Lady Serial Killer: చేయని నేరాలకు ‘సీరియల్‌ కిల్లర్‌’గా ముద్ర.. 20 ఏళ్లకు క్షమాభిక్ష!

తన నలుగురు పిల్లలను హతమార్చిందనే ఆరోపణలపై ‘సీరియల్‌ కిల్లర్‌’గా ముద్రపడిన ఓ మహిళ 20 ఏళ్లుగా జైలుకు పరిమితమయ్యారు. అయితే, ఆ చిన్నారులు సహజంగానే మృతి చెందారని తాజా విచారణలో తేలడంతో తాజాగా ఆమె విడుదలయ్యారు. ఆస్ట్రేలియాలో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

Published : 05 Jun 2023 18:51 IST

కాన్‌బెర్రా: దశాబ్ద కాలంలో వేర్వేరు సందర్భాల్లో తన నలుగురు పిల్లలను పొట్టన పెట్టుకుని.. ఆస్ట్రేలియా (Australia)లో క్రూరమైన ‘మహిళా సీరియల్‌ కిల్లర్‌ (Serial Killer)’గా ముద్రపడిన ఓ మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఇటీవల శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా చేపట్టిన విచారణలో ఆమె తన చిన్నారులను హత్య చేయలేదని తేలింది. దీంతో అధికారులు ఆమెకు క్షమాభిక్ష ప్రసాదించడంతో.. 20 ఏళ్ల తర్వాత జైలు జీవితం నుంచి బయటకు వచ్చారు.

న్యూసౌత్‌ వేల్స్‌కు చెందిన కాథలీన్‌ ఫ్లోబిగ్‌ (55)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఈ నలుగురూ 1989- 99 మధ్య కాలంలో ఆయా సందర్భాల్లో ఆకస్మికంగా మృతి చెందారు. చనిపోయే సమయంలో వారంతా 19 రోజుల నుంచి 19 నెలల మధ్య వయసున్న వారే. కన్న తల్లే వారిని ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఆమె తన డైరీలో పిల్లల పెంపకం కష్టాలపై రాసిన రాతలు, ఇతరత్రా సాక్ష్యాల ఆధారంగా 2003లో 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, తాను ఏ తప్పు చేయలేదంటూ ఆమె.. న్యాయ పోరాటం చేస్తూ వచ్చారు.

ఈ క్రమంలోనే ఇటీవల ఓ రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కేసును మరోసారి దర్యాప్తు చేపట్టారు. ఇందులో ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ నలుగురు చిన్నారులు సహజంగానే మరణించి ఉండొచ్చని పరిశోధకులు అంచనాకు వచ్చారు. ఆ పిల్లల్లో అరుదైన జన్యుపరమైన లోపాలు ఉన్నాయని, ఇవి ఆకస్మిక మరణాలకు దారితీశాయని తేల్చారు. తల్లి డీఎన్‌ఏలోనూ అసాధారణ జన్యు క్రమం కనిపించిందని పరిశోధనా బృందానికి నాయకత్వం వహించిన ఆస్ట్రేలియన్‌ నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కరోలా వినూసా తెలిపారు.

డైరీలో రాతలకు.. చిన్నారుల హత్యలకు సంబంధం లేదని, పిల్లలను ఒక్క సాక్ష్యం లేకుండా హతమార్చడం అసంభవమని తాజా దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారు. పైగా, పిల్లలను ఊపిరాడనీయకుండా చేసినట్లు, లేదా వారు గాయపడినట్లు ఆధారాలు కూడా లభించలేదని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే న్యూ సౌత్ వేల్స్ గవర్నర్‌ ఆమెకు క్షమాభిక్ష ప్రసాదించారు. న్యాయవ్యవస్థ మరింత శాస్త్రీయ సంస్కరణలతో ముందుకు సాగాలనే అవసరాన్ని ఈ కేసు చాటుతోందని ‘ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్’ వ్యాఖ్యానించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని