Published : 17/12/2021 20:06 IST

కాబోయే అమ్మలూ.. చలికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి!

రిధిమకు ఇప్పుడు ఐదో నెల. తనకు ముందు నుంచీ ఇమ్యూనిటీ అంతంత మాత్రమే! దాంతో పదే పదే జలుబు, దగ్గు బారిన పడుతుంటుందామె. ఇక ఈ సమస్యలు ఇప్పుడామెకు సవాళ్లుగా మారాయి.

ఇటీవలే నెల తప్పిన మృదులకు చలికాలమంటే అస్సలు పడదు. ఎందుకంటే ఈ సమయంలో తన చర్మం విపరీతంగా పొడిబారిపోతుంటుంది. దీంతో పొట్ట పెరిగే క్రమంలో చర్మం సాగి ఇంకెంత దురద పుడుతుందోనని తన భయం!

ఏదేమైనా చలికాలంలో ఇలాంటి సమస్యలు చాలామందికి కామనే. అసలే చలికాలంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరు మందగిస్తుందంటే.. గర్భిణుల్లో ఆ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. తద్వారా వారు ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఎక్కువ! ఇక వీటికి తోడు ప్రస్తుతం ఒమిక్రాన్‌ ముప్పు కూడా పొంచి ఉంది. కాబట్టి ఈ సీజన్‌లో కాబోయే తల్లులు తమ ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని సలహా ఇస్తున్నారు.

చలికాలంలో జలుబు, దగ్గు, కీళ్లు పట్టేయడం, పొడి చర్మం.. వంటి సమస్యలు చాలామందికి పెను సవాళ్లుగా మారుతుంటాయి. సాధారణంగానే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే గర్భిణులకు ఈ కాలం గడ్డుకాలమే అని చెప్పచ్చు. అలాగని పెద్దగా భయపడాల్సిన పని లేదని, కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలోనూ ప్రెగ్నెన్సీని హెల్దీగా ఎంజాయ్‌ చేయచ్చని చెబుతున్నారు నిపుణులు.

అందుకే నీళ్లు తాగాలట!

వాతావరణం కాస్త చల్లగా ఉంటే చాలు అస్సలు దాహం వేయదు. అలాగని నీళ్లు తాగకుండా ఉంటే డీహైడ్రేషన్‌ బారిన పడే ప్రమాదం ఉంది. గర్భిణులు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే శరీరంలో నీటి స్థాయులు తగినంత లేకపోతే ఉమ్మనీరు తగ్గిపోయే ప్రమాదం ఎక్కువ.. ఇది బిడ్డ ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతేకాదు.. ఇదిలాగే కొనసాగితే నెలలు నిండకుండానే బిడ్డ పుట్టే (ప్రి-మెచ్యూర్‌ డెలివరీ) అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు. కాబట్టి ఏ కాలమైనా డాక్టర్‌ సలహా మేరకు తగినంత మోతాదులో నీళ్లు తాగడం మంచిది. అలాగే కొబ్బరి నీళ్లు తాగినా మంచి ఫలితం ఉంటుంది.

‘అరోమా థెరపీ’తో ఆరోగ్యంగా..!

చలికాలంలో చాలామందిని వేధించే సమస్య కీళ్ల నొప్పులు. చల్లగాలులకు శరీరంలోని రక్తనాళాలు కుచించుకుపోయి రక్తప్రసరణ నెమ్మదిగా జరుగుతుంటుంది. తద్వారా కండరాలు, కీళ్లు బిగుసుకుపోవడమే కాదు.. గుండెకూ రక్తం సరిగ్గా సరఫరా కాదు. గర్భిణుల్లో ఇలాంటి సమస్యలుంటే అది కడుపులో ఎదిగే బిడ్డకూ ప్రమాదమే! కాబట్టి ఇలాంటి సమస్యలెదుర్కొనే గర్భిణులు చలికాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇందుకోసం అరోమా థెరపీ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో లావెండర్‌, టీట్రీ, యూకలిప్టస్‌.. వంటి అత్యవసర నూనెలతో శరీరమంతా మసాజ్‌ చేసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. తద్వారా శారీరక నొప్పులు తగ్గడమే కాదు.. ఆరోగ్యమూ ఇనుమడిస్తుంది. ఈ చిట్కాతో పొడిచర్మం సమస్య కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అయితే ఇవి సహజసిద్ధమైన నూనెలే అయినప్పటికీ గర్భిణులు వీటిని వాడే విషయంలో ఒక్కసారి ముందుగా నిపుణుల సలహా తీసుకోవడం మరీ మంచిది.

చర్మ సంరక్షణ తప్పనిసరి!

చలికాలమంటే చాలామంది భయపడిపోతుంటారు.. కారణం చర్మం పొడిబారిపోవడం! దీంతో దురద, మంటతో సతమతమైపోవాల్సిందే. ఇక గర్భిణుల్లోనైతే పొట్ట పెరిగిన కొద్దీ చర్మం సాగుతూ పగులుతుంటుంది. తద్వారా మరింత దురద పుడుతుంది. దీన్నిలాగే నిర్లక్ష్యం చేస్తే స్ట్రెచ్‌మార్క్స్‌తో తిప్పలు తప్పవు. అందుకే డాక్టర్‌ సలహా మేరకు క్రీములు, లోషన్లు, నూనెలు వాడచ్చు. వాటితో రోజుకు ఒకటి లేదా రెండుసార్లు పొట్ట భాగంలో మర్దన చేసుకుంటే అటు రక్తప్రసరణ మెరుగవడంతో పాటు చర్మం పొడిబారిపోకుండా జాగ్రత్తపడచ్చు.. అలాగే ప్రసవానంతరం స్ట్రెచ్‌మార్క్స్‌ రాకుండా కూడా ఈ చిట్కా తోడ్పడుతుంది. ఇక మిగతా భాగాల్లో చర్మ సంరక్షణ కోసం, పొడి జుట్టు నుంచి విముక్తి పొందడం కోసం నిపుణుల సలహా మేరకు సంబంధిత సౌందర్య ఉత్పత్తులు వాడచ్చు. లేదంటే ఇంట్లోనే తయారుచేసుకున్న సహజసిద్ధమైన బ్యూటీ ఉత్పత్తులు ఉపయోగించచ్చు.

ఉదయం నుంచీ ఉత్సాహంగా..!

చలికాలం ఉదయాన్నే లేవాలంటే ఒళ్లు బద్ధకిస్తుంది.. దీనికి తోడు గర్భం ధరించిన మూడు నాలుగు నెలల పాటు వేవిళ్ల సమస్య వేధిస్తుంటుంది. ఫలితంగా శరీరం మరింత నీరసించిపోయే ప్రమాదం ఉంది. తద్వారా కడుపులో పెరుగుతోన్న బిడ్డ పైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఎక్కువ. కాబట్టి ఉదయం నుంచి ఉత్సాహంగా ఉండాలంటే వ్యాయామం, ధ్యానం, యోగా.. వంటివి రోజువారీ జీవన విధానంలో భాగం చేసుకోమంటున్నారు నిపుణులు. వీటివల్ల శరీరం ఉత్తేజితమవడంతో పాటు మనసుకూ ప్రశాంతత లభిస్తుంది. అయితే గర్భం ధరించిన సమయంలో ఎలాంటి వ్యాయామాలు చేయాలన్న విషయం గురించి మీకు మీరు సొంత నిర్ణయం తీసుకోవడం కాకుండా మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

ఇక వేవిళ్ల వల్ల నీరసం, అలసట ఎదురవకూడదంటే.. ఉసిరి రసం, పాలకూర రసం.. వంటివి తీసుకుంటే మంచి ఫలితం ఉందంటున్నారు నిపుణులు. అలాగే ఈ సీజన్‌లో లభించే జామ, కమలాఫలం.. వంటి పండ్లను తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

చలికాలంలో గర్భవతులు ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకున్నారు కదా! వీటితో పాటు బయటికి వెళ్లేటప్పుడు మాస్క్‌ పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత.. వంటివన్నీ కరోనా కనుమరుగయ్యేంత వరకు తప్పక పాటించాల్సిందే!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని