Jaishankar-Blinken: బ్లింకెన్-జైశంకర్ భేటీకి ముందు.. అమెరికా మళ్లీ అదే స్వరం..!
India-Canada diplomatic row: భారత్-కెనడా ఉద్రిక్తతలపై అమెరికా మరోసారి పాత పాటే పాడింది. భారత్, అమెరికా విదేశాంగ మంత్రులు భేటీ కానున్న వేళ అగ్రరాజ్యం వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
వాషింగ్టన్: అమెరికా (USA) పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్.జైంకర్ (S Jaishanka) గురువారం అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ (Antony Blinken)తో సమావేశం కానున్నారు. ఖలిస్థానీ అంశంలో భారత్-కెనడా (India-Canada) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఈ భేటీ జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలోనే భారత్-కెనడా ‘దౌత్య వివాదం’పై మరోమారు తన వాదనను పునరుద్ఘాటించింది. కెనడా దర్యాప్తునకు భారత్ సహకరించాలని కోరింది. (India-Canada diplomatic row)
అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం (అంటే భారత సమయంలో నేటి అర్ధరాత్రి) జైశంకర్-బ్లింకెన్ సమావేశం జరగనుంది. వీరి భేటీలో ‘భారత్-కెనడా’ అంశం చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన బదులిస్తూ.. ‘‘బ్లింకెన్-జైశంకర్ చర్చల ఎజెండా గురించి చెప్పాలనుకోవట్లేదు. కానీ, కెనడా అంశంలో మా అభిప్రాయాన్ని ఇప్పటికే స్పష్టంగా వెల్లడించాం. ఈ వ్యవహారాన్ని భారత్ వద్ద ప్రస్తావించాం. కెనడా దర్యాప్తునకు భారత్ సహకరించాలని కోరాం’’ అని తెలిపారు.
వీసాలతో సిక్కు యువతకు ఎర.. కెనడాలో ఖలిస్థాన్ అనుకూలుర తీరు
ఐరాస వార్షిక సర్వసభ్య సమావేశాల నిమిత్తం అమెరికా వెళ్లిన జైశంకర్.. ఇప్పటికే అమెరికా మంత్రి బ్లింకెన్‌తో అనధికారికంగా ఒకసారి సంభాషించారు. అప్పట్లో కెనడా అంశం వీరి మధ్య చర్చకు రాలేదని తెలిసింది. ఇక న్యూయార్క్‌లో జరిగిన క్వాడ్ (అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా కూటమి) విదేశాంగ మంత్రుల సమావేశంలోనూ ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి మిల్లర్ వెల్లడించారు.
ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు రాజేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అయితే, ఇరు దేశాలకు మిత్రపక్షంగా ఉన్న అమెరికా.. ఈ అంశంపై ఇటీవల స్పందిస్తూ.. భారత్ దర్యాప్తునకు సహకరించాలని పదేపదే చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా.. నిజ్జర్ హత్యపై నిఘా సమాచారాన్ని కూడా అగ్రరాజ్యమే కెనడాకు ఇచ్చినట్లు అమెరికా పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.