UK: బ్రిటన్‌లో ఠారెత్తిస్తోన్న ఉష్ణోగ్రతలు.. ఆల్‌టైం రికార్డ్‌ బ్రేక్‌!

బ్రిటన్‌లో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. మంగళవారం రికార్డు స్థాయిలో 39.1డిగ్రీల సెల్సియస్ (102.4 ఫారన్‌హీట్‌‌) ఉష్ణోగ్రతలు.......

Updated : 19 Jul 2022 20:02 IST

(సెంట్రల్‌ లండన్‌లో ఓ ఫౌంటెయిన్‌ వద్ద ఓ వ్యక్తి సేదతీరుతున్న దృశ్యం..)

లండన్‌: బ్రిటన్‌లో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. మంగళవారం రికార్డు స్థాయిలో 39.1డిగ్రీల సెల్సియస్ (102.4 ఫారన్‌హీట్‌‌) ఉష్ణోగ్రతలు నమోదైనట్టు బ్రిటన్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. సౌత్‌ లండన్‌లోని గాట్విక్‌ విమానాశ్రయానికి సమీపంలో చార్ల్‌వుడ్‌ సర్రేలో ప్రాథమికంగా ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని.. ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. యూకేలో ఇప్పటివరకూ నమోదైన అత్యంత అధిక ఉష్ణోగ్రతలు ఇవేనని పేర్కొంది. ఈరోజు ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని.. తొలిసారిగా 40డిగ్రీల సెల్సియస్‌ మార్కును దాటే ప్రమాదం లేకపోలేదని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు, బ్రిటన్‌లో ఇప్పటివరకూ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 38.7 డిగ్రీల సెల్సియస్‌గా ఉండేది. 2019 జులై 25న కేంబ్రిడ్జి బోటానిక్‌ గార్డెన్‌లో ఈ ఉష్ణోగ్రత నమోదైంది.

ఈ వారంలో భారీ ఉష్ణోగ్రతలు (41డిగ్రీల సెల్సియస్‌) నమోదయ్యే అవకాశం ఉన్నట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అత్యంత తీవ్రమైన వేడి ఉంటుందని, ముఖ్యంగా రాత్రివేళల్లోనూ వేడి కొనసాగుతుందని  హెచ్చరించారు. నగరప్రాంతాల్లో నివసించేవారు ఈ ఉష్ణ ప్రభావానికి గురవుతారని తెలిపారు. వడగాడ్పులతో పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతలతో పౌరులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉపశమనం పొందేందుకు బీచ్‌ల వెంట పరుగులు తీస్తున్నారు. అత్యంత అరుదుగా సంభవించే ఈ వడగాడ్పులు ఇప్పటికే ఇంగ్లాండ్‌తో పాటు వేల్స్‌లోని పలు ప్రాంతాలను తాకినట్టు వాతావరణ శాఖ ఇటీవల తెలిపింది. ఒకవేళ అదే జరిగితే ప్రజలు అనారోగ్యం బారిన పడటంతో పాటు ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుందని బ్రిటన్‌ ఆరోగ్య విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ ఉష్ణోగ్రతలు 40డిగ్రీల సెల్సియస్‌కు చేరితే వాతావరణ అత్యయిక స్థితి ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని