ఆస్ట్రేలియాలో భారీ వరదలు

ఆస్ట్రేలియాలోని ఉత్తర క్వీన్స్‌లాండ్‌లో జాస్పర్‌ తుపాను కారణంగా భారీ వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి.

Published : 19 Dec 2023 05:40 IST

నీటమునిగిన కెయిర్న్స్‌ విమానాశ్రయం
అంధకారంలో 14 వేల ఇళ్లు

బ్రిస్టేన్‌: ఆస్ట్రేలియాలోని ఉత్తర క్వీన్స్‌లాండ్‌లో జాస్పర్‌ తుపాను కారణంగా భారీ వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో సగటున ఏడాదిలో కురిసే వర్షం ఒక్కరోజులోనే కురిసింది. దీంతో జనజీవనం అల్లకల్లోలమైంది. పలుచోట్ల నివాస ప్రాంగణాలను వరదనీరు ముంచెత్తడంతో ప్రజలు ఇళ్లలో చిక్కుకుపోయారు. మరికొందరు ఇళ్ల పైకప్పుల పైకి చేరుకుని ప్రాణభయంతో గడిపారు. కెయిర్న్స్‌ నగరంలోని విమానాశ్రయంలోకి భారీగా వరద నీరు చేరడతో విమానాలు రెక్కల వరకూ మునిగాయి. రన్‌వేపై మొసళ్లు కూడా కనిపించాయి. దీంతో సోమవారం విమానాశ్రయాన్ని మూసివేసినట్లు అధికారులు తెలిపారు. రహదారులు, రైలు మార్గాలు కూడా దెబ్బతినడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. 14 వేలపై పైగా ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈ నగరంలో తాగునీటి సరఫరాపైనా తీవ్ర ప్రభావం పడింది. కొన్ని చోట్ల నదుల్లోని వరద స్థాయులు 45 ఏళ్ల గరిష్ఠానికి చేరుకున్నట్లు సమాచారం. సహాయక సిబ్బంది వరద నీటిలో చిక్కుకున్న 300 మందిని కాపాడారు. రానున్న 24 గంటల్లో కొన్ని చోట్ల అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పోర్ట్‌ డగ్లస్‌కు ఉత్తరాన ఉన్న వుజాల్‌వుజాల్‌ నగరం పూర్తిగా నీటిలో చిక్కుకుపోయింది. దీనికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ వరదలతో సుమారు బిలియన్‌ డాలర్ల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని