Met Gala 2024: గ్రీన్‌ కార్పెట్‌పై తారల సొగసులు!

మెట్‌ గాలా.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫ్యాషన్‌ వేడుక ఇది. ప్రపంచవ్యాప్తంగా పేరు మోసిన సెలబ్రిటీలు ఒక్క చోట చేరి.. విభిన్న ఫ్యాషనబుల్‌ దుస్తుల్లో అందాలు ఆరబోయడమే కాదు.. మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌ కాస్ట్యూమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కోసం నిధుల సమీకరణలోనూ పాలుపంచుకుంటారు.

Published : 07 May 2024 18:07 IST

(Photos: Instagram)

మెట్‌ గాలా.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫ్యాషన్‌ వేడుక ఇది. ప్రపంచవ్యాప్తంగా పేరు మోసిన సెలబ్రిటీలు ఒక్క చోట చేరి.. విభిన్న ఫ్యాషనబుల్‌ దుస్తుల్లో అందాలు ఆరబోయడమే కాదు.. మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌ కాస్ట్యూమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కోసం నిధుల సమీకరణలోనూ పాలుపంచుకుంటారు. ఏటా ఒక్కో థీమ్‌తో జరిగే ఈ వేడుకను ఈసారి ‘స్లీపింగ్‌ బ్యూటీస్‌ : రీఅవేకెనింగ్‌ ఫ్యాషన్‌’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. మరి, ఈసారి ఈ గ్లోబల్‌ ఈవెంట్‌లో మెరిసిన భారతీయ తారలెవరు? వాళ్ల ఫ్యాషనబుల్‌ అవుట్‌ఫిట్స్‌పై ఓ లుక్కేద్దాం రండి..

ఆలియా.. షీర్‌ మెరుపులు!

గతేడాది మెట్‌ గాలాలో తొలిసారి మెరిసింది బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌. ఈసారీ ఈ ఈవెంట్‌ గ్రీన్‌ కార్పెట్‌పై తనదైన రీతిలో మెరిసిపోయింది. గ్లోబల్‌ వేదికపై భారతీయత ఉట్టిపడేలా చీరకట్టులో దర్శనమిచ్చిందీ అందాల తార. ప్రముఖ డిజైనర్‌ సబ్యసాచి ముఖర్జీ రూపొందించిన మింట్‌ గ్రీన్‌ కలర్‌ షీర్‌ శారీని ధరించిన ఆమె.. చీరకు జతగా వెనుక భాగంలో 23 అడుగుల పొడవైన వెయిల్‌తో కట్టిపడేసింది. 163 మంది కళాకారులు, 1905 పనిగంటలు వెచ్చించి రూపొందించిన ఈ చీరపై విభిన్న రంగుల్లో ఫ్లోరల్‌ ఎంబ్రాయిడరీతో పాటు బీడ్స్‌, సీక్విన్స్‌, స్టోన్స్‌, గ్లాస్‌ బీడ్స్‌, ముత్యాలు.. వంటి వాటితో హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ చేశారు. దీనికి మ్యాచింగ్‌గా అదే కలర్‌ షీర్‌ బ్లౌజ్‌ను ఎంచుకున్న ఆమె.. వెనుక వైపు బౌ డిజైన్‌తో తన రవికెకు అదనపు హంగులద్దింది. బన్‌ హెయిర్‌స్టైల్‌, మాతా పట్టితో.. ఎప్పటిలాగే తక్కువ మేకప్‌తో మెట్‌ గాలా వేదికపై తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌ని ప్రదర్శించింది ఆలియా.


ఈషా.. పూల సోయగం!

వేడుకేదైనా ఫ్యాషనబుల్‌గా మెరిసిపోయే ఈషా అంబానీ.. తాజా మెట్‌ గాలా ఈవెంట్‌లోనూ స్టైలిష్‌గా దర్శనమిచ్చింది. ఈ వేడుక కోసం డిజైనర్‌ రాహుల్‌ మిశ్రా రూపొందించిన శారీ గౌన్‌ని ఎంచుకుందామె. బ్రాంజ్‌ సీక్విన్స్‌తో హంగులద్దిన ఈ అవుట్‌ఫిట్‌కి అనుసంధానించిన వెయిల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వేర్వేరు కాలాల్లో విరబూసే పువ్వుల్ని స్ఫూర్తిగా తీసుకొని.. అవి మొలకెత్తడం, పువ్వులుగా విరబూయడం.. వంటివన్నీ హ్యాండ్‌ ఎంబ్రాయిడరీతో తీర్చిదిద్దారు. గోల్డెన్‌ షీర్‌ ఫ్యాబ్రిక్‌పై రంగురంగుల పూలు పరిచినట్లుగా రూపొందించిన ఈ వెయిల్‌ను శారీకి అనుసంధానించిన ఈ అంబానీ ప్రిన్సెస్‌.. తనదైన ఫ్యాషన్‌ మార్క్‌ని ప్రదర్శించింది. డైమండ్‌ చోకర్‌, పోనీ హెయిర్‌ స్టైల్‌, పొత్లీ బ్యాగ్‌.. వంటివన్నీ ఆమె లుక్‌ని ద్విగుణీకృతం చేశాయని చెప్పచ్చు.


సుధా.. కస్టమైజ్‌డ్‌ నెక్లెస్!

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సుధా రెడ్డి ఎప్పటిలాగే మెట్‌ గాలా వేదికపై తనదైన రీతిలో మెరుపులు మెరిపించారు. తరుణ్‌ తహ్లియానీ రూపొందించిన ఐవరీ సిల్క్‌ డ్రస్‌లో తళుక్కుమన్న ఆమె.. తన అభిరుచులకు తగినట్లుగా డైమండ్‌ నెక్లెస్‌ను కస్టమైజ్‌ చేయించుకొని సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. హృదయాకృతిలో ఉన్న 25 క్యారట్ల వజ్రాలతో రూపొందించిన ఈ నెక్‌పీస్‌కు.. మరో మూడు 20 క్యారట్ల హార్ట్‌ షేప్‌డ్‌ వజ్రాల్ని లాకెట్‌గా ధరించారు. తన భర్త, ఇద్దరు పిల్లల్ని ప్రతిబింబించేలా ఈ మూడు వజ్రాల్ని కస్టమైజ్‌ చేయించుకున్నారామె. ఇక తన డ్రస్‌కు అనుసంధానించిన ఐవరీ కలర్‌ షీర్‌ వెయిల్‌ ఆమె లుక్‌ని ద్విగుణీకృతం చేసిందని చెప్పచ్చు.


మోనా.. సీతాకోకచిలుకలా!

భారతీయ ఫ్యాషనర్‌ మోనా పటేల్‌ ఈ ఏడాది మెట్‌ గాలా ఈవెంట్‌లో తొలిసారి పాల్గొంది. సాధారణంగానే ఆయా వేడుకలు, ఈవెంట్లలో స్టైలిష్‌గా మెరిసిపోయే మోనా.. మెట్‌ గాలా కోసం ఓ అందమైన గౌన్‌ని ఎంచుకుంది. సీతాకోకచిలుకను పోలిన అందమైన గౌన్‌ అది. నేలపై జాలువారేలా ఉన్న న్యూడ్‌ కలర్‌ స్కల్ప్‌టెడ్‌ గౌన్‌పై సీతాకోక చిలుక ఆకృతిలో ఉన్న కోర్సెట్‌తో హంగులద్దారు. ఇక ఈ డ్రస్‌కు వెనుక వైపు జత చేసిన పొడవాటి ట్రెయిన్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెప్పచ్చు. డచ్‌ డిజైనర్‌ ఇరిస్‌ వ్యాన్‌ హెర్పెన్ దీన్ని రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్