Srilanka Crisis: శ్రీలంకలో ఎమర్జెన్సీ!

తీవ్ర ఆహార, ఇంధన, ఆర్థిక సంక్షోభంలోకి జారుకున్న శ్రీలంకలో ‘ఎమర్జెన్సీ’ అమల్లోకి వచ్చింది! అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇందుకు ఆదేశాలు జారీచేశారు. ప్రజాభద్రత అత్యయిక పరిస్థితి నిబంధనలను అనుసరించి శనివారం సాయంత్రం 6 గంటల

Updated : 03 Apr 2022 05:45 IST

ఆహారం, ఇంధన ధరల దెబ్బకు తీవ్రస్థాయి నిరసనలు
రాజకీయ సంక్షోభం దిశగా ద్వీపదేశం

కొలంబో: తీవ్ర ఆహార, ఇంధన, ఆర్థిక సంక్షోభంలోకి జారుకున్న శ్రీలంకలో ‘ఎమర్జెన్సీ’ అమల్లోకి వచ్చింది! అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇందుకు ఆదేశాలు జారీచేశారు. ప్రజాభద్రత అత్యయిక పరిస్థితి నిబంధనలను అనుసరించి శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 36 గంటల పాటు ఇది అమలులో ఉంటుంది. మార్చిలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో నమోదు కాగా... ఆహార పదార్థాల ధరలు కొండెక్కాయి. పెరిగిన ధరలు సామాన్యులు భరించలేని స్థితికి చేరాయి. బతుకు భారంగా మారడంతో దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు ఎగిసిపడుతున్నాయి. అధ్యక్షుడి నివాసాన్ని ఆందోళనకారులు గురువారం చుట్టుముట్టిన క్రమంలో రాజపక్స శుక్రవారం రాత్రి అత్యయిక పరిస్థితిని ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలులోకి వచ్చింది.  

అన్ని పార్టీలతో ప్రభుత్వాన్ని నెలకొల్పండి...

తాజా పరిణామాలతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం నెలకొంది. దేశంలో అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు చెందిన శ్రీలంక ఫ్రీడం పార్టీ (ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ).. అధ్యక్షుడు గొటబాయ రాజపక్సను కోరింది. లేనిపక్షంలో కూటమి నుంచి వైదొలగుతామని హెచ్చరించింది. అధికారంలో ఉన్న శ్రీలంక పొదుజన పెరమున (ఎస్‌ఎల్‌పీపీ) 11 పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. ఈ కూటమిలో 14 మంది సభ్యులతో సిరిసేనకు చెందిన ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ అతిపెద్ద పార్టీగా ఉంది.  

ఆందోళనలను అణచివేసేందుకే?

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో కొన్నిరోజులుగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. గురువారం అర్ధరాత్రి అధ్యక్షుడి ఇంటిని వారు ముట్టడించారు. ఆదివారం దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలను అణచివేయడానికి రాజపక్స హుటాహుటిన అత్యవసర పరిస్థితి విధించారు.  

భారత్‌ చమురు సాయం

శ్రీలంకలో మార్చి నెలలో ద్రవ్యోల్బణం 18.7%గా నమోదైనట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఆహార పదార్థాల ధరలు రికార్డు స్థాయిలో 30.1% పెరిగాయి! ఇంధన కొరత తీవ్రంగా ఉండటంతో భారత్‌ నుంచి 40 వేల మెట్రిక్‌ టన్నుల ఇంధనంతో ఓ నౌక శ్రీలంక చేరుకుంది. సంక్షోభాన్ని అధిగమించేందుకు భారత్‌ నుంచి శ్రీలంక పొందిన రుణంలో భాగంగా... నౌకలో డీజిల్‌ను తరలించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో గురువారం 13 గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పెట్రోలియం ఉత్పత్తులు కొనేందుకు ఫిబ్రవరిలో 500 బిలియన్‌ డాలర్ల రుణాన్ని మంజూరు చేసిన భారత్‌, తాజా పరిస్థితులను అధిగమించేందుకు ఆ దేశానికి మరో బిలియన్‌ డాలర్ల రుణాన్ని ఇస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా డీజిల్‌ను సరఫరా చేయడం ఇది నాలుగోసారి అని కొలంబోలోని ఇండియన్‌ హైకమిషన్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని