారి ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. అలాగే దీనివల్ల వారి జీర్ణవ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప ఇతర ఆహార పదార్థాలేవీ వారికి అందించకపోవడం మంచిది.

ఇవి కూడా!

సాధ్యమైనంత వరకు పిల్లలకు తల్లిపాలే ఇవ్వాలి. బాటిల్ పాలను వారికి అందించకపోవడమే ఉత్తమం.

పసిపిల్లలకి ఆకలైనా, దప్పికైనా.. తల్లిపాలతోనే తీరతాయి. కాబట్టి ప్రత్యేకించి ౬ నెలల లోపు వారికి దాహమవుతుందేమోనని నీరు తాగించడం మంచిది కాదు. అనవసరంగా నీళ్లు తాగించినట్లయితే వారి శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలన్స్ అదుపు తప్పే ప్రమాదం ఉంది.

పిల్లలకు మరీ పసి వయసులో ఉన్నప్పుడు టబ్‌లో స్నానం చేయించడం కూడా మంచిది కాదు.

అదేవిధంగా పసిపిల్లలు తియ్యకుండా మరీ ఎక్కువసేపు ఏడవడం కూడా మంచిది కాదు.. ఇలాంటి సందర్భాలలో ఎంతకీ ఏడుపు ఆపకపోతుంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం అవసరం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్