Published : 29 May 2022 04:48 IST

మరో ముందడుగు వేశాం

  లైమన్‌ నగరానికి ‘స్వేచ్ఛ’ కల్పించినట్లు రష్యా వెల్లడి  

 డాన్‌బాస్‌ ముమ్మాటికీ తమదేనన్న ఉక్రెయిన్‌ 

క్రమటోర్స్క్‌: సొంత సైనికులు, తమ అనుకూల వేర్పాటువాదులు కలిసి ఉక్రెయిన్‌లోని లైమన్‌ నగరానికి ‘పూర్తి స్వేచ్ఛ’ కల్పించినట్లు రష్యా ప్రకటించింది. డాన్‌బాస్‌ ప్రాంతంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న పుతిన్‌ సేనలు ఇలాంటి చిన్నచిన్న నగరాలను స్వాధీనం చేసుకుని ముందడుగు వేయాలని ప్రయత్నిస్తున్నాయి. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు లైమన్‌ నగర జనాభా ఇరవై వేలు. రైల్వేపరంగా రవాణాకు ఈ నగరం ముఖ్యమైనది. ప్రజలను, ఆయుధాలను తరలించడంలో ఉక్రెయిన్‌కు ఉపయోగపడిన లైమన్‌ ఇప్పుడు రష్యా చేతికి వెళ్లడంతో ఎలాంటి ప్రభావం పడుతుందనేది తెలియాల్సి ఉంది. దొనెట్స్క్, లుహాన్స్క్‌ నగరాలకు వెళ్లేందుకు రష్యా సైనికులకు వెసులుబాటు లభిస్తుందని భావిస్తున్నారు. కీవ్‌ నగరాన్ని చేజిక్కించుకోవడం సాధ్యం కాకపోవడంతో డాన్‌బాస్‌ ప్రాంతంలోని చిట్టచివరి ప్రాంతాలపై రష్యా దృష్టి కేంద్రీకరించి, ఒక్కొటొక్కటిగా స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది. లుహాన్స్క్‌ ప్రావిన్స్‌లోని సీవియెరోదొనెట్స్క్, లిసిచన్స్క్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోరు కొనసాగింది. మేరియుపొల్‌ తరహా పరిస్థితులు ఇక్కడా ఎదురవుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

మేరియుపొల్‌ నుంచి నౌకల రాకపోకలు 

తీర నగరమైన మేరియుపొల్‌లో శనివారం నుంచి నౌకల రాకపోకలు మొదలయ్యాయి. అజోవ్‌ సముద్ర తీరంలో మందుపాతరల్ని తొలగించడంతో ఇది సాధ్యమైందని రష్యా అధికారిక వార్తాసంస్థ తెలిపింది. తమ నౌకల్ని రష్యా అడ్డగిస్తోందని, ఆ దేశానికి చెందిన నౌకలు 16 క్షిపణులతో నల్లసముద్రంలో మోహరించాయని ఉక్రెయిన్‌ ఆరోపించింది. మరింత అధునాతన, శక్తిమంతమైన ఆయుధాలను తమకు సమకూర్చాలని పాశ్చాత్య దేశాలను మరోసారి కోరింది. దీర్ఘశ్రేణి రాకెట్‌ వ్యవస్థలను ఉక్రెయిన్‌కు పంపేందుకు అమెరికా సమాయత్తమవుతోందన్న వార్తల్ని అగ్రరాజ్య రక్షణ శాఖ ధ్రువీకరించలేదు. తమ దేశాన్ని చేరుకోగలిగే రాకెట్లను ఉక్రెయిన్‌కు సమకూరిస్తే అతితీవ్ర చర్యలుంటాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్‌ హెచ్చరించారు. బేరెంట్స్‌ సముద్రం నుంచి నూతన హైపర్‌సోనిక్‌ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. 

రష్యాపై భ్రమల్ని చిత్తుచేశాం: జెలెన్‌స్కీ 

రష్యా సైన్యం ఎవరిపైనైనా కొన్ని రోజుల్లోనే విజయం సాధించగలదనే భ్రమలను చిత్తుచేశామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులతో వీడియో ద్వారా మాట్లాడుతూ.. రష్యా సైన్యం అసాధారణమైనదనేది వాస్తవం కాదని రుజువు చేసినట్లు చెప్పారు. తూర్పు ప్రాంతాల్లో పరిస్థితి క్లిష్టంగా ఉన్నా, తాము పట్టు నిలబెట్టుకుంటామని, డాన్‌బాస్‌ ముమ్మాటికీ తమదేనని చెప్పారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపకపోతే దేశంలో అనాథలు ఎక్కువైపోతారని రష్యా కమ్యూనిస్ట్‌ పార్టీ నేత లియోనిడ్‌ వస్యుకెవిచ్‌ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ప్రిమోర్స్క్‌ ప్రాంతీయ శాసనసభాపక్ష సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ- ఉక్రెయిన్‌లో సైనిక చర్య నిలిపివేసి, రష్యా బలగాలను ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. 

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts