ఇదే మహాబిలం

మన పాలపుంత నడిబొడ్డున ఉన్న భారీ కృష్ణబిలం ‘శాజిటేరియస్‌-ఎ’ తొలి చిత్రాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు గురువారం ఆవిష్కరించారు. ‘ఈవెంట్‌ హొరైజన్‌ టెలిస్కోప్‌ (ఈహెచ్‌టీ) కొలాబ్రేషన్‌’గా ఏర్పడిన అంతర్జాతీయ పరిశోధన బృందం... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని రేడియో టెలిస్కోప్‌లను

Published : 13 May 2022 06:09 IST

మన పాలపుంత ‘బ్లాక్‌హోల్‌’ తొలిచిత్రం ఆవిష్కరణ

బెర్లిన్‌: మన పాలపుంత నడిబొడ్డున ఉన్న భారీ కృష్ణబిలం ‘శాజిటేరియస్‌-ఎ’ తొలి చిత్రాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు గురువారం ఆవిష్కరించారు. ‘ఈవెంట్‌ హొరైజన్‌ టెలిస్కోప్‌ (ఈహెచ్‌టీ) కొలాబ్రేషన్‌’గా ఏర్పడిన అంతర్జాతీయ పరిశోధన బృందం... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని రేడియో టెలిస్కోప్‌లను ఉపయోగించి భూ పరిమాణంలో ‘వర్చువల్‌ టెలిస్కోప్‌’ను రూపొందించింది. దీన్ని ఉపయోగించి 2017లో అనేక నిశి రాత్రుల్లో ‘శాజిటేరియస్‌-ఎ’ లక్ష్యంగా ఖగోళ శాస్త్రవేత్తలు డేటా సేకరించారు. దీని ఆధారంగా మహాబిలం తొలి సమగ్ర చిత్రాన్ని రూపొందించారు. జర్మనీలోని యూరోపియన్‌ సదరన్‌ అబ్జర్వేటరీ ప్రధాన కార్యాలయంతో పాటు... ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల ఖగోళ పరిశోధకులు ఏకకాలంలో ఈ వివరాలను వెల్లడించారు. భూమికి 27 వేల కాంతి సంవత్సరాల సుదూరాన ఉన్న కృష్ణబిలం వద్ద జరుగుతున్న పరిణామాలపై కొత్త విషయాలను తెలుసునే అవకాశాన్ని ఈ పరిశోధన వీలు కల్పిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.బ్లాక్‌హోల్‌ కనిపించే వస్తువేమీ కాదు. కటిక చీకటిగా ఉంటుంది. అయితే దాని చుట్టూ అత్యంత వెలుగుల రింగు ఉంటుంది. మన సూర్యుడి కంటే 40 లక్షల రెట్లు పెద్దదైన ఈ బ్లాక్‌హోల్‌... తన శక్తిమంతమైన గురుత్వాకర్షణ శక్తి ద్వారా కాంతిని గ్రహించడం వల్లే ఈ రింగు ఏర్పడుతున్నట్టు పరిశోధకులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని