Air Canada Flight: సీటులో కూర్చునేందుకు నిరాకరణ.. ప్రయాణికులను బయటకు పంపిన పైలట్‌!

ఎయిర్‌ కెనడా సంస్థకు చెందిన ఒక విమానం నుంచి ఇద్దరు మహిళలను కిందకు దించేశారు. వారికి కేటాయించిన సీట్లు అపరిశుభ్రంగా ఉండటంతో ప్రశ్నించడమే దీనికి కారణం. 

Updated : 07 Sep 2023 12:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానంలో తమకు కేటాయించిన సీట్లలో కూర్చునేందుకు నిరాకరించిన ఇద్దరు మహిళలను సిబ్బంది బయటకు పంపించారు. ‘ఎయిర్‌ కెనడా సంస్థ’ (Air Canada Flight)కు చెందిన విమానంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

లాస్ వెగాస్ (Las Vegas) నుంచి మాంట్రియల్‌ (Montreal)కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న విమానంలో ఇద్దరు మహిళా ప్రయాణికులు తమకు కేటాయించిన సీట్లలో కూర్చునేందుకు నిరాకరించారు. సీట్ల నుంచి దుర్వాసన రావడమే అందుకు కారణం. వారు అనుమానంతో వాటిని పరిశీలించగా ఎవరో అక్కడ వాంతులు చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో వారు సిబ్బందికి సమాచారం అందించారు. అయితే, ఇంతకు ముందు ఈ విమానంలో ప్రయాణించిన వ్యక్తి వాంతులు చేసుకున్నారని.. దానిని సరిగా శుభ్ర పర్చకుండానే సీటును కవర్‌ చేశారని తేలింది. దీంతో సిబ్బంది ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు. దుర్వాసన పోయేందుకు సువాసన ద్రవ్యాలు, కాఫీ పొడిని అక్కడ చల్లారు. ఎంత ప్రయత్నించినా.. దుర్వాసన మాత్రం ఆగలేదు.

గ్రీన్‌కార్డు ‘జీవిత కాలం’ లేటు

విమానంలో ఖాళీలు లేవని.. వారు అక్కడే కూర్చోవాలని సిబ్బంది సూచించారు. కొన్ని నిమిషాలపాటు దీనిపై వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో సమాచారం అందుకున్న పైలట్‌ అక్కడకు చేరుకొన్నారు. అక్కడ కూర్చునేందుకు ఇష్టం లేకపోతే.. విమానం నుంచి దిగిపోవాలని చెప్పారు. లేదా భద్రతా సిబ్బంది సాయంతో కిందికి దింపేస్తారు అని హెచ్చరించారు. దీంతో సిబ్బంది ఆ ప్రయాణికులను బయటకు పంపించేశారు. విమానంలో ఉన్న బెన్సన్‌ అనే మరో ప్రయాణికురాలు ఈ ఘటన వివరాలను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది.

‘‘అక్కడ ఎవరో వాంతులు చేసుకున్నట్లు గుర్తించారు. దుర్వాసన వస్తోంది. అక్కడ కూర్చోవాల్సిన ఇద్దరు మహిళలు దీనిపై సౌమ్యంగానే సిబ్బందితో మాట్లాడుతున్నారు. ఇంతలో పైలట్‌ వచ్చి వారితో దురుసుగా ప్రవర్తించారు. అనంతరం వారిని బయటకు పంపించారు. ఎయిర్‌ కెనడా సంస్థకు చెందిన విమానంలో ఈ ఘటన జరగడం బాధాకరం. కెనడాకు చెందిన పౌరురాలిగా ఈ విషయంపై సిగ్గుపడుతున్నాను’’ అని రాసుకొచ్చారు. అనంతరం ఎయిర్‌ కెనడా సంస్థ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని