High Blood Pressure: రక్తపోటు ఏ ఉప్పు వాడాలి

వయసు 36. బరువు డెబ్బై మూడు. డిప్రెషన్‌, ఒత్తిడి, అధిక రక్తపోటుతో బాధపడుతున్నా. ఉప్పు తగ్గించమంటున్నారు. మార్కెట్‌లో చాలా రకాల ఉప్పులు ఉన్నాయి.

Updated : 02 Mar 2023 05:36 IST

వయసు 36. బరువు డెబ్బై మూడు. డిప్రెషన్‌, ఒత్తిడి, అధిక రక్తపోటుతో బాధపడుతున్నా. ఉప్పు తగ్గించమంటున్నారు. మార్కెట్‌లో చాలా రకాల ఉప్పులు ఉన్నాయి. నేను దేన్ని ఎంచుకోవాలి? ఈ సమస్యల్ని అదుపులో ఉంచుకోవాలంటే  నేనెలాంటి ఆహారం తీసుకోవాలి?

- సత్య, కర్నూలు

* ఆహారంలో ఉప్పు తగ్గించినంత మాత్రాన అధిక రక్తపోటు తగ్గిపోదు. బీపీతో పాటు డిప్రెషన్‌, ఒత్తిడి వంటి సమస్యలతోనూ ఇబ్బంది పడుతున్నా అంటున్నారు. ఇవన్నీ నియంత్రణలో ఉండాలంటే ముందు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. మీ ఎత్తుకు తగ్గ బరువున్నారో లేదో గమనించుకుని మొదట దాన్ని అదుపులో ఉంచుకోండి. ఇందుకోసం రోజూ కనీసం నలభై ఐదు నిమిషాలు వ్యాయామం చేయాలి. అప్పుడు శరీరంలో విడుదలయ్యే హ్యాపీ హార్మోన్లు ఒత్తిడి, కుంగుబాటుని తగ్గిస్తాయి. ఇక, ఆహారం విషయానికి వస్తే.. ఏ రకమైన ఉప్పు తీసుకున్నా రోజులో అది 5 గ్రా.లకు మించకూడదు. ఉప్పు మోతాదు ఎక్కువ ఉండే నిల్వ పదార్థాలూ, పచ్చళ్లు, సాస్‌లు, జెల్లీలు, బిస్కెట్లు, కూల్‌ డ్రింకులూ, బేకింగ్‌ పదార్థాలను తినడం తగ్గించాలి. పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, ఒమెగా త్రీ కొవ్వులని రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా పొటాషియం నరాల మీద ప్రభావం చూపించడం వల్ల ఒత్తిడి, కుంగుబాటు వంటివి తగ్గుతాయి. అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలూ ఎదురుకావు. పొట్టుతో ఉన్న తృణధాన్యాలూ, ముడిబియ్యం, గింజధాన్యాలు తినడంపై దృష్టిపెట్టండి. మొలకెత్తిన గింజలు, నానబెట్టిన నట్స్‌ వంటివాటిని రోజూ కనీసం ఓ ముప్పై గ్రాములైనా ఉండాలి. మీ డైట్‌లో ఆకుకూరలూ, కాయగూరలు కనీసం మూడువందల గ్రాములైనా ఉండేలా చూసుకోండి. సాయంత్రం గుగ్గిళ్లను స్నాక్స్‌గా తీసుకోవచ్చు. రాత్రి పూట బార్లీ, జొన్న, సజ్జ వంటివాటితో చేసిన కిచిడీ, రొట్టె వంటివాటిని పెరుగుతో కలిపి తినడం అలవాటు చేసుకోండి. వీటితో పాటు రంగు రంగుల పళ్ల ముక్కల్ని తినడం మరిచిపోవద్దు. నూనె వాడకం తగ్గించండి. వంటకాల్లో సోయాబీన్‌, రైస్‌ బ్రాన్‌ వంటి రకాల్ని ప్రయత్నించండి. ఇవన్నీ క్రమంగా మీ సమస్యల్ని అదుపులో ఉంచుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్