Afghanistan: భారత్‌లో అఫ్గాన్‌ ఎంబసీ మూసివేత

Afghanistan: భారత్‌లో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అఫ్గాన్‌ ఎంబసీ ప్రకటించింది. భారత ప్రభుత్వం నుంచి సహకారం కొరవడినందునే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఓ ప్రకటనలో పేర్కొంది.

Updated : 24 Nov 2023 11:22 IST

దిల్లీ: భారత్‌లో తమ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు అఫ్గానిస్థాన్‌ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంబసీ (Afghanistan Embassy) ప్రకటించింది. దీంతో 2023 నవంబర్‌ 23 నుంచి దేశంలో తమ దౌత్య కార్యకలాపాలు నిలిచిపోనున్నట్లు తెలిపింది. వాస్తవానికి సెప్టెంబర్‌ 30 నుంచే అఫ్గాన్‌ ఎంబసీ (Afghanistan Embassy) కార్యకలాపాలు భారత్‌లో నిలిచిపోయాయి. కానీ, భారత ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందకపోవడంతో శాశ్వత మూసివేతకు నిర్ణయం తీసుకున్నామని ఎంబసీ ప్రకటించింది.

దౌత్య అధికారుల్లో కొంత మంది తాలిబన్‌ ప్రభుత్వానికి విధేయత ప్రకటించటంతో అంతర్గత కలహాలు తలెత్తినట్లు ఆరోపణలు వచ్చే అవకాశం ఉందని ఎంబసీ (Afghanistan Embassy) తమ ప్రకటనలో పేర్కొంది. ఇదే దిల్లీలో రాయబార కార్యాలయ మూసివేతకు కారణమనే వార్తలూ రావొచ్చని తెలిపింది. కానీ, తమ విధానాల్లో విస్తృత మార్పుల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది.

భారత్‌లోని అఫ్గాన్‌ పౌరులకు ఎంబసీ (Afghanistan Embassy) కృతజ్ఞతలు తెలిపింది. తమను అర్థం చేసుకొని సహకరించారని ప్రకటనలో పేర్కొంది. కాబుల్‌లో చట్టబద్ధమైన ప్రభుత్వం లేకపోయినా.. పరిమిత వనరులు, అధికారాలతోనే వారి సంక్షేమానికి కృషి చేశామని వివరించింది. గత రెండేళ్ల నుంచి భారత్‌లో అఫ్గాన్‌ వాసుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని వెల్లడించింది. శరణార్థులు, విద్యార్థులు, వ్యాపారులు దేశాన్ని వీడారని పేర్కొంది. అలాగే 2021 ఆగస్టు తర్వాత చాలా పరిమిత సంఖ్యలో కొత్త వీసాలను జారీ చేసినట్లు తెలిపింది.

భారత్‌లో గత అఫ్గాన్‌ రిపబ్లిక్‌కు సంబంధించిన దౌత్య అధికారులు ప్రస్తుతం ఎవరూ లేరని ప్రకటనలో ఎంబసీ పేర్కొంది. వారంతా ఇతర దేశాలకు సురక్షితంగా చేరారని తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో ఉన్న వ్యక్తులు తాలిబన్ ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తున్నవారని పేర్కొంది. తమ కార్యకలాపాలను పూర్తిగా భారత ప్రభుత్వానికి అప్పగించామని తెలిపింది. తాలిబన్‌ దౌత్య అధికారులకు అనుమతి ఇవ్వడమా లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడమా అనే అంశాన్ని ప్రభుత్వ నిర్ణయానికే వదిలేస్తున్నామని పేర్కొంది.

అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ల ప్రభుత్వాన్ని భారత్‌ ఇంకా గుర్తించలేదు. ఈ క్రమంలోనే ఆ దేశ రాయబార కార్యాలయానికి సంబంధించి భారత్‌ నిర్ణయాలు తీసుకోవట్లేదు. దీంతో తమ పట్ల భారత్‌ నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఎంబసీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. 2021 ఆగస్టులో అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని