Ukraine Crisis: మైకోలైవ్‌పై మాస్కో దాడులు

పుతిన్‌ సేనలు గురువారం కూడా ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేపట్టాయి. తూర్పు ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డాయి. యుద్ధ విమానాలను ప్రయోగించి పోక్రోవ్‌స్క్‌ నగరంలోని

Updated : 27 May 2022 10:05 IST

ఎలక్ట్రానిక్‌ ఇంటెలిజెన్స్‌ సెంటర్‌ ధ్వంసం

11 మంది ఉక్రెయిన్‌ సైనికులు, 15 మంది విదేశీ నిపుణుల మృతి

మాస్కో, కీవ్‌: పుతిన్‌ సేనలు గురువారం కూడా ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేపట్టాయి. తూర్పు ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డాయి. యుద్ధ విమానాలను ప్రయోగించి పోక్రోవ్‌స్క్‌ నగరంలోని రైల్వేస్టేషన్‌ను ధ్వంసం చేసిన మాస్కో... ఈ క్రమంలోనే మైకోలైవ్‌పైనా భీకర దాడులకు పాల్పడింది. ఇక్కడ ఉక్రెయిన్‌కు చెందిన ఎలక్ట్రానిక్‌ ఇంటెలిజెన్స్‌ సెంటర్‌ను మట్టుబెట్టింది. ఈ ఘటనలో 11 మంది ఉక్రెయిన్‌ సైనికులు, 15 మంది విదేశీ నిపుణులు మరణించినట్టు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. గత 24 గంటల వ్యవధిలో రెండు మందుగుండు డిపోలు, 48 సైనిక, ఆయుధ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టినట్టు తెలిపింది. బ్రిటన్‌ రక్షణశాఖ మాతం... ఉక్రెయిన్‌ ప్రతిఘటన శక్తికి రష్యా తాళలేకపోతోందని, వ్యూహాత్మక తప్పిదాల కారణంగా పుతిన్‌ సేనలు మరోసారి తీవ్ర నష్టం చవిచూశాయని పేర్కొంది. ఉక్రెయిన్‌ ఇకనైనా క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను గ్రహించి, తమ డిమాండ్లను అంగీకరించాలని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ సూచించారు.

రష్యా తదుపరి లక్ష్యం వాటిపైనే...
ప్రస్తుత యుద్ధంలో ఉక్రెయిన్‌ పరాజయం పాలైతే... రష్యా తమ దేశంతో పాటు పోలండ్‌, ఎస్తోనియా, లిథువేనియా, లాత్వియాలను కూడా లక్ష్యం చేసుకునే ప్రమాదముందని స్లొవేకియా ప్రధాని ఎడ్వర్డ్‌ హెగెర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తాము ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. స్లొవేకియా ఇప్పటికే నాటో, యూరోపియన్‌ యూనియన్‌లలో సభ్య దేశంగా ఉంది.

ఆంక్షలు ఎత్తేయాలంటూ రష్యా ఒత్తిడి
తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలంటూ పశ్చిమ దేశాలపై రష్యా ఒత్తిడి తెస్తోంది. ఆంక్షల కారణంగానే... ఉక్రెయిన్‌ నుంచి లక్షల టన్నుల ఆహార ధాన్యాలు, వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయాయంటూ స్వరం మార్చింది! పశ్చిమ దేశాలు తమపై చర్యలు తీసుకోవడం వల్లే ఆహార సంక్షోభం నెలకొందని దిమిత్రి పెస్కోవ్‌ విమర్శించారు. విత్తనాలు, ఎరువులు, ఆహార ధాన్యాల ఎగుమతులపై ఆంక్షలే లేనప్పుడు... పశ్చిమ దేశాలపై ఆరోపణలు గుప్పించడం అర్థరహితమని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ మండిపడ్డారు. ఆంక్షలను ఎత్తివేసే ప్రసక్తే లేదని బ్రిటన్‌ తేల్చిచెప్పింది.

మళ్లీ వడ్డీ రేటు తగ్గింపు
రష్యా సెంట్రల్‌ బ్యాంకు వడ్డీ రేట్లను గురువారం 14% నుంచి 11 శాతానికి తగ్గించింది. ద్రవ్యోల్బణంలో తగ్గుదల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభించిన తర్వాత వడ్డీ రేటును 20 శాతానికి పెంచిన పుతిన్‌ సర్కారు... ఆ తర్వాత దాన్ని తగ్గించుకుంటూ రావడం ఇది వరుసగా మూడోసారి.

ఆహార ధాన్యాలను తెప్పించాల్సిందే...
యుద్ధం నాలుగో నెలకు చేరుతుండంతో... ఆహార సంక్షోభ నివారణకు పరిష్కారాలు కనుగొనాలని ప్రపంచ నేతలను ప్రపంచ వాణిజ్య సంస్థ కోరింది. ఉక్రెయిన్‌ రేవుల్లో నిలిచిపోయిన ఆహార ధాన్యాలను అక్కడ నుంచి రప్పించాల్సిన అవసరముందని... యెమెన్‌, సోమాలియా, అఫ్గానిస్థాన్‌లలో ఆహార సంక్షోభం నివారణకూ, ఉక్రెయిన్‌ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకూ ఇది అవసరమని ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రతినిధి జాన్‌ డ్యూమౌంట్‌ చెప్పారు. కాగా- నల్లసముద్ర ఓడ రేవుల నుంచి విదేశీ నౌకలు సురక్షితంగా వెనుతిరిగి వెళ్లేందుకు ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటుచేస్తామని రష్యా రక్షణశాఖ తెలిపింది. ఒడెసా, ఖేర్సన్‌, మైకోలైవ్‌ తదితర ఆరు రేవుల్లో 16 దేశాలకు చెందిన మొత్తం 70 నౌకలు నిలిచిపోయినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని