Published : 13/02/2023 15:03 IST

గ్యాలంటైన్స్ డే: అమ్మాయిలకు మాత్రమే!

కన్నతల్లిపై మనకున్న ప్రేమను పంచుకోవడానికి ‘మదర్స్‌ డే’ జరుపుకొంటాం..

నడిపించిన నాన్నపై ప్రేమాభిమానాలను కురిపించడానికి ‘ఫాదర్స్‌ డే’ ఉండనే ఉంది..

నచ్చిన వాడితో ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడానికి ‘వేలంటైన్స్‌ డే’ను మించిన మంచి తరుణం మరేముంటుంది చెప్పండి..?

మరి, అది సరే గానీ.. గ్యాలంటైన్స్ డే గురించి మీరెప్పుడైనా విన్నారా? ఇప్పుడిది కొత్తగా వింటున్నా ఇదీ ప్రేమతో ముడిపడిన ఓ ప్రత్యేక సందర్భమే! ఇంతకీ ఎవరితో అంటారా? రండి.. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం..!

మనసుకు బాధ కలిగినా, సంతోషంగా అనిపించినా ఆ భావనను పంచుకోవాలంటే ముందుగా గుర్తొచ్చేది స్నేహితులే! అలాంటి స్నేహబంధాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడానికి మనం ఏటా ‘ఫ్రెండ్షిప్‌ డే’ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇదే స్నేహాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడానికి మరో రోజు కూడా ఉందండోయ్‌! అదే ‘గ్యాలంటైన్స్ డే’! అయితే ఇది కేవలం గర్ల్‌ గ్యాంగ్‌తో జరుపుకొనే వేడుక! వేలంటైన్స్‌ డేకు సరిగ్గా ఒక రోజు ముందు అంటే ఫిబ్రవరి 13న ఈ గ్యాలంటైన్స్ డే సెలబ్రేట్‌ చేసుకోవడం కొన్నేళ్ల నుంచి ట్రెండ్‌గా కొనసాగుతోంది.

ఆద్యురాలు ఆమేనా?!

2010లో రూపొందించిన ‘పార్క్స్‌ అండ్ రిక్రియేషన్‌ సీజన్‌ 2’ అనే అమెరికన్‌ టీవీ సిరీస్‌ను ఈ ప్రత్యేకమైన రోజుకు నాందిగా చెబుతారు. ఇందులో లెస్లీ నోప్‌ అనే కల్పిత పాత్రలో నటించి మెప్పించిన అమీ పోలర్ వేలంటైన్స్‌ డేకి ఒక రోజు ముందు తన గర్ల్‌ గ్యాంగ్‌కి అల్పాహార విందు ఇస్తుంది. ఇలా మనసుకు నచ్చిన మహిళా స్నేహితులందరూ కలిసి వేడుక జరుపుకొన్న సందర్భంగా ఈ అకేషన్‌కి ‘గ్యాలంటైన్స్ డే’గా నామకరణం చేసిందామె. అంతేకాదు.. అప్పట్నుంచి ఏటా ఫిబ్రవరి 13న ఇలా మహిళా స్నేహాన్ని సెలబ్రేట్‌ చేసుకోవాలని నిర్ణయించుకుందట! క్రమంగా అదే ఆనవాయితీగా మారింది. అయితే మదర్స్‌ డే, ఫాదర్స్‌ డే.. వంటి పాశ్చాత్య సంస్కృతుల ప్రభావం మనపై పడినట్లే.. ఈ గ్యాలంటైన్స్ డే కూడా ఇప్పుడిప్పుడే మన దేశంలోకీ ప్రవేశిస్తోంది.

ఆ రోజు ఏం చేస్తారంటే..!

భర్త, పిల్లలు, కుటుంబ బాధ్యతలన్నీ ఎప్పుడూ ఉండేవే.. కానీ మన కోసం మనం ఒక రోజంటూ సెలబ్రేట్‌ చేసుకోవాలన్న అంతరార్థం కూడా ఈ గ్యాలంటైన్స్ డేలో దాగుందని చెప్పచ్చు. ఇక ఈ ప్రత్యేకమైన రోజున గ్రీటింగ్‌ కార్డులు ఇచ్చిపుచ్చుకోవడం, లంచ్‌ డేట్‌, డిన్నర్‌ డేట్‌, స్నేహితులతో కలిసి స్పాకు వెళ్లడం, వ్యాసాల రూపంలో స్నేహితులపై ఉన్న ప్రేమను తెలుపుకోవడం.. ఇలా మన కోసం మనకు నచ్చినట్లుగా ఎంజాయ్ చేస్తూ అటు స్నేహాన్నీ పెంచుకోవచ్చు.. ఇటు ఆనందాన్నీ మూటగట్టుకోవచ్చన్నమాట! మరి.. ఇవీ గ్యాలంటైన్స్ డే విశేషాలు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని