Yoga: ఏకాగ్రత కోసం..

ఒక్కోసారి పని మీద మనసు కేంద్రీకరించలేక పోతుంటాం. ఎప్పుడైనా ఒకసారి, చిన్న చిన్న పరధ్యానాలే కారణమైతే పర్లేదు. ఈ లక్షణం ముదిరితే మాత్రం ఏడీ…హెచ్‌డీ (అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపరాక్టివిటీ డిజార్డర్‌) ల్యాక్‌ ఆఫ్‌ కాన్‌సన్‌ట్రేషన్‌, ట్రబుల్‌ ఫోకసింగ్‌.. లాంటి భయానక పేర్లు వినాల్సివస్తుంది.

Published : 29 Apr 2023 00:22 IST

ఒక్కోసారి పని మీద మనసు కేంద్రీకరించలేక పోతుంటాం. ఎప్పుడైనా ఒకసారి, చిన్న చిన్న పరధ్యానాలే కారణమైతే పర్లేదు. ఈ లక్షణం ముదిరితే మాత్రం ఏడీ…హెచ్‌డీ (అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపరాక్టివిటీ డిజార్డర్‌) ల్యాక్‌ ఆఫ్‌ కాన్‌సన్‌ట్రేషన్‌, ట్రబుల్‌ ఫోకసింగ్‌.. లాంటి భయానక పేర్లు వినాల్సివస్తుంది. ఆ స్థితిలో పడకుండా యోగా మనల్ని రక్షిస్తుంది. ముఖ్యంగా కౌండిన్యాసనం కొంచెం కష్టమే అయినా ఏకాగ్రతను, సూక్ష్మదృష్టినీ పెంచుతుంది.

ఇలా చేయాలి.. కౌండిన్య మహర్షి పేరు మీద ఉన్న ఆసనం కౌండిన్యాసనం. కొత్తగా యోగా మొదలుపెట్టిన వారు ఈ ఆసనం చేయకూడదు. ఆసనాలు అలవాటు ఉన్న వారు కూడా బకాసనం వేశాక కౌండిన్యాసనం చేయాలి. ముందుగా రెండు కాళ్లూ దగ్గరగా పెట్టుకుని కూర్చోవాలి. తర్వాత సరిగ్గా పాదాల ముందు అరచేతులు పెట్టాలి. అంటే కుడి పాదం దగ్గర కుడిచెయ్యి, ఎడమ పాదం దగ్గర ఎడమ చెయ్యి ఉంటాయి. మోచేతులు కొద్దిగా వంచాలి. రెండు మోచేతులనూ రెండు మోకాళ్లకూ ఆనించి తొడల భాగాన్ని కాస్త కాస్తగా లేపాలి. కుడి కాలు కుడివైపుకు, ఎడమ కాలు ఎడమవైపుకు వెళ్లేలా చూసుకోవాలి. నెమ్మదిగా శరీరమంతా పైకి లేపినప్పుడు బరువంతా చేతుల మీదే ఉంటుంది. ఉండగలిగినంత సేపు ఈ భంగిమలో ఉండి నెమ్మదిగా రెండు కాళ్లనూ కింద పెట్టి సేద తీరాలి.

జాగ్రత్తలు... బరువంతా రెండు చేతుల మీదే మోపుతాం కనుక చాలా జాగ్రత్తగా చేయాలి. పక్కటెముకలు, వెన్ను, కండరాలు పటిష్టంగా ఉన్నాయనుకుంటేనే చేయాలి. ఇతర ఆసనాలు చేస్తూ శరీరానికి దృఢత్వం చేకూరిన తర్వాతే ప్రారంభించాలి.

ప్రయోజనాలు.. కౌండిన్యాసనం వల్ల చేతులు, వెన్ను భాగం బలంగా తయారవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. సూక్ష్మదృష్టి అలవడుతుంది. బ్యాలెన్సింగ్‌ చేయగలుగుతాం. ఒక పని అయ్యేవరకూ దాని మీద మనసు లగ్నం చేయాలనుకుంటే ఈ ఆసనం వల్ల ప్రయోజనం ఉంటుంది. మనసు పరివిధాలుగా పోదు.

ఎవరు చేయకూడదు.. వెన్ను, చేతులు బలహీనంగా ఉన్నవాళ్లు, ఏమైనా ఫ్రాక్చర్లు అయినవాళ్లు, మరేవైనా తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఈ ఆసనం జోలికి వెళ్లకూడదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్