యుద్ధం మరింత విస్తరిస్తుందా?
కనుచూపుమేరలో ముగింపు అనేది కనిపించని రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రాబోయే రోజుల్లో మరింత విస్తరించేలా కనిపిస్తోంది. ఇప్పటిదాకా రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్ ఆత్మరక్షణకే పరిమితమైన యుద్ధంలో తాజాగా మాస్కోపై ఎదురుదాడులు మొదలయ్యాయి.
మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం
రష్యన్ల మీద ఒత్తిడి తెచ్చేలా ఎత్తుగడ?
ఇది ఉగ్రచర్యే: పుతిన్ ఆగ్రహం
కనుచూపుమేరలో ముగింపు అనేది కనిపించని రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రాబోయే రోజుల్లో మరింత విస్తరించేలా కనిపిస్తోంది. ఇప్పటిదాకా రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్ ఆత్మరక్షణకే పరిమితమైన యుద్ధంలో తాజాగా మాస్కోపై ఎదురుదాడులు మొదలయ్యాయి. అంటే యుద్ధం రష్యాలోకి ప్రవేశించింది. 460 రోజులు దాటిన యుద్ధంలో ఉక్రెయినే ఇప్పటిదాకా రష్యా దాడులను చవిచూస్తోంది. నాటో దేశాలు అందిస్తున్న సాయంతో రష్యా క్షిపణులు, డ్రోన్ల నుంచి తనను తాను కాపాడుకుంటూ వస్తోంది. తమ దేశం యుద్ధం చేస్తున్నా... రష్యా వాసులకు ఇప్పటిదాకా దాడుల బెడదగానీ, బంకర్లలో దాక్కోవడాలుగానీ, సైరన్ మోతలుగానీ లేవు. కానీ రెండ్రోజులుగా పరిస్థితి మారింది. ఇప్పుడు మాస్కోపైనా డ్రోన్ల దాడులు మొదలయ్యాయి. దీంతో యుద్ధం ఏ దిశగా సాగుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. నెలరోజుల కిందట క్రెమ్లిన్‌పై డ్రోన్ల దాడి దృశ్యాలను పుతిన్ సర్కారు విడుదల చేసింది. ఉక్రెయినే ఈ పనిచేసిందని ఆరోపించింది. వాటి వాస్తవికతపై చాలామంది అనుమానాలు వ్యక్తంజేశారు. మాస్కోలో రాజకీయ నేతలు, సంపన్నులుండే ప్రాంతాలపై తాజాగా మంగళవారం 8 డ్రోన్లతో దాడులు జరగటం కలకలం రేపుతోంది. పైకి 8 డ్రోన్లే అని చెబుతున్నా, అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు చెబుతున్నారు. ఇదంతా ఉక్రెయిన్ ఉగ్రవాదం పనేనంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్ ఉగ్రదాడిని సమర్థిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తంజేశారు.
నాటో మద్దతు
ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా ఈ దాడులను ఖండిస్తున్నా తమ మిలిటరీ ప్రధాన కార్యాలయంపై రష్యా దాడికి ప్రతీకారంగా ఈ పని చేసిందని అనుమానం. దాడుల్లో పాల్గొన్న యుజె-22 డ్రోన్లు ఉక్రెయిన్లో తయారైనవే కావటం గమనార్హం. త్వరలో మరిన్ని దాడులు జరుగుతాయని కూడా అంటున్నారు. ఇప్పటిదాకా ఆత్మరక్షణ చేసుకుంటూ వస్తున్న ఉక్రెయిన్‌కు ఉన్నట్టుండి రష్యాపై దాడి చేసేంత సాహసం ఎలా వచ్చిందన్న ప్రశ్నకు నాటోలో సమాధానం దొరుకుతుంది. యుద్ధం మొదలైననాటి నుంచీ అన్నివిధాలుగా సాయం చేస్తూ వస్తున్న నాటో దేశాలు తాజాగా ఆధునిక ఆయుధ సామగ్రిని ఉక్రెయిన్‌కు అందిస్తున్నాయి. ఎఫ్-16 విమానాలను ఇవ్వటానికి అమెరికా లాంఛనంగా అంగీకరించింది. జర్మనీ, బ్రిటన్ల నుంచీ భారీగానే ఉక్రెయిన్‌కు ఆయుధాలు వస్తున్నాయి. నాటో దేశాల నైతిక మద్దతు ఎలాగూ ఉంది.
రష్యన్లలో అసంతృప్తి పెంచటానికేనా?
రష్యాను ఇబ్బంది పెట్టడానికి రెండువిధాలుగా ఎదురుదాడి మొదలైంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని ప్రాంతాల్లో పుతిన్ వ్యతిరేక బృందాలు కొన్నింటిని ఎగదోసి... అల్లర్లు, దాడులు చేయిస్తున్నారు. మరోవైపు డ్రోన్లతో దాడులు మొదలయ్యాయి. తద్వారా ఇప్పటిదాకా యుద్ధ ప్రభావాన్ని అంతగా చూడని రష్యా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయటం... వారిలో పుతిన్ పట్ల అసంతృప్తి పెంచటం ఇందులో ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు. మునుముందు రష్యాపై దాడులు పెరిగితే యుద్ధం విస్తరిస్తుందని సైనిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే శాంతిచర్చల దిశగా కూడా ఇది దారితీసే అవకాశం లేకపోలేదనేవారూ ఉన్నారు. ‘‘ఈ దాడులు ఇలాగే కొనసాగితే... ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో రష్యా వైఖరిలో మార్పు రావటానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రష్యా ప్రజానీకం అనివార్యంగా శాంతి దిశగా మొగ్గు చూపొచ్చు. అదే జరిగితే పుతిన్ చర్చలకు సిద్ధం కాకతప్పదు’’ అని మాస్కోలోని కార్నెగీ రష్యా యూరాసియా అధ్యయన కేంద్రం పరిశోధకుడు ఆండ్రీ కొలెస్నికోవ్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ దాడులకు పుతిన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది కీలకం. ‘‘ప్రజలపైనా, నివాస భవనాలపైనా డ్రోన్ల దాడులు చేయటం ద్వారా రష్యాను భయపెట్టాలని ఉక్రెయిన్ ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. ఇది కచ్చితంగా ఉక్రెయిన్ ఉగ్ర చర్య. మేం కూడా అలాగే స్పందించేలా రెచ్చగొడుతున్నారు’’ అని పుతిన్ రష్యా టీవీలో ప్రజలనుద్దేశించి ప్రసంగించటం గమనార్హం!
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
South Korea: అణ్వాయుధాలే ప్రయోగిస్తే.. అంతం చేస్తాం..! కిమ్‌కు హెచ్చరిక
-
JetBlue: విమానం ల్యాండింగ్‌కు ముందు ప్రతికూల వాతావరణం.. గాయపడిన ప్రయాణికులు
-
Ambani: అంబానీ వారసులకు వేతనాలు ఉండవు
-
IND vs AUS: బరిలోకి నలుగురు ‘కీ’ ప్లేయర్లు.. అరుదైన ఘనతపై భారత్ కన్ను!
-
AP High Court: అమరావతి రింగ్‌రోడ్డు కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
-
Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు.. ఆరుగురి అరెస్ట్!