అణు వ్యర్థ జలాలపై ఆందోళన వేళ.. సముద్రపు చేపను తిన్న జపాన్‌ ప్రధాని

పసిఫిక్‌ మహాసముద్రంలోకి అణు వ్యర్థ జలాల విడుదలపై భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. జపాన్‌ ప్రధాని ఫ్యుమియో కిషిద గురువారం టోక్యో ఫిష్‌ మార్కెటును సందర్శించారు.

Published : 01 Sep 2023 04:26 IST

టోక్యో: పసిఫిక్‌ మహాసముద్రంలోకి అణు వ్యర్థ జలాల విడుదలపై భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. జపాన్‌ ప్రధాని ఫ్యుమియో కిషిద గురువారం టోక్యో ఫిష్‌ మార్కెటును సందర్శించారు. ఫుకుషిమా తీరంలో పట్టిన చేపలను ఆరగించిన కిషిద సముద్ర ఆహారంపై సందేహాలను తొలగించే ప్రయత్నం చేశారు. జపాన్‌లో 2011 నాటి సునామీ కారణంగా దెబ్బతిన్న ఫుకుషిమా అణువిద్యుత్తు కేంద్రంలో పేరుకుపోయిన రేడియో ధార్మిక వ్యర్థజలాలను ఇటీవల పసిఫిక్‌ మహాసముద్రంలోకి విడుదల చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. అణు వ్యర్థ జలాలు సముద్రంలో కలవడం వల్ల కాలుష్యం పెరగడమేగాక.. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని జపాన్‌ సముద్ర ఆహార దిగుమతులపై చైనా నిషేధం విధించింది. ఈ భయాలను పోగొట్టేందుకు జపాన్‌ ప్రధాని స్వయంగా రంగంలోకి దిగటం ఆసక్తికరం. వ్యాపారులకు అండగా నిలుస్తామని కిషిద హామీ ఇచ్చారు. ఈ వీడియోను జపాన్‌ ప్రధాని కార్యాలయం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయగా వైరల్‌గా మారింది. జపాన్‌లోని అమెరికా రాయబారి రామ్‌ అమాన్యూల్‌ సైతం టోక్యో మార్కెట్లో సముద్ర ఆహారాన్ని ఆరగించి చైనా నిషేధం సరికాదని విమర్శించారు. ఫుకుషిమా అణువిద్యుత్తు కేంద్రంలో 2011 నుంచీ వ్యర్థ జలాలను 1.34 మిలియన్‌ టన్నుల మేర భారీ ట్యాంకుల్లో నిల్వ చేశారు. ఇప్పుడు నిల్వకు చోటు చాలని పరిస్థితి ఏర్పడింది. జపాన్‌ ఈ నీటిని వివిధ దశల్లో శుద్ధి చేసి రానున్న 30 ఏళ్లలో పూర్తిగా సముద్రంలో కలిపేందుకు చర్యలు చేపట్టింది. అణు జలాల్లో ట్రీటియం, కార్బన్‌-14 మూలకాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అణు జలాల కారణంగానే జపాన్‌ మత్స్యసంపద నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని