Israel: యుద్ధ విస్తరణకు సంకేతమా?

పాలస్తీనాపై సాగుతున్న ఇజ్రాయెల్‌ యుద్ధం అక్కడితో ఆగుతుందా? విస్తరిస్తుందా? ఇతర దేశాలూ ఇందులో అడుగుపెడతాయా? బుధవారంనాటి పరిణామాలను చూస్తుంటే ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Updated : 12 Oct 2023 05:56 IST

సిరియా, లెబనాన్‌ల నుంచీ ఇజ్రాయెల్‌పై దాడులు      
పాలస్తీనాకు ఇరాన్‌, ఖతార్‌, కువైట్ల మద్దతు
ఇజ్రాయెల్‌కు అమెరికా, ఈయూ పూర్తి అండాదండ    
ఐరాసతోపాటు ప్రపంచ దేశాల్లో ఆందోళన

పాలస్తీనాపై సాగుతున్న ఇజ్రాయెల్‌ యుద్ధం అక్కడితో ఆగుతుందా? విస్తరిస్తుందా? ఇతర దేశాలూ ఇందులో అడుగుపెడతాయా? బుధవారంనాటి పరిణామాలను చూస్తుంటే ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు.. లెబనాన్‌, సిరియాల నుంచీ ఇజ్రాయెల్‌ వైపు రాకెట్లు దూసుకురావడం, ఖతార్‌, ఇరాన్‌లాంటివి పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తుండటం.. మరోవైపు అమెరికా, ఈయూ దేశాలు ఇజ్రాయెల్‌కు పూర్తి అండదండలందించడంతో ఐక్యరాజ్య సమితి సహా అందరిలోనూ ఆందోళన మొదలైంది.

వారూ దిగితే..

పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్‌పై గాజాలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌కు బుధవారం మరోవైపు నుంచి దాడి ఎదురైంది. అది పక్కనున్న లెబనాన్‌, సిరియాల వైపు నుంచి. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా, సిరియాలో తలదాచుకుంటున్న పాలస్తీనా హమాస్‌ దళాలు ఈ దాడులకు పాల్పడి ఉంటాయని భావిస్తున్నారు. అసలే గాజాలో ఇజ్రాయెల్‌ దాడులతో పరిస్థితి దిగజారుతుందని భావిస్తున్న ఐక్యరాజ్య సమితి.. సిరియా, లెబనాన్‌ల నుంచి దాడులతో మరింత ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుపక్షాలూ సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని కోరింది.

హమాస్‌కు సిరియా, లెబనాన్‌ మద్దతుదారులు. ఈ రెండూ యుద్ధంలోకి దిగితే ఇజ్రాయెల్‌పై ముప్పేట దాడిలా అవుతుంది. మూడు వైపులా ఇజ్రాయెల్‌ యుద్ధం చేయాల్సి వస్తుంది. అన్నింటికీ మించి... ఇజ్రాయెలీలపై హమాస్‌ దాడిలో ఇరాన్‌ హస్తం ఉందని తేలితే పరిస్థితి మరింత దిగజారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. లెబనాన్‌, సిరియాలతోపాటు ఇరాన్‌, ఖతార్‌, కువైట్‌ హమాస్‌ను సమర్థిస్తున్నాయి. ఇజ్రాయెల్‌కు చిరకాల శత్రువైన ఇరాన్‌ హమాస్‌ తీవ్రవాదులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందనేది బహిరంగ రహస్యం. ఈ దేశాలన్నీ హమాస్‌ వెనకాల నిలిస్తే యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం పొంచి ఉంది.

 అరబ్‌ ఐక్యతకు చిల్లు?

హమాస్‌కు పశ్చిమాసియాలోని అన్ని అరబ్‌ దేశాల నుంచి మద్దతు లభిస్తుందా.. అంటే ఔనని చెప్పడం కష్టం. 50 ఏళ్ల కిందట పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత వ్యక్తం చేసిన అనేక అరబ్‌ దేశాలు ఇప్పుడదే రీతిలో స్పందించకపోవడం గమనార్హం. పాలస్తీనాపట్ల సానుకూలత, సానుభూతి ఉన్నా ఇజ్రాయెల్‌ పట్ల వ్యతిరేకత అందరిలోనూ వ్యక్తం కావడం లేదు. ఈజిప్టు, బహ్రెయిన్‌, యూఏఈ హమాస్‌ దాడిని తీవ్రంగా ఖండించాయి. కీలకమైన సౌదీ అరేబియా ఎవరి పక్షం వహించకుండా లౌక్యంగా తటస్థంగా ఉండే ప్రయత్నం చేయడం విశేషం. అంటే ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత విషయంలో అరబ్‌లీగ్‌లోనే ఐక్యత లేదు. మారుతున్న ప్రపంచ రాజకీయ భౌగోళిక సమీకరణాల్లో సౌదీ, యూఏఈలాంటి దేశాలు స్వావలంబన దిశగా సాగుతున్నాయి. ఇజ్రాయెల్‌, అమెరికాలతో సత్సంబంధాలను పెంచుకోవాలని భావిస్తున్నాయి.

అందులో భాగంగానే ఒక్కొక్కటిగా తమ వ్యతిరేక వైఖరిని వదిలేస్తూ ఇజ్రాయెల్‌తో ఒప్పందం చేసుకుంటున్నాయి. వీటినే అబ్రహమిక్‌ ఒప్పందాలు అంటారు. ఇప్పటికే ఈజిప్టు, యూఏఈలు ఈ బంధంలో ఉన్నాయి. త్వరలోనే సౌదీ అరేబియా ఒప్పందానికి సిద్ధమవుతోంది. బలమైన అరబ్‌ దేశమైన సౌదీ ఇజ్రాయెల్‌తో దోస్తీ కడితే పాలస్తీనా వాదన బలహీనమవుతుందన్న భయంతోనే ఆ ఒప్పందాన్ని దెబ్బతీయడానికి హమాస్‌ ఈ దాడులకు పాల్పడిందనే వాదన ఉంది. అంటే కేవలం తామే కాకుండా అరబ్‌ దేశాలన్నీ ఇజ్రాయెల్‌తో శత్రుత్వాన్ని కొనసాగించాలని, యుద్ధంలో పాల్గొనాలని హమాస్‌ కోరుకుంటోంది. ఏదో రకంగా యుద్ధాన్ని విస్తరించాలని చూస్తోంది.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని