Burning Man: నడిచి నరకం నుంచి బయటపడాలని.. బురద ఎడారిలో వేల మంది అవస్థలు

బర్నింగ్‌ మ్యాన్‌ ఫెస్టివల్‌ జరుగుతున్న బ్లాక్‌రాక్‌ ఎడారిలో గత శుక్రవారం కురిసిన వర్షం దెబ్బకు నేల బురద మయంగా మారిపోయింది. ఈ నరకం నుంచి బయటపడటానికి వేలాది మంది ప్రజలు నడుచుకుంటూ కిలోమీటర్ల దూరం ప్రయాణం మొదలుపెట్టారు. వీరిలో హాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

Updated : 04 Sep 2023 17:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా(USA)లోని నెవాడలో బురద మయంగా మారిన బ్లాక్‌రాక్‌ ఎడారి నుంచి బయటపడేందుకు వేల మంది నరకయాతన పడుతూ నడుస్తున్నారు. బర్నింగ్‌ మ్యాన్‌ (Burning Man) ఫెస్టివల్‌కు వచ్చి ఇక్కడ చిక్కుకుపోయి ఇబ్బంది పడిన వారిలో హాలీవుడ్‌ కమేడియన్‌ క్రిస్‌రాక్‌, డీజే డిప్లో వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. వీరు దాదాపు నాలుగు గంటలపాటు బురదలో నడిచారు. చివరికి ఓ అభిమాని వీరిని తన పికప్‌ ట్రక్‌లో ఎక్కించుకునేందుకు ముందుకు రావడంతో బయటపడ్డారు. ఈ విషయాన్ని డీజే డిప్లో తన ఇన్‌స్టాలో పంచుకొన్నారు.

ప్రస్తుతం బ్లాక్‌రాక్‌ ఎడారిలోని బురదపై ప్రయాణించేందుకు వాహనాలను అనుమతించడంలేదు. దీంతో కొందరు మాత్రం సుమారు 6 మైళ్లు బురదలోనే నడుచుకుంటూ ప్రయాణించేందుకు సిద్ధపడ్డారు. బ్లాక్‌ రాక్‌ ఎడారి బురదలో వేల మంది చిక్కుకుపోయిన విషయాన్ని ఆదివారం అధికారులు దేశాధ్యక్షడు జోబైడెన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని శ్వేత సౌధం కూడా ధ్రువీకరించింది. ఆయన కార్యవర్గం స్థానిక అధికారులతో కలిసి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.

బర్నింగ్‌ మ్యాన్‌ నిర్వాహకుల సూచనలను అనుసరించి అక్కడే ఉండిపోయిన వారికి సెల్‌ఫోన్‌, వైఫై సౌకర్యాలను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నడుచుకుంటూ బయటపడేందుకు ప్రయత్నిస్తున్నవారిని ఎక్కించుకోవడానికి కొన్ని బస్సులను నెవాడ సమీపంలోని గెర్లాచ్‌ వద్ద సిద్ధంగా  ఉంచారు. వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు నెలకొంటే స్పందించేందుకు వీలుగా వీలైనన్ని ఫోర్‌-వీల్‌ డ్రైవ్‌ వాహనాలను, ఆల్‌ టెర్రైన్‌ టైర్లను సిద్ధంగా ఉంచాలని నిర్వాహకులు కోరారు.

ఎలిజబెత్‌-2కు శాశ్వత స్మారకం

బర్నింగ్‌ మ్యాన్‌ ఫెస్టివల్‌ ప్రతిఏటా బ్లాక్‌రాక్‌ ఎడారిలో జరుగుతుంది. ఈ ఫెస్టివల్‌ చివరి రోజున భారీ మనిషిబొమ్మను దహనం చేస్తారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. ఈ ఏడాది ఇన్ని ఇబ్బందులున్నా.. నేటి రాత్రి వాతావరణం అనుకూలిస్తే మనిషి బొమ్మను దహనం చేసే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. సోమవారం ఎండ వస్తే పరిస్థితి కొంచెం మెరుగుపడవచ్చని భావిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని