Bilateral macrostomia: చంటిబిడ్డకు వింత పరిస్థితి.. ఆ చిరునవ్వు వెనుక చేదు నిజం!

పుట్టుకతోనే అరుదైన వ్యాధిబారినపడిన ఓ చిన్నారి వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది.

Published : 28 May 2022 02:42 IST

కాన్‌బెర్రా: పుట్టుకతోనే అరుదైన వ్యాధిబారినపడిన ఓ చిన్నారి వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. పెదాల దగ్గర ఏర్పడిన వైకల్యం కారణంగా కనిపించే శాశ్వత చిరునవ్వు వెనుక తీరని వేదనను మిగిల్చింది. 

ఆస్ట్రేలియాకు చెందిన ఐలా సమ్మర్ ముచా.. 2021 డిసెంబర్‌లో జన్మించింది. బైలేటరల్ మైక్రోస్టోమియా అనే అరుదైన వ్యాధి కారణంగా ఆమె పెదాలు సాగినట్లు ఉంటాయి. దాంతో ఆమె మొహం నవ్వినట్లుగానే కనిపిస్తుంది. ఐలా వ్యాధి గురించి వైద్యులు చెప్పినట్లు ఆమె తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కడుపులో బిడ్డ ఎదుగుతున్నప్పుడే ఈ పరిస్థితి ఏర్పడుతుందని వెల్లడించారు. సిజేరియన్‌కు ముందు తీసిన స్కానింగ్‌లో కూడా ఈ విషయం బయటపడలేదు. ‘నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ప్రతి చిన్న జాగ్రత్త తీసుకున్నాను. ఒక తల్లిగా నేనెక్కడ తప్పుచేశానని ఆలోచిస్తూనే ఉన్నాను’ అంటూ ఐలా తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇది తల్లి అజాగ్రత్త కారణంగా వచ్చిన సమస్య కాదని వైద్యులు తెలియజేశారు. 

కాగా, ఆ చిన్నారికి సంబంధించిన ఫొటో షూట్‌లు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పుడూ మోముపై చిరునవ్వు చిందిస్తున్నట్లుగా ఉండే ఆ పాప చిత్రాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. దాంతో ఆమె చిన్నపాటి స్టార్‌గా కూడా మారిపోయింది. అయితే ఆమె నోరు దగ్గర పెద్దగా ఉండటంలో పాలు తాగలేకపోతోంది. దానిని సరిచేసేందుకు వైద్యులు శస్త్రచికిత్స చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

2007లో చేసిన ఓ అధ్యయనం ప్రకారం.. ప్రపంచంలో ఈ తరహా కేసులు 14 మాత్రమే ఉన్నాయట. మరోపక్క ఐలా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ బిడ్డకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ అవగాహన కల్పిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని