Ukraine Crisis: ఉక్రెయిన్‌లో రష్యా చేసేది నరమేధమే..: బైడెన్‌

ఉక్రెయిన్లో రష్యా హింసను ఖండించడంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మరో అడుగు ముందుకేశారు. అక్కడ రష్యా సైనికుల అరాచకాలను తొలిసారి నరమేధంతో పోల్చారు.

Updated : 13 Apr 2022 12:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌లో రష్యా హింసను ఖండించడంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మరో అడుగు ముందుకేశారు. అక్కడ రష్యా సైనికుల అరాచకాలను తొలిసారి నరమేధంతో పోల్చారు. గతంలో జోబైడెన్‌ ఈ పదం వాడేందుకు ఇష్టపడలేదు. కానీ, రష్యా దళాలు దాడులు చేసి వెనుదిరిగిన తర్వాత ఆయా నగరాల్లో భయానక దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జోబైడెన్‌ తీవ్రంగా స్పందించారు. ‘‘నేను దానిని నరమేధమే అంటాను. ఎందుకంటే అసలు ఉక్రెయిన్‌ ఉన్నదన్న ఆలోచనను కూడా కూకటివేళ్లతో సహా పెకలించేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌  ప్రయత్నిస్తున్నారు. గత వారంలో ఉన్న పరిస్థితికి.. ఇప్పటి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. చాలా కొత్త ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉక్రెయిన్‌లో రష్యా దళాలు బీభత్సం సృష్టించాయి. మనం భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని చూస్తాం. నా దృష్టిలో ఇది ఓ నరమేధమే’’ అని విలేకర్లతో అన్నారు. 

గతంలో బైడెన్‌.. ఉక్రెయిన్‌పై రష్యా దళాల చర్యలను యుద్ధ నేరాలుగానే పేర్కన్నారు. కానీ, తాజాగా ‘నరమేధం’ పదం వాడటం విశేషం. ఉక్రెయిన్‌ సంక్షోభంపై  అమెరికా దృష్టికోణంలో నాటకీయమైన మార్పులు వస్తోన్న విషయాన్ని ఈ అంశం వెల్లడిస్తోంది. బైడెన్‌ భావోద్వేగాలతో స్పందిస్తూ.. ఈ సంక్షోభంపై అమెరికా పాలసీలో వేగంగా మార్పులు చేస్తున్నారు. రష్యా దళాల క్రూరత్వంపై అమెరికాలోని చాలా మంది అభిప్రాయాలకు ప్రతీకగా బైడెన్‌ నిలుస్తున్నారు. బైడెన్‌ స్పందనకు ఉక్రయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నుంచి మద్దతు లభించింది. ‘‘నిజమైన నాయకుడి నుంచి నిజమైన వ్యాఖ్యలు. ఓ దుష్టశక్తికి వ్యతిరేకంగా పోరాడటంలో జరిగిన ఘటనలను వాటి పేర్లతో పిలవడం చాలా అవసరం. అమెరికా సాయానికి కృతజ్ఞతతో ఉంటాం. రష్యన్లను అడ్డుకోవడానికి మరిన్ని భారీ ఆయుధాలు కావాలి’’ అంటూ ట్విటర్‌లో  పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని