Asylum Seekers: ఆ దేశాన్ని సురక్షితంగా పరిగణించలేం.. ‘శరణార్థుల కేసు’లో బ్రిటన్‌కు ఎదురుదెబ్బ!

బ్రిటన్‌లో ప్రవేశించే అక్రమ వలసదారులను ఆఫ్రికాలోని రువాండా దేశానికి తరలించాలన్న ప్రభుత్వ ప్రణాళికను స్థానిక కోర్టు చట్టవిరుద్ధంగా ప్రకటించింది. రువాండాను సురక్షిత దేశంగా పరిగణించలేమని తెలిపింది.

Published : 29 Jun 2023 20:13 IST

లండన్: అక్రమ వలసదారుల (Illegal Migrants) కట్టడి విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైన బ్రిటన్‌ (Britain) ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది! శరణార్థిగా ఆశ్రయం పొందాలనుకునేవారి (Asylum Seekers)ని ఆఫ్రికాలోని రువాండా (Rwanda) దేశానికి తరలించాలన్న ప్రభుత్వ ప్రణాళికను స్థానిక కోర్టు చట్టవిరుద్ధంగా ప్రకటించింది. వలసదారులను పంపగల సురక్షిత దేశంగా రువాండాను పరిగణించలేమని అప్పీల్‌ కోర్టు తెలిపింది. రువాండా ఆశ్రయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని.. అక్కడినుంచి శరణార్థులను తిరిగి వారి స్వదేశానికి పంపే ముప్పు పొంచి ఉందని పేర్కొంది. ఫలితంగా వారు వేధింపులకు గురయ్యే అవకాశం ఉందని చెప్పింది.

బోట్ల ద్వారా దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారిపై చర్యలు తీసుకుంటామని బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. ‘అటువంటి వారిని సొంత దేశానికి, లేదా రువాండా వంటి ఇతర దేశాలకు తరలిస్తాం. ఒకసారి వెనక్కి పంపిన వారిని తిరిగి బ్రిటన్‌లోకి అడుగు పెట్టకుండా నిషేధిస్తాం’ అని స్పష్టం చేశారు. అక్రమ వలసదారులను తరలించేలా రువాండాతో బ్రిటన్‌ ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. 140 మిలియన్ పౌండ్లు (దాదాపు 14 వేల కోట్లు) కూడా చెల్లించింది. శరణార్థుల దరఖాస్తులను అక్కడే పరిశీలించి, అనుమతి దక్కినవారికి ఆశ్రయం కల్పిస్తారు. కానీ, ఇంతవరకు ఎవరినీ అక్కడికి తరలించలేదు.

అయితే, బ్రిటన్‌కు 6,400 కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న దేశానికి, పైగా నివసించడానికి ఇష్టపడని ప్రాంతానికి తరలించడమనేది అనైతికం, అమానవీయమని హక్కుల సంఘాలు వాదించాయి. అక్కడ హక్కుల హననం ఉంటుందని, ప్రభుత్వ ప్రత్యర్థులపై హింసాకాండ సాగుతుందని తెలిపాయి. దీనిపై విచారణ చేపట్టిన ముగ్గురు సభ్యుల బెంచ్‌.. రువాండా ఆశ్రయ వ్యవస్థ తీవ్రమైన లోపాలు కలిగి ఉందని, ఆ దేశం సురక్షితం కాదని 2: 1 మెజారిటీతో తీర్పునిచ్చింది. రువాండాను సురక్షితమైన దేశంగా పరిగణించవచ్చని గతంలో బ్రిటన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది.

రువాండా ఆశ్రయ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దే వరకు శరణార్థులను తరలించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. అయితే, ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తెలిపారు. ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలలో రువాండా ఒకటని.. అక్కడి ప్రభుత్వం కూడా పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని