Banyan Tree: హవాయి కార్చిచ్చులో.. భారత ‘వృక్ష విలాపం..!’

అమెరికా హవాయిలోని ‘మౌయి’ దీవిలో సంభవించిన కార్చిచ్చులో ఒక మర్రిచెట్టు కాలిపోయింది. అయితే, 150 ఏళ్ల ఈ మర్రి చెట్టుకు.. భారత్‌తో సంబంధం ఉండటం గమనార్హం.

Published : 12 Aug 2023 01:40 IST

లహైనా: అమెరికాలోని హవాయి దీవుల్లో కార్చిచ్చు (Maui Wildfires) కనీవినీ ఎరుగని నష్టాన్ని మిగిల్చింది. ఇక్కడి ‘మౌయి’ దీవిలో సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మంటల ధాటికి పెద్దఎత్తున చెట్టూచేమ కాలి బూడిదయ్యాయి. అమెరికాలోనే అతిపెద్ద మర్రిచెట్ల (Banyan tree)లో ఒకటైన పానియానా (Paniana) కూడా తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడది తన మనుగడ కోసం పోరాడుతోంది. తరతరాలుగా తమతో పెనవేసుకుపోయిన ఆ చెట్టు దుస్థితి స్థానికులనూ కలవరపెడుతోంది. అయితే, 150 ఏళ్ల ఈ మర్రి చెట్టుకు.. భారత్‌తో సంబంధం ఉండటం గమనార్హం.

ఓ క్రైస్తవ కార్యక్రమం 50వ వార్షికోత్సవం సందర్భంగా.. 1873లో భారత్‌ నుంచి తీసుకొచ్చిన ఆ మర్రిని ఇక్కడి లహైనా పట్టణంలో నాటినట్లు ఓ జాతీయ వార్తాసంస్థ కథనం వెలువర్చింది. అప్పుడది కేవలం ఎనిమిది అడుగుల మొక్క. ఇప్పుడది 60 అడుగులకుపైగా ఎత్తుతో, 46 భారీ కాండాలతో, దృఢమైన శాఖలతో విశాలంగా విస్తరించిన మహావృక్షం. అగ్రరాజ్యంలోని అతిపెద్ద మర్రిచెట్లలో ఒకటిగా అవతరించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దానికి 150 ఏళ్ల వేడుకలు నిర్వహించడం విశేషం. ఇంతటి చరిత్ర గల ఈ మాను.. నేడు మంటల్లో చిక్కుకుని కాలిపోయింది! చెట్టు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో స్పష్టంగా తెలియనప్పటికీ.. అది నిలబడే ఉందని వార్తాసంస్థ తెలిపింది.

హవాయిలో కార్చిచ్చు బీభత్సం.. 53కు పెరిగిన మృతులు

ఒకవేళ ‘పానియానా’ వేర్లు ఆరోగ్యంగా ఉంటే.. అది పునర్‌వైభవాన్ని పొందుతుందని స్థానిక అధికారులు చెబుతున్నారు. ‘ఈ చెట్టు బాగానే ఉందని భావిస్తున్నాం. వాస్తవానికి.. ఒక మర్రి చెట్టును నాశనం చేయడం చాలా కష్టం’ లహైనా పునరుద్ధరణ ఫౌండేషన్ పేర్కొంది. హవాయి పర్యాటక సంస్థ వివరాల ప్రకారం.. దాదాపు ఒక ఎకరంలో విస్తరించి ఉన్న ఈ వృక్షం.. లహైనాలో ఒక ప్రధాన ఆకర్షణ కేంద్రం. భారీ కొమ్మలు, వేలాడే ఊడలతో.. చల్లటి నీడనందించే ఈ చెట్టుకింద ఈవెంట్‌లు, కళా ప్రదర్శనలు నిర్వహించేవారు. మౌయి కౌంటీ అర్బరిస్ట్ కమిటీ దీని నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని