Pakistan: పాకిస్థాన్‌లో చైనా ఇంజినీర్లపై మజీద్‌ బ్రిగేడ్‌ దాడి..!

పాకిస్థాన్‌లోని కీలకమైన రేవు నగరం గ్వాదర్‌లో చైనా ఇంజినీర్ల కాన్వాయ్‌పై రెబల్స్‌ దాడి చేశారు.

Published : 13 Aug 2023 14:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌(Pakistan)లో చైనా(China)కు చెందిన ఇంజినీర్ల వాహనశ్రేణిపై ఉగ్రదాడి జరిగింది. బలూచిస్థాన్‌లోని అత్యంత కీలకమైన గ్వాదర్‌లో ఈ ఘటన చోటు చేసుకొంది. స్థానికంగా ఉన్న ఫకీర్‌ కాలనీ వంతెనపైకి చైనా ఇంజినీర్లకు చెందిన ఏడు వాహనాలు చేరుకోగానే రెబల్స్‌ కాల్పులు జరిపారు. ఈ దాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లు బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన మజీద్‌ బ్రిగేడ్‌ పేరిట ఓ ప్రకటన విడుదలైంది. దాదాపు రెండు గంటల పాటు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఒక చైనా ఇంజినీరు.. భద్రతా సిబ్బంది ఒకరు గాయపడినట్లు సమాచారం. దాడికి పాల్పడిన ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టారు. 

పాక్‌ స్వాతంత్ర్య దినోత్సవానికి (ఆగస్టు 14) ఒక రోజు ముందు ఈ దాడి జరగడం గమనార్హం. తాజా దాడులతో గ్వాదర్‌ పోర్టుకు వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. ఈ దాడితో పాకిస్థాన్‌లోని చైనా దౌత్యకార్యాలయం అప్రమత్తమైపోయింది. పాక్‌లోని బలూచిస్థాన్‌, సింధ్‌ ప్రావిన్స్‌ల్లోని చైనీయులు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇళ్లలోనే ఉండిపోవాలని కోరింది.

గత 100 ఏళ్లలో చూడని ఘోరం : అమెరికా ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌

పాకిస్థాన్‌లోని చైనా వాసులపై ఇటీవల కాలంలో దాడులు పెరిగిపోయాయి. ముఖ్యంగా గ్వాదర్‌ పోర్టుపై చైనా పెత్తనం చేయడంతో స్థానికులు ఆగ్రహంగా ఉన్నారు.  గతేడాది మే నెలలో ఓ మహిళ కరాచీలోని విశ్వవిద్యాలయం సమీపంలో చైనీయులు ప్రయాణిస్తున్న బస్సుపై ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దాడి కూడా బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీనే చేయించింది. ఇక 2021లో చైనా ఇంజినీర్లను తీసుకెళుతున్న బస్సుపై బాంబుదాడి జరిగింది. దీనిలో 13 మంది చనిపోయారు. ఈ దాడిలో మృతులకు పాకిస్థాన్‌ కొన్ని మిలియన్‌ డాలర్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. అంతేకాదు.. చైనా దర్యాప్తు బృందాలు స్వయంగా పాక్‌కు వచ్చి విచారణ జరిపాయి. అదే ఏడాది ఏప్రిల్‌లో క్వెట్టాలో ఓ విలాసవంతమైన హోటల్‌పై కూడా బాంబుదాడి చేసి చైనా దౌత్యవేత్తను చంపేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని