Sri Lanka Crisis: రండి.. ప్రభుత్వంలో చేరండి

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స... తన సోదరుడైన ఆర్థిక మంత్రి బాసిల్‌ రాజపక్సను సోమవారం ఆ పదవి నుంచి తొలగించారు. ఆర్థిక పరిస్థితిని,

Updated : 05 Apr 2022 05:49 IST

విపక్షాలకు శ్రీలంక   అధ్యక్షుడి పిలుపు
తిరస్కరించిన ప్రతిపక్ష నేతలు
మంత్రుల రాజీనామా బూటకమంటూ విమర్శలు
ఆర్థిక మంత్రిని తొలగించిన గొటబాయ
కర్ఫ్యూ విధించినా ఆగని ఆందోళనలు

కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స... తన సోదరుడైన ఆర్థిక మంత్రి బాసిల్‌ రాజపక్సను సోమవారం ఆ పదవి నుంచి తొలగించారు. ఆర్థిక పరిస్థితిని, ఆందోళనలను చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వంలో చేరాలంటూ విపక్షాలకు గొటబాయ ఆహ్వానం పలికారు. కానీ, ప్రతిపక్ష నేతలు అందుకు తిరస్కరించారు.

నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రజాగ్రహం పెల్లుబుకుతుండటంతో ప్రధాని మినహా మిగతా మంత్రులంతా ఆదివారం తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కేవలం నలుగురు మంత్రులను మాత్రమే కొనసాగిస్తున్నట్టు వెల్లడించిన గొటబాయ... సోమవారం తన సోదరుడు, ఆర్థిక మంత్రి బాసిల్‌ రాజపక్సను కూడా పదవి నుంచి తప్పించారు! అధికార ‘ఎస్‌ఎల్‌పీపీ’లో పొరపొచ్చాలకు కేంద్ర బిందువుగా భావిస్తున్న బాసిల్‌ను తప్పించడం ద్వారా రాజకీయ సంక్షోభాన్ని నివారించవచ్చని అధ్యక్షుడు భావించారు. విదేశీ మారక ద్రవ్య లోటు నుంచి బయటపడేందుకు భారత్‌ నుంచి ఆర్థిక సాయం పొందడంలో బాసిల్‌ కీలకంగా వ్యవహరించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నుంచి బెయిల్‌-ఔట్‌ ప్యాకేజీ కోరేందుకు ఆయన అమెరికా వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే అధ్యక్షుడు ఆయన్ను పదవి నుంచి తొలగించారు. ఆదివారం రాత్రి వరకూ న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అలీ సర్బీ... ఇక ఆర్థికశాఖ వ్యవహారాలు చూడనున్నారు. మరోవైపు- ఖాళీ అయిన మంత్రి పదవులను ఇస్తామని, ప్రభుత్వంలో చేరాలని విపక్షాలకు గొటబాయ ఆహ్వానించారు. కానీ, అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన యునైటెడ్‌ పీపుల్స్‌ ఫోర్స్‌ దీన్ని తిరస్కరించింది. మంత్రుల రాజీనామా పర్వాన్ని బూటకంగా పేర్కొంది. ‘‘మాకు రాజీనామాలు కావాలి. సమర్థంగా పనిచేయగల కొత్త రాజకీయ నమూనా కావాలి. శక్తిమంతమైన వ్యవస్థలతో కొత్త శ్రీలంక ఆరంభం కావాలి. మధ్యంతర ప్రభుత్వమంటే కేవలం అంతర్గత పార్టీ రాజకీయాలే’’ అని ఆ పార్టీ నేత సాజీత్‌ ప్రేమదాస ట్వీట్‌ చేశారు. శ్రీలంక ముస్లిం కాంగ్రెస్‌ సహా తమ పార్టీ కూడా ప్రభుత్వంలో చేరబోదని తమిళ్‌ పీపుల్స్‌ అలయెన్స్‌ నేత మనో గణేశన్‌ ప్రకటించారు.


సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ రాజీనామా

మంత్రుల క్రమంలోనే సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ అజిత్‌ నివార్డ్‌ కబ్రాల్‌ కూడా సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. 2021, సెప్టెంబరులో ఆయన రెండోసారి ఈ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 2006-15 మధ్య కూడా కబ్రాల్‌ ఈ పదవిని చేపట్టారు. దేశం ఆర్థికంగా పతనమవుతున్నా... విదేశాల నుంచి ఆర్థిక సాయం, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి రుణాలు తీసుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు. దేశంలో ద్రవ్యోల్బణం అత్యంత గరిష్ఠ స్థాయికి చేరడం, ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న క్రమంలో కబ్రాల్‌ రాజీనామా చేశారు.


ప్రధాని నివాసం గేట్లు తట్టిన ఆందోళనకారులు?

శ్రీలంకలో నిత్యావసరాల ధరల పెరుగుదలను నిరసిస్తూ ఆందోళనలు చేలరేగడంతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశంలో అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. కర్ఫ్యూ నిబంధనలను ఆందోళనకారులు ఏమాత్రం పట్టించుకోకుండా, దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేయాలని, ఆయన కుటుంబం రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. తంగళ్లెలోని ప్రధాని నివాసాన్ని చుట్టుముట్టేందుకు సుమారు 2 వేల మంది ప్రయత్నించారు. బారీకేడ్లను తొలగించి మరీ ముందుకు సాగుతుండటంతో... పోలీసులు వారిపై బాష్పవాయు గోళాలను, జల ఫిరంగులను ప్రయోగించారు. కొంతమంది ఆందోళనకారులు పోలీసులను తప్పించుకుని ప్రధాని నివాసం గేట్ల వరకూ వెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని