ఆర్థికంగా అగాధంలోకి శ్రీలంక!

శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రి రణిల్‌ విక్రమసింఘే బుధవారం ప్రకటించారు. ఆహారం, ఇంధనం, గ్యాస్‌, విద్యుత్తుకు కటకటతో పాటు భవిష్యత్తు పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

Published : 23 Jun 2022 03:47 IST

వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని ప్రధాని రణిల్‌ విక్రమసింఘే ప్రకటన

కొలంబో: శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రి రణిల్‌ విక్రమసింఘే బుధవారం ప్రకటించారు. ఆహారం, ఇంధనం, గ్యాస్‌, విద్యుత్తుకు కటకటతో పాటు భవిష్యత్తు పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అదనపు రుణసాయానికి గాను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌)తో వీలైనంత త్వరగా ఒప్పందం కుదరడం అత్యవసరమని స్పష్టం చేశారు. ఇంతవరకు శ్రీలంక ప్రభుత్వం చేపట్టిన ఉపశమన చర్యలను పార్లమెంటుకు వివరించిన సందర్భంగా ఆయన పలు కీలకాంశాలను వెల్లడించారు. విదేశీ మారకద్రవ్య నిల్వలు ప్రమాదకర స్థితిలో అడుగంటిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం అంత సులువు కాదని తేల్చిచెప్పారు. ప్రారంభంలోనే తగిన చర్యలు చేపట్టి ఉంటే.. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. మరింత అగాధంలోకి జారిపోకుండా ఉండేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వివరించారు. ‘‘ఎలాగైనా ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడాలి. లేనట్లయితే దేశంలో మరే సమస్యకూ మనం పరిష్కారాన్ని కనుగొనలేం’’ అని విక్రమసింఘే అన్నారు. ఇందులోభాగంగా ముందు విదేశీమారక నిల్వలను పునరుద్ధరించాల్సి ఉందన్నారు. ఐఎంఎఫ్‌తో చర్చలు జరపడం మాత్రమే ప్రభుత్వం ముందున్న సురక్షిత అవకాశమని చెప్పారు.

భారత్‌ సాయం విరాళమేమీ కాదు..

దివాలా తీసిన శ్రీలంకకు ఈ ఏడాది జనవరి నుంచి భారత్‌ అందిస్తున్న రుణసాయం జీవరేఖలా నిలుస్తూ వచ్చింది. అయితే సుదీర్ఘకాలం పాటు భారత్‌ కూడా సాయం అందించలేదని విక్రమసింఘే పేర్కొన్నారు. ‘‘భారత్‌ నుంచి రుణసాయంగా ఇప్పటికే 400 కోట్ల డాలర్లు తీసుకున్నాం. మరింత సాయాన్ని కోరుతున్నాం. దీనికి కూడా పరిమితి ఉంటుంది. ఆ రుణాలను తిరిగి చెల్లించే ప్రణాళిక కూడా మనవద్ద ఉండాలి. ఇవి విరాళాలేమీ కావు’’ అని పేర్కొన్నారు. శ్రీలంకలో స్థానిక ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడానికి రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి ఉన్నతస్థాయి బృందం గురువారం కొలంబో రానున్నట్లు తెలిపారు. ‘‘ప్రస్తుతం సిలోన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌కు 70 కోట్ల డాలర్ల అప్పు ఉన్నందున ప్రపంచంలో ఏ దేశమూ, సంస్థా మనకు ఇంధనం సరఫరాకు ఇష్టపడదు’’ అని తెలిపారు. ఐఎంఎఫ్‌ బృందం శ్రీలంకకు వచ్చిందని, రానున్న కొద్ది రోజులపాటు చర్చలు జరపనున్నట్లు ఆయన ఇప్పటికే వెల్లడించారు. జులై ఆఖరుకు ఐఎంఎఫ్‌తో అధికారిక స్థాయి ఒప్పందానికి వస్తామని.. ఒకసారి ఈ ఒప్పందం కుదుర్చుకోగలిగితే ప్రపంచం విశ్వాసాన్ని శ్రీలంక మళ్లీ చూరగొనగలుగుతుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని