Ukraine Crisis: ఉక్రెయిన్‌ సైనికుల లొంగుబాటు

యుద్ధం మొదలైనప్పటి నుంచి మేరియుపొల్‌లోని అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగార ప్రాంగణ బంకర్లలో తలదాచుకుంటూ.. పుతిన్‌ సేనలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌ సైనికుల్లో దాదాపు 260 మంది మంగళవారం రష్యాకు లొంగిపోయారు. వీరిని రష్యా నియంత్రణలోని ప్రాంతాలకు తరలించారు. అమెరికా నౌకాదళానికి చెందిన విశ్రాంత అడ్మిరల్‌ ఇరిక్‌ ఒల్సన్‌, బ్రిటన్‌కు చెందిన విశ్రాంత లెఫ్టినెంట్‌ కర్నల్‌, నలుగురు నాటో సైనిక శిక్షకులు సయితం లొంగిపోయిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా

Updated : 18 May 2022 06:02 IST

రష్యా నియంత్రణలోని ప్రాంతాలకు 260 మంది తరలింపు
అజోవ్‌స్తల్‌ వద్ద పోరులో కీలక మలుపు
మేరియుపొల్‌ రష్యా హస్తగతం!

కీవ్‌: యుద్ధం మొదలైనప్పటి నుంచి మేరియుపొల్‌లోని అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగార ప్రాంగణ బంకర్లలో తలదాచుకుంటూ.. పుతిన్‌ సేనలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌ సైనికుల్లో దాదాపు 260 మంది మంగళవారం రష్యాకు లొంగిపోయారు. వీరిని రష్యా నియంత్రణలోని ప్రాంతాలకు తరలించారు. అమెరికా నౌకాదళానికి చెందిన విశ్రాంత అడ్మిరల్‌ ఇరిక్‌ ఒల్సన్‌, బ్రిటన్‌కు చెందిన విశ్రాంత లెఫ్టినెంట్‌ కర్నల్‌, నలుగురు నాటో సైనిక శిక్షకులు సయితం లొంగిపోయిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన 53 మందికి తరలింపు తర్వాత వైద్య సహాయం అందిస్తున్నారు. ఈ లొంగుబాటుతో మేరియుపొల్‌ ఇక పూర్తిగా రష్యా వశమైనట్లే! అయితే సైనికుల ‘మిషన్‌’ పూర్తయిందని, ఇంకా అజోవ్‌స్తల్‌లో మిగిలి ఉన్న కొద్దిమందిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని ఉక్రెయిన్‌ తెలిపింది. రష్యాకు చెందినవారిని అప్పగించి, బదులుగా తమ వారిని విడిపించి తీసుకువస్తామని ఉక్రెయిన్‌ రక్షణశాఖ ఉపమంత్రి హన్నా మలైర్‌ తెలిపారు. రష్యా దీనిని ‘సామూహిక లొంగుబాటు’గా ప్రకటించింది. ఉక్రెయిన్‌ ఆ మాట ఉపయోగించలేదు. వీరిని ఏ ప్రాంతానికి తీసుకువెళ్లారు? వీరి భవిష్యత్తు ఏమిటి అనేది మాత్రం అంతుచిక్కడం లేదు. అజోవ్‌ రెజిమెంట్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలా అనేది రష్యా సర్వోన్నత న్యాయస్థానం తేల్చనుంది. దీనిపై ఈ నెల 26న మాస్కోలో విచారణ జరగనుంది.


వారు ప్రాణాలతో ఉండడం అవసరం: జెలెన్‌స్కీ

ప్రాణాలకు తెగించి పోరాడిన తమ సైనికుల్ని అన్నివిధాలా రక్షిస్తామని, దీనికి కొంత సమయం పడుతుందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. ‘ప్లాంటులోని భూగర్భంలో ఉంటూ రష్యా దాడుల్ని వీరంతా తిప్పికొట్టారు. అలాంటి హీరోలు ప్రాణాలతో ఉండడం ఉక్రెయిన్‌కు అవసరం. అది మా సిద్ధాంతం’ అని వివరించారు. చికిత్స పొందుతున్న వారిని యుద్ధ ఖైదీలుగా పరిగణిస్తారా లేదా అనేది స్పష్టం కాలేదు. అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగారంలో ఉన్న వందలాది మంది ఉక్రెయిన్‌ సైనికులు చివరివరకు పోరాడారు. మరికొందరు సైనికులు అక్కడే ఉండొచ్చని భావిస్తున్నారు.   రష్యా దళాలు డాన్‌బాస్‌ ప్రాంతంలోని కీలక ప్రాంతాల్లో భారీఎత్తున బాంబులు కురిపించాయి. లుహాన్స్క్‌, దొనెట్స్క్‌లలో జరిగిన దాడుల్లో ఇరవై మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లివీవ్‌ కూడా పేలుళ్లతో దద్దరిల్లింది. పోలండ్‌ సరిహద్దుకు 15 కి.మీ. దూరంలో ఉన్న యవొరివ్‌ జిల్లాలో సైనిక శిబిరం మీదా రష్యా దాడి చేసింది. వాటికన్‌ విదేశాంగ మంత్రి ఆర్చిబిషప్‌ పాల్‌ గల్లాఘెర్‌ బుధవారం ఉక్రెయిన్‌కు వెళ్లనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని