Combodia Prime Minister: ఫేస్‌బుక్‌కు అభిమాని.. ఇప్పుడు బ్యాన్‌ చేస్తానంటున్నాడు!

కొద్దిరోజుల క్రితం వరకు ఫేస్‌బుక్‌ (Facebook) ఉపయోగించిన కంబోడియా (Cambodia) ప్రధాని, అనూహ్యంగా తమ దేశంలో దానిపై నిషేధం విధించే యోచనలో ఉన్నట్లు ప్రకటన చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

Published : 01 Jul 2023 01:52 IST

నాంఫెన్‌: ఆధునిక సమాజంలో ప్రజలకు సామాజిక మాధ్యమాలతో విడదీయలేని బంధం ఉంది. వయసుతో సంబంధం లేకుండా పాఠశాల విద్యార్ధుల నుంచి పండు ముసలి వరకు సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నారు. అయితే, ఫేస్‌బుక్‌ (Facebook) వంటి సంస్థలు యూజర్‌ అనుమతి లేకుండా డేటా సేకరిస్తున్నాయని, నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నాయనే ఆరోపణలతో కొన్ని దేశాలు వీటిపై నిషేధం విధించాయి. తాజాగా కంబోడియా (Cambodia) ప్రధాని హున్‌సేన్‌ (Hun Sen) కూడా ఫేస్‌బుక్‌పై తమ దేశంలో నిషేధం విధించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. 

ఫేస్‌బుక్‌ను విరివిగా ఉపయోగించే 70 ఏళ్ల హున్‌సేన్‌ తరచుగా తన వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తుంటారు. అప్పుడప్పుడు లైవ్‌ స్ట్రీమింగ్‌ కూడా చేస్తారు. అలాంటి వ్యక్తి ఇకపై తాను ఫేస్‌బుక్‌ వాడనంటూ అనూహ్యంగా దేశ ప్రజలకు ఒక సందేశాన్ని విడుదల చేయడం చర్చనీయాంశమైంది. ఇకపై టెలిగ్రామ్‌ (Telegram)లో తన మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తానని ఆయన తెలిపారు. 

చైనా వంటి దేశాల్లో ఫేస్‌బుక్‌ను నిషేధించినందున అక్కడికి వెళ్లినప్పుడు వాటిని ఉపయోగించలేకపోతున్నాని హున్‌సేన్‌ తెలిపారు. అందువల్లే ఫేస్‌బుక్‌ నుంచి టెలిగ్రామ్‌కు మారాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అయితే, ఇది అసలు కారణం కాదని కంబోడియా వార్తా కథనాలు పేర్కొన్నాయి. జనవరిలో హున్‌సేన్ మాట్లాడిన ఒక వీడియోలో ఆయన ప్రతిపక్ష నాయకులపై తీవ్ర పదజాలంతో ఆరోపణలు చేశారు. దీంతో ఆయన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలపై ఆరు నెలల పాటు నిషేధం విధించాలని అక్కడి స్వతంత్ర విచారణ బోర్డు సూచించింది. ఈ మేరకు విచారణ బోర్డు ఫేస్‌బుక్‌కు నివేదికను పంపింది. దీంతో హున్‌సేన్‌ ఫేస్‌బుక్‌పై నిషేధం విధించాలనే యోచనలో ఉన్నట్లు ప్రకటించారని సమాచారం. దీనిపై ఫేస్‌బుక్‌ స్పందించింది. హున్‌సేన్‌ ఖాతాలపై నిషేధం విధించడానికి బదులుగా.. ఆయన మాట్లాడిన వీడియోలను తొలగించడంపై ఆలోచన చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని